Aziz Minat Blind Man Success Story : కంటి చూపులేకపోయినా కుంగిపోలేదు ఆ యువకుడు. కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగాన్ని సాధించారు. సాంకేతికతను ఉపయోగించి క్యాబ్‌ను బుక్ చేసుకోవడం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆర్డర్లు పెట్టుకోవడం వంటి పనులను సులువుగా చేసేస్తున్నారు. రోజుకు దాదాపు 45 నిమిషాల పాటు వ్యాయామం సైతం చేస్తున్నారు. ఆయనే గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన అజీజ్ మినాట్.
అజీజ్ మినాట్ పుట్టిన కొన్నాళ్లకు కంటి చూపును కోల్పోయారు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. అజీజ్‌కు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం సూరత్ నుంచి అహ్మద్‌బాద్‌కు మకాం మార్చింది. అనంతరం అక్కడే ఆశ్రమ్ రోడ్లో ఉన్న అంధుల పాఠశాలలో అజీజ్‌ను చేర్పించారు. అజీజ్ సొంతంగా తన పనులు తానే చేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు ఆశించారు. అందుకోసమే అజీజ్‌ను 12వ తరగతి వరకు హాస్టల్లోనే ఉంచి చదివించారు. అలా కష్టపడి ఉన్నత చదువులు చదివి అజీజ్.. ప్రభుత్వ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం సాధించారు.
"మా హాస్టల్ నుంచి స్కూల్‌కు ఒక కిలోమీటర్ దూరం ఉండేది. ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల నేను సులువుగా స్కూల్‌కు వెళ్లేవాడిని. స్కూల్లో 7వ తరగతి వరకు బ్రెయిలీ లిపిలో పుస్తకాలు దొరికేవి. కానీ 8,9,10,11వ తరగతుల్లో సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల పాఠాలను బ్రెయిలీ లిపిలో చదవలేకపోయేవాడిని. దాని వల్ల క్యాసెట్లలో పాఠాలను ఆడియో రికార్డింగ్ చేసి వినేవాడిని."
--అజీజ్ మినాట్, అంధుడు
ఉద్యోగం వచ్చిన తర్వాత అజీజ్.. అమీనా అనే ఓ అంధురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె అంధురాలైనప్పటికీ ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె.. ప్రతి నాలుగు నెలలకొకసారి దిల్లీలోని ఆఫీసుకు వెళ్లి రావాలి. అయినా అమీనా ఒంటరిగానే దిల్లీ వెళ్లి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు.
తనకు రష్యన్, ఫ్రెంచ్ సాహిత్యం అంటే ఇష్టమని అజీజ్ చెబుతున్నారు. ఆంగ్ల సాహిత్యంలో ఆయన బ్యాచిలర్ డిగ్రీ పట్టాను సైతం పొందారు. అంతేగాక అజీజ్ తన ఫోన్లో సెల్ఫీలను సైతం తీసుకుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఆడియో యాప్‌లను వాడుతుంటారు. సామాజిక సమస్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు.