Azadi Ka Amrut Mahotsav: ఈస్టిండియా కంపెనీ హయాంలో భారత్‌కు వచ్చిన అనేక మంది ఆంగ్లేయులు స్థానిక అమ్మాయిలను భార్యలుగా స్వీకరించేవారు. వీటిని చట్టబద్ధమైన పెళ్లిగా పరిగణించినవారు చాలా తక్కువ. కంపెనీ తరఫున పనిచేయటానికి భారత్ వచ్చారంటే చాలా సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాల్సి వచ్చేది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక భారతీయ మహిళలను ఆంగ్లేయులు పెళ్లి చేసుకోవటాన్ని ఈస్టిండియా కంపెనీ ప్రోత్సహించింది. అంతేగాకుండా తమ బ్రిటిష్ ఉద్యోగికి-భారతీయ మహిళకు పుట్టిన పిల్లలు బాప్టిజం (క్రిస్టియానిటీ) స్వీకరించటానికి అంగీకరించిన తల్లులకు ఆర్థిక సహకారం అందిస్తామనీ ప్రకటించింది. ఈ మిశ్రమజాతి పిల్లల పెంపకానికి వచ్చేసరికి మాత్రం తెల్లవారికి తమ జాతి గుర్తుకు రావటం మొదలైంది. తమకు పుట్టిన పిల్లల విషయంలోనూ వివక్షను చూపటం ఆంగ్లేయులకే చెల్లింది. చిన్నారుల చర్మం, తల వెంట్రుకల రంగుల ఆధారంగా వారిని వర్గీకరించేవారు. అచ్చం ఆంగ్లేయుల్లా ఉన్నవారిని ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు పంపించేవారు. ఏ కొద్దిగా తెలుపు తక్కువున్నా, భారతీయ లక్షణాలు కన్పించినా వారిని ఇక్కడే ఉంచేవారు. ఇలా... ఒకే తల్లికి పుట్టిన పిల్లల్ని విడదీసేవారు. ఇలాంటి బంధాలను ఇష్టపడని ఆంగ్లేయులు మిశ్రమ లక్షణాలతో జన్మించిన పిల్లల్ని కచ్చా-బచ్చా అని ఎగతాళి చేసేవారు. పక్కా శ్వేతజాతీయులు కాదని పదేపదే గుర్తు చేస్తూ వారిలో ఆత్మన్యూనత పెంచేవారు.
అవసరాల మేరకు ఆరంభించినా...ఈ బంధాలు, వాటి తదనంతర పరిణామాలతో ఇబ్బందులు తలెత్తటంతో పాటు, తమ జాతి సంకరం జరుగుతోందని ఆంగ్లేయుల్లో ఆందోళన పెరిగింది. తెల్లవారికి, భారతీయులకు మధ్య సంబంధాలను కట్టడి చేయటం మొదలైంది. ఈస్టిండియా హయాం ముగిసి... బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలు కాగానే వీటిపై దాదాపు నిషేధం విధించారు.