Azadi Ka Amrith Mahostsav Tilka Maanji: తిల్కా మాంఝీగా ప్రాచుర్యంలో ఉన్న ఈ ఆదివాసీ వీరుడి పేరు బ్రిటీష్ రికార్డుల ప్రకారం 'జబ్రా పహాడియా'! ఫిబ్రవరి 11, 1750లో బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ తాలూకా తిల్కాపూర్ గ్రామంలో జన్మించాడు. ఎరుపెక్కిన కళ్లతో ఉండేవారిని పహాడియా భాషలో తిల్కా అని పిలుస్తారు. యుక్త వయసు రాగానే.. తమ తెగలో గ్రామపెద్ద పదవీ వచ్చింది. ఆ పదవి చేపట్టిన వారిని మాంఝీ అంటారు. అలా జబ్రా పహాడియా కాస్తా.. తిల్కా మాంఝీగా స్థిరపడపోయింది. బెంగాల్ ఆదివాసీల పరిస్థితి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో దయనీయంగా మారింది. గిరిపుత్రులు వారసత్వ భూములు కోల్పోయి.. తమ భూముల్లోనే కూలీలుగా, కౌలుదారులుగా మారారు.
పుట్టినప్పటి నుంచీ తమపై జరుగుతున్న అన్యాయాల్ని కళ్లారా చూసిన తిల్కా మాంఝీ 20 ఏళ్ల వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1770లో ఉద్యమానికి పిలుపునిచ్చాడు. అదే సమయంలో బెంగాల్‌లో తీవ్ర కరవు దాదాపు కోటి మందిని పొట్టనబెట్టుకుంది. మానవత్వం చూపాల్సిన ఆంగ్లేయ సర్కారు.. అందుకు భిన్నంగా పన్నులను మరింత పెంచింది. దీంతో తిల్కా మాంఝీ ఆగ్రహంతో.. కంపెనీ భాగల్‌పుర్ కోశాగారాన్ని దోచుకున్నారు. ఆ సంపదను కరవుతో అల్లాడుతున్న గిరిజనులకు, భూమి కోల్పోయిన నిరుపేద రైతులకు పంచారు! ఈ సంఘటనతో ప్రజల్లో తిల్కా మాంఝీపై నమ్మకం పెరిగింది. బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ తిల్కాను పట్టుకోవటం కోసం కెప్టెన్ బ్రూక్ నేతృత్వంలో 800 మందితో కూడిన సాయుధ దళాన్ని పంపాడు. ఈ దళం ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులను చిత్రహింసలు పెట్టినా ఫలితం లేకపోయింది. 1778లో తిల్కా బృందం రామ్‌ఘర్ కంటోన్మెంట్ (ప్రస్తుత ఝార్ఖండ్)లో ఉన్న పంజాబ్ రెజిమెంట్‌పై దాడి చేసింది. బాణాలు, విల్లంబులు, బరిసెలు, గొడ్డళ్లు, బండ కత్తులు, వేట కొడవళ్ల ముందు.. తెల్లవాడి తుపాకులు తెల్లబోయాయి. ఫలితంగా పంజాబ్ మిలిటరీ రెజిమెంట్ కంటోన్మెంట్‌ను వదిలి పారిపోయింది.
ఉలిక్కిపడ్డ ఈస్టిండియా సర్కారు.. అగస్ట్ క్లీవ్‌లాండ్ అనే కుటిల అధికారిని గిరిజన ప్రాంతాల్లో రెవెన్యూ కలెక్టరుగా నియమించింది. ఆదివాసీలలో చీలిక తేవడానికి క్లీవ్‌లాండ్ దుష్ట పన్నాగం పన్నాడు. వారిలో కొంతమందికి పన్నులు తగ్గించటం; మాఫీ చేయటం చేస్తూ... విభజన బీజాలు నాటాడు. ఫలితంగా.. దాదాపు 40 గిరిజన తెగల సమూహాలు క్లీవ్‌లాండ్‌కు అనుకూలంగా మారాయి. ఈ తెగల నుంచి యువతను చేరదీసి... శిక్షణ ఇచ్చి... వారితో ఓ మిలిటరీ యూనిట్ ఏర్పాటు చేశాడు. అలా గిరిజనులనే తన సిపాయిలుగా మార్చుకున్నాడు. అంతేగాకుండా ఈ గిరిజన దళానికి నాయకత్వ వహించాల్సిందిగా తిల్కాకూ ఎర వేశాడు. కానీ తిల్కా ఆ వలలో పడలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీతో తాడోపేడో తేల్చుకుందుకు సిద్ధమయ్యాడు. 1784లో తిల్కా భాగల్‌పుర్ వేదికగా మళ్లీ ఆంగ్లేయులపై దాడి చేశాడు. తిల్కా విషపూరిత బాణం గుచ్చుకున్న క్లీవ్‌లాండ్ కొద్దిరోజులకు మరణించాడు. కంపెనీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. లెఫ్టినెంట్ జనరల్ ఐర్‌కూట్ నేతృత్వంలో మిలిటరీ దళాన్ని అడవుల్లోకి పంపింది.