పాలనలో అత్యంత కీలకమైన ఇండియన్ సివిల్ సర్వీసు (ఐసీఎస్- ఇప్పుడు ఐఏఎస్‌తో సమానం) అధికారి ఉద్యోగం మొదట్లో బ్రిటిష్ వారికి మాత్రమే పరిమితం! ఆ తర్వాత డిమాండ్లు, అవసరాలు పెరగటంతో భారతీయులను కూడా అతి తక్కువ సంఖ్యలో తీసుకోవటం మొదలెట్టారు. మద్రాసు రాష్ట్రం నుంచి తొలి ఐసీఎస్‌గా రత్నవేలు చెట్టి 1876లో ఎంపికయ్యారు. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలే! సేలం, చెంగల్‌పట్, ఉత్తర ఆర్కాట్, మలబార్ తదితర ప్రాంతాల్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అప్పట్లో ఆయనకు నెలకు రూ.15 లక్షల జీతం వచ్చేది. కానీ ఎంత అధికారంలో ఉన్నా, ఆంగ్లేయులతో సమానంగా ఐసీఎస్ పాసై వచ్చినా అడుగడుగునా వివక్ష కొనసాగేది.
పాలక్కడ్ హెడ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా, మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన రత్నవేలు 1881 సెప్టెంబరులో ఓ రోజు తమ పట్టణానికి వచ్చిన కలెక్టర్ గౌరవార్థం విందిచ్చారు. కలెక్టర్ బ్రిటిష్ ఐసీఎస్ అధికారి. విందుకు వచ్చిన ఆయనకు ఎదురేగి ఇంగ్లిష్ పద్ధతుల ప్రకారం షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించారు రత్నవేలు! వెంటనే ఆ కలెక్టర్ జాత్యహంకారంతో దూషించటమే కాకుండా.. వెళ్లి అంతా చూస్తుండగా తన చేతులు (నల్లవాడితో చేతులు కలిపానని) కడుక్కొని వచ్చాడు. పాలక్కడ్‌లో అనేకమంది యురోపియన్లు కూడా ఉండేవారు. వారందరికీ విందు వినోదాల కోసం ఓ క్లబ్ ఉండేది. ఓ రోజు విక్టోరియా మహారాణి పుట్టినరోజు వేడుకలు చేశారక్కడ. ఆ విందుకు యురోపియన్లందరితో పాటు ఉన్నతస్థానంలో ఉన్న రత్నవేలును కూడా పిలిచారు. విందులో రత్నవేలు తప్ప అంతా తెల్లవారే! తిని, తాగి... తెల్లజంటలు బాల్‌రూమ్ డాన్స్ చేస్తుంటే... రత్నవేలు ఓ మూలన చూస్తూ కూర్చున్నారు. డాన్స్ చేస్తూ ఆ మూలకు వెళ్లిన జంటలోని అమ్మాయి... రత్నవేలును చూసి విసుక్కుంది. వెంటనే 'హంసల మధ్య ఎవరీ నల్లకాకి' అంటూ ఎగతాళి చేసింది. అవమానభారంతో వెళ్లిపోయిన రత్నవేలు చెట్టి... తన బంగ్లాలో తుపాకితో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఐసీఎస్‌కు ఎంపికైన తొలి అధికారి అలా తెల్లదొరల వివక్షకు బలయ్యారు.