Babri Masjid Case Iqbal Ansari On Ram Mandir :త్వరలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులపై బాబ్రీ మసీదు కేసులో ముస్లింపక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ హషీమ్ అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య నగరానికి వచ్చే అతిథులకు ముస్లింల తరఫున స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"2019 నవంబర్ 9న (బాబ్రీ మసీదు కేసులో) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దేశంలోని ముస్లింలు దాన్ని గౌరవించారు. ఇప్పుడు పాత విషయాల్లో ఏం లేదు. అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పుడు దేశంలో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు జరగలేదు. ప్రస్తుతం రామమందిరం పని జరుగుతోంది. ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు (అయోధ్యకు) వస్తున్నారు. మా (ముస్లింల) వైపు నుంచి కూడా వారందరీకీ స్వాగతం పలుకుతున్నాము."
--ఇక్బాల్ అన్సారీ, బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు
అయోధ్యలో అభివృద్ధి పనులు జరగడం మంచి విషయం అని ఇక్బాల్ అన్సారీ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు వచ్చినప్పుడు తమ అతిథి అవుతారని, కాబట్టి వారిని స్వాగతించడం తమ కర్తవ్యం అని చెప్పారు. వచ్చే అతిథులను స్వాగతించాలని తమ మతం కూడా చెబుతోందని తెలిపారు.
"అయోధ్యలో అభివృద్ధి పనులు జరుగుతుండటం మంచి పరిణామం. అయోధ్యలో ఏం లేవో అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడికి వచ్చిపోయేవారు అయోధ్యకు చాలా చరిత్ర ఉంది కానీ అభివృద్ధి మాత్రం లేదు అని అనేవారు. కానీ ప్రధాని మోదీ వాటన్నింటినీ పూర్తి చేశారు. ఇప్పుడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, అనేక పార్కులు, రోడ్లు ఉన్నాయి. ప్రజల అవసరాలన్నీ తీర్చేశారు. అందుకే ప్రజలు ఆయనను ప్రశంసిస్తారు. మేము కూడా అభినందిస్తాము. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి జరగలేదు. ఏ ప్రభుత్వం దాని గురించి ఆలోచించలేదు. నేడు మోదీజీ, యోగిజీ ఆలోచించారు, అభివృద్ధి చేశారు."
--ఇక్బాల్ అన్సారీ, బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు