Baba Balak Nath Rajasthan Elections : బాబా బాలక్‌నాథ్.. బీజేపీ యువ, ఫైర్‌బ్రాండ్ నాయకుడు. అల్వార్ నుంచి లోక్‌సభకు ఎన్నికై.. 'రాజస్థాన్ యోగి ఆదిత్యనాథ్'గా రాజకీయాల్లో గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక నేత. సన్యాసి జీవితం, వేషధారణ, రాజకీయ ప్రస్థానం మొదలు.. అన్నింట్లోనూ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సారూప్యత కలిగి ఉన్నారు బాబా బాలక్‌నాథ్. ఇప్పుడు రాజస్థాన్ శాసనసభ ఎన్నికల వేళ ఆయన పేరు సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం అభ్యర్థుల రేసులో బాబా బాలక్‌నాథ్ కూడా ఉన్నారన్న వార్తలే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు.. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సహా మరికొందరు ప్రముఖులతో పోటీ పడుతున్నారు బాబా బాలక్‌నాథ్. ఇప్పటికే రాజస్థాన్ శాసనసభలో సీటు ఖరారు చేసుకున్న ఆయన్ను.. కమలదళం జైపుర్ అధికార పీఠంపై కూర్చోపెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తిజారా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు బాబా బాలక్‌నాథ్. కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై 6,173 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బాలక్‌నాథ్ ఎంపీగా ఉండగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం. 2019లో లోకసభ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జితేంద్ర సింగ్‌ను ఆయన ఓడించారు. పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ ఉండగానే.. బీజేపీ రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో రంగంలోకి దింపింది. 2017లో ఎంపీగా ఉన్న యోగిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా ఎంపిక చేసింది బీజేపీ. ఇప్పుడు అదే తరహాలో బాబా బాలక్‌నాథ్‌కు అవకాశం వస్తుందా అని రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
సీఎం పదవి దక్కడంపై బాబా బాలక్ నాథ్ స్పందించారు. 'ఈ గెలుపు తిజారా ప్రజలు, పార్టీ కార్యకర్తల వల్లే సాధ్యమైంది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము పని చేస్తున్నాం. సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది.' అని ఆదివారం అల్వార్‌లో మీడియా ప్రతినిధులతో చెప్పారు.