Azadi Ka Amrith Mahotsav Jagjeevan Das Mehatha: డాక్టరై, లా చదవి, వజ్రాల వ్యాపారంలో స్థిరపడి.. భారత బానిస సంకెళ్ల విముక్తికి నిష్కామ కృషి సల్పిన రుషి డాక్టర్ మెహతా! 1864లో గుజరాత్‌లోని సుసంపన్న వ్యాపారుల కుటుంబంలో జన్మించిన ఆయన 1886లో గోల్డ్ మెడల్‌తో బొంబాయి నుంచి వైద్య పట్టా సంపాదించారు. ఉపకారవేతనంపై బ్రసెల్స్ వెళ్లి ఎండీ పూర్తి చేశారు. అది చేస్తూనే లండన్‌లో న్యాయశాస్త్రంలో చేరారు. అప్పుడే అక్కడికి లా చదివేందుకు వచ్చిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీతో 1888లో పరిచయమైంది. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన గాంధీకి యూరోపియన్ సంప్రదాయాలు, అలవాట్లతో పాటు ఎలా మసలు కోవాలో, ఖర్చులెలా తగ్గించుకోవాలో నేర్పించారాయన. గాంధీ ఆలోచనలను కొత్తదారిలో మళ్లించి.. రాటుదేల్చారు. గాంధీజీ గుజరాతీలో రాసిన 'హింద్ స్వరాజ్' పుస్తకం మెహతా పుణ్యమే! స్వరాజ్యం, నాగరికతలాంటి అనేక అంశాలపై గాంధీజీ దృఢ అభిప్రాయాలు ఇందులో కనిపిస్తాయి. ఈ పుస్తకాన్ని రాజద్రోహంగా పరిగణించి.. ఆంగ్లేయ సర్కారు నిషేధించింది. గాంధీజీకి, ఓ అజ్ఞాత పాఠకుడికి మధ్య జరిగే సంభాషణల ప్రతిరూపమే ఈ పుస్తకం. ఇందులోని అజ్ఞాత పాఠకుడు మరెవరో కాదు మెహతాయే!
ఇద్దరి మధ్యా బలపడ్డ ఈ బంధం సుదీర్ఘకాలం సాగింది. అమాయకుడిలా లండన్ వచ్చి పరిణతి సాధిస్తున్న గాంధీజీ జీవన క్రమాన్ని జాగ్రత్తగా గమనించిన మెహతా అడుగడుగునా ఆయనకు నీడలా నడిచారు. భావి భారత నాయకుడిని ఆయనలో అందరికంటే ముందే చూసి గొడుగులా నిలిచారు. 1909 నవంబరు 8న గోపాలకృష్ణ గోఖలేకు రాసిన లేఖలో.. '20 సంవత్సరాలుగా గాంధీని అతి దగ్గర్నుంచి చూస్తున్నాను. ఏటికేడు ఆయనలో అనూహ్యమైన మార్పు వస్తోంది. మహాత్ముల్లో కనిపించే నిస్వార్థ.. నిష్కామ లక్షణాలు అతనిలో కనిపిస్తున్నాయి' అని మెహతా వ్యాఖ్యానించారు. భారత్‌కు వచ్చాక కొద్దికాలం వైద్యవృత్తి చేసిన ఆయన తర్వాత బర్మాలో ఆభరణాల వ్యాపారంలో స్థిరపడ్డారు. బర్మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. అయినా గాంధీని మాత్రం మరవలేదు. దక్షిణాఫ్రికాలో పోరాటానికి మద్దతిచ్చారు. భారత్‌లో ఆంగ్లేయులపై పోరాటానికి రావల్సిందిగా గాంధీజీపై ఒత్తిడి తెచ్చారు.