తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బ్రిటిష్​ పాలన సిగ్గు సిగ్గు'.. సొంత పాలకులపై ఆంగ్లేయ గవర్నర్​ అసహనం!

బ్రిటిష్‌ పాలనను గాంధీ విమర్శించటం సహజం! కొంతమంది తెల్లవారూ భారత్‌ పట్ల సానుభూతి చూపటాన్ని అర్థం చేసుకోగలం! కానీ.. బ్రిటన్‌ రాణి ప్రత్యేకంగా నియమించిన ఓ ఆంగ్లేయ గవర్నర్‌... బ్రిటిష్‌ పాలనను చూసి సిగ్గుసిగ్గు అన్నారు. అదీ రహస్యంగానో లేక పదవీ విరమణ తర్వాతో కాకుండా పదవిలో ఉంటూనే.. ఏకంగా వైస్రాయ్‌కి లేఖ రాశారు. ఆయనే రిచర్డ్‌ గార్డినర్‌ కేసీ! బెంగాల్‌ను అత్యంత దారుణమైన కరవు నుంచి కాపాడిన మానవతావాది.

azadi ka amrith mahotsav
azadi ka amrith mahotsav

By

Published : May 29, 2022, 8:15 AM IST

Azadi KAa Amrith Mahotsav: 1944 నాటికి.. బెంగాల్‌ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 1941లో బర్మాను జపాన్‌ ఆక్రమించటంతో.. ఇక తర్వాతి వంతు కలకత్తానే అనే భయాందోళనలు నెలకొన్నాయి. పులి మీద పుట్రలా.. అదే ఏడాది సంభవించిన దారుణమైన కరవు బెంగాల్‌ను అల్లకల్లోలం చేసింది. లక్షల మంది ఆకలికి తాళలేక రోడ్లపై పిట్టల్లా రాలిపోయారు. వీటికి తోడు.. రాజకీయ అనిశ్చితి.. మతకలహాలు! గవర్నర్‌ జాన్‌ హెర్బర్ట్‌ పూర్తిగా చేతులెత్తేశాడు. తొలగిస్తారని అనుకుంటున్నంతలోనే ఆయన అనారోగ్యంతో మరణించాడు. దాదాపు ఆరునెలల వెతుకులాట తర్వాత అనూహ్యంగా ఆస్ట్రేలియన్‌ రిచర్డ్‌ కేసీ పేరు ఖరారైంది. ఆస్ట్రేలియా గవర్నర్‌గా, బ్రిటన్‌ యుద్ధ కేబినెట్‌లో సభ్యుడిగా.. వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా.. అప్పటికే మంచి పేరు తెచ్చుకున్న కేసీకి బెంగాల్‌ బాధ్యతలు అప్పగించారు.

కేసీ ఎంపిక భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. కారణం.. అప్పట్లో ఆస్ట్రేలియాలో భారతీయుల ప్రవేశంపై ఆంక్షలుండేవి. శ్వేతజాతీయులకే ఆస్ట్రేలియా పెద్దపీట వేసేది. అలాంటి వ్యక్తిని మన దేశానికి గవర్నర్‌గా పంపడమంటే.. భారత్‌ను అవమానించడమే అంటూ విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. 1944 జనవరిలో కలకత్తాలో అడుగుపెట్టారు కేసీ!

ఆంగ్లేయ సామ్రాజ్య ఆకాంక్షలు.. భారతీయుల విమర్శలు రెండింటినీ పక్కనబెట్టి.. బెంగాల్‌ ప్రజలపై కేసీ దృష్టిసారించారు. గవర్నర్‌ బంగ్లాను వదిలి ప్రజల్లోకి వచ్చారు. పొలాల నుంచి.. వీధుల దాకా తిరుగుతూ.. అధికారులకు సూచనలిస్తూ కరవు కరాళ నృత్యాన్ని ఆపటానికి ప్రయత్నించారు. పేదలుండే మురికివాడలనూ సందర్శించిన తొలి గవర్నర్‌ ఆయనే. ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించటం ప్రాధాన్యంగా.. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తుంటే.. దాన్ని రద్దు చేసి ప్రభుత్వాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని నడిపించారు. ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రభుత్వ సొమ్ముతో పడవలు ఇచ్చి చేపలు పట్టేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. అంతకుముందు యుద్ధం పేరుతో చేపలు పట్టడాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. వాటన్నింటినీ కేసీ ఎత్తేశారు. ఆస్ట్రేలియా నుంచి దుస్తులు తెప్పించి బెంగాల్‌లో పేదలకు పంచారు. కరవుతో కష్టాల్లో ఉన్న బెంగాల్‌కు నిధులు విడుదల చేయాలంటూ వైస్రాయ్‌ వావెల్‌తో పోరాడారు. నిధులు విడుదల చేయకుంటే రాజీనామా చేస్తానంటూ బెదిరించారు కూడా.

క్రమంగా.. కేసీ తెల్లవాడనే భావన తొలగి.. ప్రజల మనిషిగా పేరు సంపాదించారు. అధికార యంత్రాంగాన్ని సైతం ప్రజలకు సేవ చేసేలా ఒత్తిడి చేశారు. "భారత్‌లోని మా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు దారుణంగా ఉంది. సమయానికి ప్రజల పనులు చేయకుండా సాగదీయటం, వాయిదా వేయటం వారికి అలవాటుగా మారింది. ఏమాత్రం తపనగానీ, బాధ్యతగానీ లేదు. కొంతమంది అధికారులే ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారు’’ అని కేసీ విమర్శించారు. బ్రిటిష్‌ పాలనపైనా ఘాటుగా విమర్శలు గుప్పించారు. నేరుగా అప్పటి భారత వైస్రాయ్‌ వావెల్‌కే లేఖ రాశారాయన. ‘‘బెంగాల్‌లో పరిపాలన, ప్రజల దారుణ పరిస్థితి చూశాక.. సిగ్గేస్తోంది. కొన్నేళ్ల కిందటి దాకా యావత్‌ భారతాన్ని బ్రిటిష్‌ సర్కారు ఇక్కడి నుంచే పాలించింది. ఆ పాలనకు ప్రతిబింబమే ప్రస్తుత స్థితి. 150 ఏళ్ల బ్రిటిష్‌ సామ్రాజ్య పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించటం మాట అటుంచి.. ఆ దిశగా కనీసం అడుగులు పడలేదని చెప్పుకోవటానికి సిగ్గుపడాలి" అని కేసీ నిర్మొహమాటంగా కడిగేశారు.

బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఎంతో ఆప్తుడనుకున్న కేసీ ఇలా విమర్శించటం ప్రభుత్వానికి మింగుడు పడలేదు. మానవత్వమున్న అధికారి ఏం చేయగలడో అది చేసి చూపించారు. ప్రపంచ యుద్ధం పూర్తికాగానే.. అయిదేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే.. రాజీనామా చేసి వెళ్లిపోయారు. అందుకే.. ఆయన నియామకాన్ని- భారతీయులకే అవమానం అంటూ విమర్శించిన పత్రికలు.. కేసీ వెళ్లిపోతుంటే.. మెచ్చుకున్నాయి. ప్రజల మనిషిగా కీర్తించాయి. గాంధీజీ సైతం భారత వైస్రాయ్‌ని పక్కనబెట్టి.. బెంగాల్‌ గవర్నరైన కేసీతో నేరుగా రాయబారాలు, చర్చలు సాగించారు.

ఇదీ చదవండి:100 ఎకరాలు ఇస్తామన్నా వద్దని.. వందేమాతరానికే జై

ABOUT THE AUTHOR

...view details