బజరంగ్ దళ్‌పై నిషేదం అంశాన్ని ఎన్నికల మానిఫెస్టో నుంచి తొలగించే పసక్తేలేదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బీజేపీ ఏం చేసినా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని తేల్చి చెప్పారు. గురువారం బెంగళూరులోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బజరంగ్ దళ్‌కు, ఆంజనేయ స్వామికి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను కూడా రాముడు, ఆంజనేయ స్వామి, శివుడికి భక్తుడేనంటూ వివరించారు. రోజు హనుమాన్ చాలీసా పఠిస్తానని శివకుమార్ తెలిపారు.
"బీజేపీ వారు మాత్రమే భక్తులు కాదు. మేమూ భక్తులమే. బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తే బీజేపీకి ఎందుకంత భయం? బజరంగ్ దళ్ విషయంలో బీజేపీ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. కర్ణాటక ప్రజలు దీనిని క్రమంగా అర్థం చేసుకుంటారు. ఆంజనేయ స్వామి, బజరంగ్ దళ్.. రెండూ వేర్వేరు. మేం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. బీజేపీ మా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని తీసుకుని డ్రామాలు చేస్తోంది. ఇవేవీ పనిచేయవు. బీజేపీ ఏం చేసినా.. మాకు కచ్చితంగా 141 సీట్లు వస్తాయి."
- డీ.కే శివకుమార్, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు.
దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో చేపట్టబోయే 37 కిలోమీటర్ల రోడ్‌షోపై మాట్లాడిన శివకుమార్.. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. 37 కిలోమీటర్లకు కాకపోతే 370 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకోవచ్చని మోదీని ఉద్దేశిస్తూ శివకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు కూడా అవకాశం ఇస్తే.. తాము ర్యాలీ చేస్తామని శివకుమార్ వివరించారు.