వాషింగ్ మెషిన్‌లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి.. మృత్యువుతో పోరాడి గెలిచాడు. కోమాలోకి వెళ్లిన ఆ చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
వసంత్ కుంజ్‌కు చెందిన ఓ మహిళ.. తన ఇంట్లోని ఓ గదిలో ఉన్న టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఒక్కసారిగా గదిలో బాబు కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్ మెషిన్‌లో కనిపించాడు. ఆ తర్వాత వెంటనే వాషింగ్ మెషిన్‌లో నుంచి బాబు తీసి వసంత్‌కుంజ్‌లోని ఓ ఫోర్టిస్ ఆసుపత్రికి కుటుంబసభ్యుల సహాయంతో ఆమె తరలించింది.
హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఆ చిన్నారి దాదాపు ఏడురోజులు కోమాలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అనంతరం 12 రోజులు వార్డులో ఉండి చికిత్స పొందాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే కుర్చీ సహాయంతో వాషింగ్ మెషిన్‌పైకి తమ కుమారుడు ఎక్కి ఉండవచ్చని చిన్నారి తల్లి తెలిపింది.