Bail Granted to 8 Accused in TSPSC Paper Leakage : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 8 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. నీలేశ్ నాయక్, కెతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్ సహా మొత్తం 8 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే నిందితులు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని.. నిర్దేశించిన తేదీల్లో సిట్ విచారణకు హాజరు కావాలని తెలిపింది.
బెయిల్ కోసం మరో ఐదుగురి పిటిషన్..: ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇప్పటికే ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రేణుక, రమేశ్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా.. వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఏ-1 ప్రవీణ్ కుమార్, ఏ-2 రాజశేఖర్, ఏ-4 ఢాక్యా నాయక్, ఏ-5 రాజేశ్వర్ నాయక్ సహా మొత్తం ఐదుగురు నిందితులు బెయిల్ కోసం నేడు నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రేణుక చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేణుక అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు తన కుమార్తె బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలన్న ఆమె తరఫు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రమేశ్, ప్రశాంత్ రెడ్డికి సైతం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రమేశ్, ప్రశాంత్ రెడ్డిల బెయిల్ ఆర్డర్లను చంచల్‌గూడ జైలుకు సకాలంలో అందించకపోవడంతో ఆ ఇద్దరు నేడు ఉదయం విడుదలయ్యారు.
కస్టడీ కోసం ఈడీ పిటిషన్..: ఇదిలా ఉండగా.. ఈ కేసులోని పలువురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు మరోసారి కోర్టును ఆశ్రయించారు. రేణుక రాఠోడ్, రాజేశ్వర్, ఢాక్యా నాయక్, గోపాల్, నీలేష్‌లను కస్టడీకి ఇవ్వాలంటూ ఎంఎస్‌జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో నాంపల్లి కోర్టులో ఈడీకి చుక్కెదురు కాగా.. నేడు మరోసారి ఎంఎస్‌జే కోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి..
ED Custody Petition in TSPSC Paper leak : నిందితుల కస్టడీ కోసం మరోసారి ఈడీ పిటిషన్
TSPSC Paper Leak Case : పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు.. రేణుకకు బెయిల్