Bajrang dal gun training: 'శౌర్య ప్రశిక్షణ వర్గ' పేరిట కర్ణాటక కొడగు జిల్లా పొన్నంపేట్లో బజరంగ్ దళ్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమం వివాదాస్పదమైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు కత్తులు, ఎయిర్ గన్స్, త్రిశూలాలు పట్టుకుని, వాటిని ఎలా వాడాలో శిక్షణ తీసుకుంటున్నట్లు ఫొటోలు, వీడియోల్లో కనిపించడమే ఇందుకు కారణం. మే 5 నుంచి 11 వరకు శ్రీ శంకర్ విద్యా సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
తుపాకులు, కత్తులు, శూలాలతో బజరంగ్ దళ్ ట్రైనింగ్! - bajrang dal training camp
Bajrang dal weapons: తుపాకులు, కత్తులు, త్రిశూలాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు శిక్షణ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మతం పేరిట హింస ఎలా చేయాలో నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. స్వీయ రక్షణలో శిక్షణ మాత్రమే ఇస్తున్నట్లు బజరంగ్ దళ్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
'ఆయుధాల వాడకంపై శిక్షణ' వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. "బజ్రంగ్ దళ్ కార్యకర్తలకు ఆయుధాల వాడకంపై శిక్షణ ఎందుకు? సరైన లైసెన్స్ లేకుండా ఆయుధాల వాడకంపై శిక్షణ ఇవ్వడం నేరం కాదా? 1959 నాటి ఆయుధాల చట్టం, 1962 నాటి ఆయుధాల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? ఈ కార్యక్రమానికి భాజపా నేతలు ఎందుకు బాహాటంగా మద్దతు ఇస్తున్నారు" అని నిలదీశారు కర్ణాటక ఎమ్మెల్యే దినేశ్ గుండూరావు. "మతం పేరిట హింసకు ఎలా పాల్పడాలో నేర్పుతూ యువత జీవితాలను బజరంగ్ దళ్ నాశనం చేస్తోంది. దీనిని తక్షణమే ఆపాలి" అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్.
ఈ శిక్షణ కార్యక్రమంపై విమర్శల్ని తోసిపుచ్చింది బజరంగ్ దళ్. స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలో మాత్రమే నేర్పామని, ఆయుధాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు ఆ సంస్థ ప్రతినిధి. అటు.. శ్రీరామ్ సేన నేత ప్రమోద్ ముతాలిక్ సైతం ఈ చర్యను సమర్థించారు. "యువతలో ఆత్మవిశ్వాసం పెంచేందుకే ఈ కార్యక్రమం. ఇందులో కొత్తేం లేదు. గతంలోనూ ఇలానే జరిగింది. ఇందులో అక్రమం, దేశద్రోహం ఏమీ లేదు. యువతలో మేము దేశ భక్తిని పెంచుతున్నాం అంతే. ఇలాంటి శిక్షణతో యువత సైన్యంలో చేరడం సులువు అవుతుంది" అని వివరించారు ప్రమోద్. మరోవైపు.. ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.