ఓ తల్లి తన 13 నెలల చిన్నారికి ఫుట్పంపు ద్వారా ఊపిరి పోస్తున్న వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. రాయ్‌పుర్ ఎయిమ్స్ బయట గత 5 నెలలుగా ఫుట్‌పాత్‌పైన బాధిత కుటుంబం బిడ్డతో కలిసి జీవిస్తోంది. హర్ష అనే బాలుడు బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అందువల్ల అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి ఫుట్పంపు ద్వారా అతడి తల్లి ఆక్సిజన్ పెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
"నా బిడ్డ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. మొదట్లో ఆరోగ్యం బాగానే ఉన్నా ఆ తర్వాత శరీరంలో కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయలేదు. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు. మందులకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఇక డబ్బులు లేక ఫుట్‌పాత్‌పైన జీవనం సాగిస్తున్నాం. రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో ఉచితంగా చికిత్స అందుతోంది. అయితే మందులకు మా వద్ద డబ్బులు లేవు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ మా బిడ్డ చికిత్స కోసం ఖర్చు చేస్తున్నాం."
-దాస్, బాలుడి తండ్రి