Azadi Ka Amrith Mahotsav Swami Vivekananda: సాధువులందరినీ దొంగలుగానో, ప్రభుత్వంపై కుట్ర చేసేవారిగానో ఆంగ్లేయులు పరిగణించేవారు. వారిని అకారణంగా అదుపులోకి తీసుకొనేవారు. బిహార్ రాష్ట్రంలో ఓసారి మామిడి పండ్లకు బురదతో కూడిన బొట్లు పెట్టారు. ప్రతి తోటలోనూ కొన్నింటికి బొట్లున్నాయి. మరికొన్నింటికి లేవు. ఇది ఆంగ్లేయ పోలీసుల్లో అనుమానం రేకెత్తించింది. అంతకుముందు.. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఉత్తరభారతంలో అనూహ్యంగా చపాతీల రవాణా సాగినట్లే.. మామిడి బొట్లలో ఏదైనా రహస్యం దాగుందా? ప్రభుత్వంపై కుట్రకు ఇవేమైనా సంకేతాలా అనే కోణంలో పరిశోధించటం ఆరంభించారు. ఇదంతా సాధువుల పనే అనుకొని అనుమానంతో చాలామందిని అరెస్టు చేశారు. చివరకు.. నాణ్యమైన మామిడి, మామూలు పంటను గుర్తించటానికి ఇలా బొట్లు పెడుతున్నారని తెలిసి నాలుక కరచుకున్నారు. ఈ క్రమంలోనే ఓరోజు నడుచుకుంటూ వెళుతున్న వివేకానందుడిని బ్రిటిష్ సర్కారు పోలీసు ఇన్‌స్పెక్టర్ అడ్డుకున్నాడు. ఎవరు, ఎటు వెళుతున్నావంటూ ఆరా తీశాడు.
'నేనో సాధువును..' అంటూ స్వామి బదులిస్తుండగానే.. "సాధువులంతా బద్మాష్‌లు. నాతో రా. జైల్లో వేస్తా" అంటూ అకారణంగా కోపం ప్రదర్శించాడా ఇన్‌స్పెక్టర్. 'జైల్లో ఎన్నిరోజులు వేస్తారు?' అని అడిగారు వివేకానందుడు. 'బహుశా పదిహేను, లేదా నెలరోజులు' అన్నాడా పోలీసు. అప్పుడు స్వామి అతని చెవి దగ్గర గుసగుసలాడినట్లుగా.. 'అయ్యో నెలరోజులేనా? ఆరునెలలు లేదంటే కనీసం మూణ్నాలుగు నెలలైనా వేయించలేవా?' అని అడిగారు స్వామి. ఆశ్చర్యపోయిన ఆ పోలీసు అధికారి అనుమానంతో 'ఎందుకలా?' అని అడిగాడు. "జైల్లో జీవితం బయటికంటే హాయిగా ఉంటుంది. అక్కడ ఠంచనుగా టైముకు రెండు పూటలా భోజనం పెడతారు. కాబట్టి కొన్ని నెలలపాటు జైల్లో ఉండేలా చేశావంటే నీకు పుణ్యం వస్తుంది" అంటూ బదులిచ్చారు స్వామి. దీంతో ఎర్రబారిన ముఖంతో.. ఏమీ చేయలేక వివేకానందుడిని వదిలేసి తనదారిన తాను వెళ్లిపోయాడా బ్రిటిష్ పోలీసు.
మరోమారు కలకత్తాలోనే చేదు అనుభవం ఎదురైంది. కలకత్తా శివార్లలో తన శిష్యులతో పాటు ఉండేవారు వివేకానందుడు. నేర విచారణ విభాగంలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆంగ్లేయ పోలీసు అధికారి ఒకరోజు స్వామిని కలిశాడు. వివేకానందుడిని నవ్వుతూ పలకరించిన ఆయన సాయంత్రం ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. సరేనంటూ సాయంత్రానికి ఆయన ఇంటికి వెళ్లారు స్వామి. అప్పటికల్లా కొంతమంది సందర్శకులున్నారు. చాలాసేపటికి వారు వెళ్లిపోయారు. అయినా భోజనం పెట్టే సూచనలేమీ కనిపించటం లేదు. ఉన్నట్టుండి ఆ అధికారి.. సంభాషణ మళ్లించాడు.