స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ తల్లి కడుపులోని కవలలు మరణించారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడమే ఇందుకు కారణం. తల్లీబిడ్డల్ని కాపాడాలన్న తపనతో ఆమెను మోస్తూ బంధువులు అడవిలో 3 కిలోమీటర్లు కష్టపడి నడిచినా ప్రయోజం లేకుండా పోయింది.
గర్భిణీని మోస్తూ అడవిలో 3కిమీ నడక, అయినా దక్కని కవలల ప్రాణాలు - tribal issues in maharashtra
రహదారి, వైద్య సదుపాయాల లేమి రెండు ప్రాణాల్ని బలిగొంది. ప్రసవ వేదనతో ఉన్న గిరిజన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురై ఆమె గర్భంలోని కవలలు మరణించారు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో సోమవారం జరిగిందీ ఘటన.

పంద్రాగస్టు నాడే..
వందనా బుధార్.. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బొటోషీ గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల మర్కట్వాడీ గిరిజన తండాకు చెందిన మహిళ. నిండు గర్భవతి అయిన ఆమెకు సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్దామంటే సమీపంలో ఆస్పత్రి లేదు. కాస్త దూరాన ఉన్న హాస్పిటల్‌కు వెళ్లేందుకు గిరిజన తండా నుంచి రోడ్డు లేదు.
అయినా బంధువులంతా కలిసి వందనను ఆస్పత్రికి చేర్చాలనుకున్నారు. ఓ ఇనుప గొట్టానికి దుప్పటిని కట్టారు. ఆ డోలీలో ఆమెను కూర్చోబెట్టి, ఇనుప పైప్‌ను భుజాలపై పెట్టుకుని నడక ప్రారంభించారు. అడవిలో కొండలు, వాగులు దాటుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచారు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. ఫలితంగా వందన గర్భంలోని కవలలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మర్కట్వాడీ గిరిజన తండా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.