తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యమానికి 'నవ జీవనం'.. కలం పట్టి గాంధీ పోరాటం

దక్షిణాఫ్రికా నుంచి వచ్చి భారత స్వాతంత్య్ర సమర పగ్గాలు చేపట్టిన గాంధీజీ అహింస, సత్యాగ్రహం అంటూ సరికొత్త ఆయుధాలను సంధించారు. ఆంగ్లేయులనే కాదు చాలామంది భారతీయులనూ ఆయన భావజాలం ఆశ్చర్యపర్చింది. ఈ పద్ధతుల్లో ఎలా తెల్లవారిని కట్టడి చేస్తామో అర్థం కాలేదు. తన ఆలోచనలను విడమర్చి భారతావనికి కర్తవ్యబోధ చేసేందుకు పాత్రికేయుడి అవతారమెత్తారు గాంధీజీ! ఉద్యమంలో ఊపిరి సలపకుండా ఉన్నా మూడు పత్రికలకు సంపాదకత్వం వహించటం విశేషం.

గాంధీజీ పాత్రికేయుడిగా పనిచేసిన పత్రికలు
గాంధీజీ పాత్రికేయుడిగా పనిచేసిన పత్రికలు

By

Published : Jul 6, 2022, 9:06 AM IST

Azadi Ka Amrith Mahotsav Gandhi Editor:స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్‌ సర్కారు తమకు వ్యతిరేకంగా రాసే పత్రికలను ముప్పుతిప్పలు పెట్టేది. 1919 రౌలత్‌ చట్టం వచ్చాకనైతే పత్రికారంగంపై బ్రిటిష్‌ సర్కారు దాష్టీకం అంతా ఇంతా కాదు. జాతీయవాద దృక్పథంతో వెలువడుతున్న 'ది బాంబే క్రానికల్‌'పై కక్ష పెంచుకుంది. బ్రిటన్‌కే చెందిన బి.జి.హార్నిమాన్‌ ఆ పత్రిక సంపాదకుడిగా ఉంటూ సర్కారును విమర్శించేవారు. తమ జాతివాడైన ఆయనకు కఠిన శిక్ష వేయలేక స్వదేశానికి పంపించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ పత్రికను మూసేయించింది. ఆ పత్రిక నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఉమర్‌ సుభానీ, శంకర్‌లాల్‌ బంకర్‌లు.. ఆ విపత్కర సమయంలో గాంధీజీని కలిశారు. 'ది బాంబే క్రానికల్‌'తో పాటు తాము నిర్వహిస్తున్న 'యంగ్‌ ఇండియా' సంపాదక బాధ్యతలు తీసుకోవాలని కోరారు.

ఆ సమయానికి గాంధీజీ తన సత్యాగ్రహ, అహింస భావజాలాన్ని ప్రజలకు సవ్యంగా చేరవేసే సరైన సమాచార వేదిక కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే వెంటనే ఆయన అంగీకరించారు. అయితే బాంబే క్రానికల్‌ను సర్కారు పూర్తిగా నిషేధించటం వల్ల ఇంగ్లిష్‌లో వెలువడుతున్న పక్ష పత్రిక 'యంగ్‌ ఇండియా' బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో.. శంకర్‌లాల్‌ బంకర్‌ స్నేహితుడు ఇందూలాల్‌ యాగ్నిక్‌... గుజరాత్‌ నుంచి వెలువడుతున్న 'నవజీవన్‌-సత్య' మాసపత్రిక సంపాదక బాధ్యతలూ చేపట్టాలని గాంధీని కోరారు. అప్పటికే దక్షిణాఫ్రికాలో 'ఇండియన్‌ ఒపీనియన్‌' పత్రికను నడిపిన అనుభవమున్న గాంధీజీ ఆ ధైర్యంతోనే 1919లో ఒకేసారి ఆంగ్లంలో 'యంగ్‌ ఇండియా’, గుజరాతీ భాషలో 'నవజీవన్‌' సంపాదకుడిగా అవతారమెత్తారు. పక్ష పత్రిక అనుకున్న యంగ్‌ ఇండియాను వారపత్రిక చేశారు.

