తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటిషర్లకు వణుకు పుట్టించి.. విప్లవవీరుడు భగత్​సింగ్​కు స్ఫూర్తిగా నిలిచి.. - కర్తార్​ సింగ్​ సరభా

Kartar singh sarabha: ఆంగ్లేయులపై పోరు సాగించిన విప్లవవీరుడు భగత్‌సింగ్‌ అనేక మందికి హీరో! అలాంటి భగత్‌కే స్ఫూర్తి ప్రదాత ఒకరున్నారు. ఆ యోధుడి పేరు కర్తార్‌సింగ్‌ సరభా! భగత్‌ 23వ ఏట ఉరికంబమెక్కితే... కర్తార్‌ 19 ఏళ్లకే ఉరితాడును ముద్దాడాడు. 'పట్టుబడ్డ అందరిలోనూ బ్రిటిష్‌ సర్కారు పాలిట అత్యంత భయంకరుడీ కుర్రాడు' అంటూ న్యాయమూర్తి తీర్పిచ్చాడంటే... కర్తార్‌ తెల్లవారినెంత భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు!

కర్తార్​సింగ్​ సరభా
కర్తార్​సింగ్​ సరభా

By

Published : Jul 1, 2022, 9:12 AM IST

Kartar singh sarabha: మహారాజా రంజిత్‌సింగ్‌ మరణం తర్వాత కుట్రలు కుతంత్రాలతో పంజాబ్ ను చేజిక్కించుకున్న ఆంగ్లేయులు అక్కడి సారవంతమైన నేలను బంగారుబాతులా వాడుకున్నారు. కొన్ని వర్గాల చేతుల్లోనే భూమి ఉండేలా, మిగిలిన వారు వారి వద్ద పనిచేసేలా చట్టాలు తీసుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పంజాబీలు కెనడా, అమెరికా వంటి దేశాలకు వలస పోవడం అనివార్యమైంది. 1896 మే 24న లూథియానా సమీపంలోని సరభా గ్రామంలో జన్మించాడు కర్తార్‌సింగ్‌. చిన్నప్పుడే తండ్రి చనిపోవటంతో తాత దగ్గర పెరిగాడు. చిన్నాన్న ఇంట ఒడిశాలో పదో తరగతి పూర్తిచేశాడు. 1912లో ఉన్నత చదువుల కోసం తాత ఆయన్ను కాలిఫోర్నియా పంపించగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, బర్క్‌లీలో చేరాడు. బర్క్‌లీలోని భారతీయ విద్యార్థుల నలందా క్లబ్‌ ఆయనలో స్వతంత్ర భావాలు నాటింది. ఆయన స్థానిక మిల్లులు, ఫ్యాక్టరీల్లో పనిచేశాడు. ఆ సమయంలోనే.. భారత్‌లో ఆంగ్లేయ సర్కారును విప్లవపంథాలో ఓడించే లక్ష్యంతో ఏర్పాటైన గదర్‌ పార్టీ వ్యవస్థాపకులతో పరిచయమైంది. లాలా హర్‌దయాళ్‌, సోహన్‌సింగ్‌ బక్నాల స్ఫూర్తితో కర్తార్‌ పూర్తిస్థాయి ఉద్యమ కార్యకర్తగా మారి పోయాడు. తుపాకీ పేల్చడం, బాంబుల తయారీ, విమానం నడిపే నైపుణ్యాలు సంపాదించాడు. గదర్‌ పత్రిక గుర్‌ముఖి ఎడిషన్‌ను తీసుకొచ్చే బాధ్యత చేపట్టాడు.

