తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదుకున్న చేతులకే వాతలు పెట్టిన ఆంగ్లేయ సర్కారు - komagata maru 1914

komagata maru ship incident: ఆదుకున్న చేతులకే వాతలు పెట్టింది అలనాటి ఆంగ్లేయ సర్కారు. పొట్టకూటి కోసం వేల మైళ్లు ప్రయాణించి విదేశీగడ్డకు వెళ్లినవారిని తిప్పి పంపటమేగాకుండా.. వచ్చాక నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది. అనేక యుద్ధాల్లో తమకు అండగా నిలిచిన సిక్కులను అనుమానించి తుపాకులు ఎక్కు పెట్టింది. 'కొమగాట మారు' దుర్ఘటనగా చరిత్రకెక్కిన అదే.. చివరకు గదర్‌ ఉద్యమానికి ఊతమైంది.

komagata maru ship incident:
komagata maru ship incident

By

Published : May 24, 2022, 8:21 AM IST

komagata maru ship incident: భారత్‌లో సైనికులను భర్తీ చేసుకోవటం ఆరంభించిన నాటి నుంచీ.. భౌగోళిక, శారీరక స్థితిగతుల దృష్ట్యా సిక్కులకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు ఆంగ్లేయులు. అఫ్గాన్‌ యుద్ధాలు, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయిల తిరుగుబాటు), ఆ తర్వాతా.. వారిని వాడుకుంటూ వచ్చారు. 1897లో విక్టోరియా రాణి డైమండ్‌ జూబ్లీ ఉత్సవాల తర్వాత భారత్‌ నుంచి చాలామంది సిక్కు మాజీ సైనికులు ఉపాధి కోసం బ్రిటిష్‌ సామ్రాజ్యంలో భాగమైన కెనడా వెళ్లి స్థిరపడటం పెరిగింది. 1908 నాటికి కెనడాలో వారి సంఖ్య 4వేలకు చేరింది. దీంతో తమ శ్వేతజాతి ఆధిపత్యానికి మున్ముందు ముప్పు వచ్చే ప్రమాదముందనే ఆలోచనతో వలసలపై ఆంక్షలు విధించింది కెనడా. దీనికి బ్రిటిష్‌ సర్కారు మద్దతిచ్చింది.

కెనడాకు స్వదేశం నుంచి నేరుగా రావాలే తప్ప మరో దేశంలో ఆగి వస్తే అంగీకరించేది లేదని మెలిక పెట్టారు. అప్పటికి భారత్‌ నుంచి నేరుగా కెనడాకు ఓడ లేదు. హాంకాంగ్‌, జపాన్‌ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. మలయా(మలేసియా)కు చెందిన వ్యాపారవేత్త గుర్దీత్‌సింగ్‌ హాంకాంగ్‌ నుంచి కొమగాట మారు అనే పేరుగల ఓ వాణిజ్య ఓడలో భారతీయులను కెనడా తీసుకెళ్లటానికి ఏర్పాట్లు చేశారు. హాంకాంగ్‌ కూడా భారత్‌ మాదిరిగా బ్రిటిష్‌ వలస రాజ్యమే కాబట్టి.. అక్కడి నుంచి బయల్దేరినా ఎలాంటి ఇబ్బందులుండవని భావించారు. పైగా సిక్కులకు కాసింత వెసులుబాటు లభించే అవకాశం ఉందనే సందేశాలు కెనడా రాజకీయవర్గాల నుంచి వెలువడ్డాయి. ఫలితంగా.. 376 (ఇందులో 340 మంది సిక్కులు) మందితో 1914 ఏప్రిల్‌ 4న కొమగాట మారు కెనడాకు బయల్దేరింది. వీరిలో చాలామంది బ్రిటిష్‌ సైన్యంలో పనిచేసిన మాజీ సైనికులే!

వీరి ఆశలిలా ఉంటే.. ఆంగ్లేయ సర్కారు మరోలా ఆలోచించింది. ఓడలో వస్తున్న ఎవ్వరినీ కెనడాలోకి అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు వెళ్లాయి. భారత్‌లో బ్రిటిష్‌ సర్కారును సాయుధ మార్గంలో కూలదోయాలనే లక్ష్యంతో అప్పటికే కెనడా, అమెరికాల్లోని భారతీయులతో ఏర్పాటైన గదర్‌ పార్టీ సభ్యులు, సానుభూతిపరులు ఆ ఓడలో ఉన్నట్లు బ్రిటిష్‌ సర్కారు అనుమానించింది. మే 21న కెనడాలోని వాంకోవర్‌ చేరుకోగానే కథ మొదలైంది. కొమగాట మారును చుట్టుముట్టిన పోలీసులు ఎవ్వరినీ దిగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

కెనడాలోని సిక్కు సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అప్పటికే తమకు కెనడా పౌరసత్వం ఉందని రుజువులు చూపిన 24 మందిని అనుమతించి.. మిగిలినవారిని దాదాపు 2నెలలు ఓడలోనే ఉంచారు. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. హాహాకారాలు మొదలయ్యాయి. దీంతో భారత్‌కు తిరిగి వెళ్లిపొమ్మన్నారు. గొడవ చేయగా.. ఆహార ఏర్పాటు చేసి.. జులై 23న ఓడను తిప్పిపంపించారు. తిరుగు ప్రయాణంలో బయల్దేరిన చోటైన హాంకాంగ్‌లోనూ ఆగటానికి అనుమతివ్వలేదు. నేరుగా కలకత్తాకు తీసుకొచ్చారు. సెప్టెంబరు 27న కలకత్తా సమీపంలోని బడ్జ్‌బడ్జ్‌ వద్ద ఓడను నిలిపి.. పోలీసులు చుట్టుముట్టారు. పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం వెళ్లిన వీరందరినీ అనుమానాస్పదంగా చూస్తూ ఉగ్రవాద, రాజకీయ ముద్ర వేసింది సర్కారు. గుర్దీత్‌సింగ్‌తో పాటు అనేకమందిని అరెస్టు చేయటానికి ప్రయత్నించగా.. తోపులాట జరిగింది. వెంటనే ఆంగ్లేయ సైనికులు కాల్పులు మొదలెట్టారు. అక్కడికక్కడే.. 19 మంది నేలకొరిగారు. గుర్దీత్‌సింగ్‌ తప్పించుకున్నాడు. ఈ సంఘటన కెనడా, అమెరికాలోని భారతీయుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఆంగ్లేయ సర్కారుపై విప్లవ మార్గంలో పయనిస్తున్న గదర్‌పార్టీ బలోపేతానికి దారి తీసింది.

ఇదీ చదవండి:బ్రిటిషర్లను చిత్తు చేసిన భారత పహిల్వాన్​!

ABOUT THE AUTHOR

...view details