గాంధీజీ పాత్రికేయుడిగా పనిచేసిన పత్రికలు

మాస పత్రికగా నడుస్తున్న 'నవజీవన్‌ సత్య'ను కూడా వారపత్రికగా మార్చి.. పేరును నవజీవన్‌గా కుదించారు. రెండింటినీ అహ్మదాబాద్‌ నుంచే ముద్రించటం మొదలెట్టారు. వీటిలో ఎలాంటి ప్రకటనలనూ ప్రచురించొద్దని, కేవలం భావప్రకటన స్వేచ్ఛ కోసమే ఉపయోగించుకోవాలని గాంధీజీ నిశ్చయించుకున్నారు. 1919 సెప్టెంబరు 7న గాంధీ సంపాదకుడిగా గుజరాతీలో నవజీవన్‌ తొలి ప్రతి విడుదలైంది. అందులో ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్ని, ఆంగ్లంపై మోజును విశ్లేషించారు గాంధీజీ. 'మనం ఆంగ్ల మోజులో పడి ఎలా దెబ్బతింటున్నామో చెప్పటానికి నవజీవన్‌ ఏమాత్రం వెనకాడదు. అలాగని మన చదువుల్లో, జీవనంలో ఆంగ్లానికి ప్రమేయం ఉండకూడదని కాదు. కానీ మన మాతృభాషను మరచిపోయేంత విచక్షణారహితంగా ఆంగ్ల ఆకర్షణ ఉండకూడదని నొక్కిచెబుతున్నాను' అని ఆయన స్పష్టం చేశారు.

ఇలా ప్రజల్ని చైతన్యవంతులను చేయటమేగాకుండా.. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలను ప్రచురించేవారు. సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్‌ ఉద్యమం, హిందూ-ముస్లింల మధ్య సంబంధాలు, అంటరానితనం, దండి సత్యాగ్రహం, రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, గాంధీ యూరప్‌ పర్యటన తదితర అంశాలు ప్రజలకు అర్థమయ్యేలా ఈ పత్రికలు ప్రచురిస్తుండేవి. గాంధీజీ ఆత్మకథను నవజీవన్‌లో సీరియల్‌గా ప్రచురించారు. 1919 నుంచి 1932 వరకు కొనసాగిన ఈ పత్రికల సర్క్యులేషన్‌ ఓ దశలో 40 వేలకు చేరుకుని బ్రిటిష్‌ ప్రభుత్వానికి కంటకంగా మారింది.

బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహాత్మాగాంధీ 'యంగ్‌ ఇండియా'లో మూడు కథనాలు ప్రచురించారు. దీనిపై కన్నెర్రజేసిన సర్కారు 1922లో గాంధీజీపై రాజద్రోహ నేరం కింద కేసు నమోదు చేసింది. స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయుల గళంగా నిలిచిన ఈ రెండు పత్రికల ప్రభ గాంధీజీ జైలుకెళ్లిన తరవాత మసకబారింది. బ్రిటిష్‌ ప్రభుత్వ అణచివేత కారణంగా ఆ రెండు పత్రికలనూ 1931లో మూసివేయక తప్పలేదు. చివర్లో 3 పేజీలకు కుదించి యంగ్‌ ఇండియాను సైక్లోస్టైల్‌ రూపంలో తీసి పంచేవారు. నవజీవన్‌ 1932 జనవరి 10న తన చివరి రెండు పేజీలను ప్రచురించింది. ఆ తరవాత మహాత్మాగాంధీ 'హరిజన్‌', 'హరిజన్‌బంధు', 'హరిజన్‌సేవక్‌' పత్రికలను స్థాపించి అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. భారతీయ గ్రామాల వికాసం, జాతీయ అభివృద్ధికి తన ఆర్థిక భావజాలాన్ని వ్యక్తపరిచారు.

ఇదీ చదవండి:తెల్లవారిని తెల్లబోయేలా చేసిన 'పైకాలు'.. 1817లోనే సైనిక తిరుగుబాటు!

ABOUT THE AUTHOR

...view details