బ్రిటన్‌ 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగితేలుతున్న వేళ.. తిరుగుబాటుకు సరైన అదనుగా గదర్‌ పార్టీ భావించింది. దాంతో 1914 అక్టోబరులో కర్తార్‌, విష్ణు గణేశ్‌ పింగ్లే తదితరులు కొలంబో మీదుగా కలకత్తా చేరుకున్నారు. బనారస్‌లో మరో విప్లవవీరుడు రాస్‌ బిహారీ బోస్‌ను కలిసి మరో 20 వేల మంది గదర్‌వీరులు త్వరలోనే ఆయుధాలతో రాబోతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఉప్పందిన ఆంగ్లేయ సర్కారు వేలమంది గదర్‌ వీరులను విదేశాల్లో, భారతీయ తీరాల్లో హతమార్చింది. అరెస్టు చేసింది. అయినా... వారి కళ్లుగప్పి లథౌవాల్‌, అమృత్‌సర్‌లలో రాస్‌ బిహారీ బోస్‌, కర్తార్‌ తదితరులు సమావేశమయ్యారు. 1915 ఫిబ్రవరి 21న తిరుగుబాటు ఆరంభించాలని... తొలుత ఫిరోజ్‌పుర్‌ కంటోన్మెంట్‌ను స్వాధీనం చేసుకొని తర్వాత అంబాలా, దిల్లీలపై దాడి చేయాలని ప్రణాళిక రచించారు. కానీ పోలీసు ఇన్ఫార్మర్‌ సమాచారంతో ఆంగ్లేయులు అప్రమత్తమై ఫిరోజ్‌పుర్‌ తదితర కంటోన్మెంట్లలో తిరుగుబాటు యత్నాలను విఫలం చేశారు. కొంతమందిని అరెస్టు చేశారు. మిగిలిన వారంతా విదేశాలకు వెళ్లాలని గదర్‌ నేతలు సూచించారు. కానీ సహచరులు కొందరు బ్రిటిష్‌వారి బందీలుగా ఉండగా.. తాను పారిపోవటానికి కర్తార్‌కు మనసొప్పలేదు. సర్‌గోధా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) వద్ద సిపాయిల్లో తిరుగుబాటుకు కర్తార్‌ ప్రయత్నాలు మొదలెట్టారు.

ఈ క్రమంలో ఆయనతోపాటు అనేక మంది అనుచరులను మార్చి 2న అరెస్టు చేసి లాహోర్‌ జైలుకు తరలించారు. తొలి లాహోర్‌ కుట్ర కేసుగా పేరుపెట్టి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి 61 మందిని విచారించారు. బ్రిటిష్‌ సర్కారుపై కుట్ర చేశారన్న ఆరోపణలను కర్తార్‌ తోసిపుచ్చాడు. 'మాది కుట్ర కాదు. బ్రిటిష్‌ సర్కారుకు బహిరంగ సవాలు. ప్రతి భారతీయుడికి తన హక్కుల కోసం, కన్నభూమి రక్షణ కోసం తిరుగుబాటు చేసే హక్కు ఉంటుంది. అది నేరం కానేకాదు. మా బాధ్యత. ఈ ప్రయత్నంలో మేం విఫలం కావటం దురదృష్టకరం' అంటూ కర్తార్‌ చేసిన వాదన అందరినీ కదిలించింది. 18 ఏళ్ల కర్తార్‌ మాటలు విన్న ఆంగ్లేయ న్యాయమూర్తి ఆగ్రహంతో... వాటిని వాపస్‌ తీసుకోవాలని కోరాడు. కానీ కర్తార్‌ నిరాకరించాడు. "నా మాటల్ని ఎందుకని వెనక్కి తీసుకోవాలి? ఈ జన్మేకాదు... మరెన్ని జన్మలు ఎత్తినా... నా దేశం కోసం త్యాగం చేయటాన్ని గౌరవంగా భావిస్తా" అంటూ పునరుద్ఘాటించాడు. "61 మంది తిరుగుబాటుదారుల్లో ఈ కుర్రాడే చాలా డేంజర్‌గా ఉన్నాడు" అంటూ... కర్తార్‌తోపాటు మరో ఐదుగురికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తన తాత జైలుకు వచ్చి నచ్చచెప్పాలని చూసినా ఆయన మనసు మార్చుకోలేదు. "ముసలివాడినై రోగంతో మంచానికి అతుక్కుపోయి చనిపోవటం కంటే ఇలా దేశం కోసం మరణించటం మంచిది కాదా?" అంటూ తాతను ఎదురు ప్రశ్నించాడు. 1915 నవంబరు 16న కర్తార్‌, పింగ్లేలను లాహోర్‌ సెంట్రల్‌ జైలులో ఉరితీశారు. కర్తార్‌ వీరత్వం.. తర్వాతి కాలంలో భగత్‌సింగ్‌కు స్ఫూర్తిగా నిల్చింది. చనిపోయేదాకా భగత్‌ జేబులో ఉన్న ఫొటో కర్తార్‌దే!

ఇదీ చూడండి :'దక్షిణాది జలియన్‌వాలా బాగ్‌'.. ప్రజలపై 90 రౌండ్ల కాల్పులు.. 32మంది మృతి

ABOUT THE AUTHOR

...view details