Babri masjid demolition: వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్ను క్రిమినల్ అప్పీలుగా పరిగణించనున్నట్లు అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆగస్టు 1న ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు లఖ్నవూ బెంచ్ స్పష్టం చేసింది.
అయోధ్య నివాసులైన హజీ మహమ్మద్ అహ్మద్, సయ్యద్ అఖ్లాక్ అహ్మద్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇది విచారణయోగ్యమైన వ్యాజ్యం కాదని జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ జులై 11నే జరగాల్సి ఉంది. పిటిషనర్ అభ్యర్థనతో జులై 18కి వాయిదా పడింది. అయితే, మరోసారి కేసును వాయిదా వేసేది లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు తేల్చిచెప్పింది.