Baby Born With 4 Arms And 4 Legs in Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ మహిళ నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. ఇంటి వద్దే బిడ్డకు జన్మనివ్వగా.. శిశువు ఆరోగ్యం బాగానే ఉందని ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ, కొన్ని గంటల తర్వాత చిన్నారికి శ్వాసకోశ సమస్య మొదలైంది. దీంతో హుటాహుటిన ఆసుపత్రి తీసుకెళ్లారు.
ముజఫర్‌నగర్ జిల్లాలోని మన్సూర్పుర్లో నివాసముంటున్న ఇర్ఫాన్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మంత్రసాని ద్వారా ఆ ముగ్గురు పిల్లలకు ఇంటి దగ్గరే జన్మనిచ్చారు. నాలుగో కాన్పు కూడా అలానే మంత్రసాని సాయంతో ఇంట్లోనే గత సోమవారం మధ్యాహ్నం జరిగింది. పుట్టిన తర్వాత బిడ్డ పరిస్థితి అంతా మామూలుగానే ఉందని భావించారు. కానీ, ఆ తర్వాత శిశువుకు శ్వాస సమస్య మొదలైంది. కుటుంబ సభ్యులు వెంటనే బేగ్రాజ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితిని చూసిన వైద్యులు మేరఠ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లమని చెప్పారు.
ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు నవజాత శిశువు శ్వాస తీసుకోవటంలో పడిందని మేరఠ్ వైద్యకళాశాల పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ నవరతన్ గుప్తా తెలిపారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ట్యూబ్ ద్వారా పాలు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ చెప్పారు. కడుపులో కవలు ఉన్నపుడు ఒక బిడ్డ పూర్తిగా అభివద్ధి చెంది, మరో బిడ్డ సరిగా అభివృద్ధి చెందనప్పుడే ఇలాంటి శిశువులు పుడతారని నవరతన్ గుప్తా పేర్కొన్నారు. 'అదనంగా ఏర్పడిన అవయవాలను శస్త్రచికిత్స చేసి తొలగించాలి. ప్రస్తుతం చిన్నారిని పర్యవేక్షిస్తున్నాం. శిశువు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాక సర్జరీ చేస్తాం' అని నవరతన్ గుప్తా వివరించారు.