Shanti Ghosh Sunita Chaudhari: జాతీయోద్యమంలో బెంగాల్‌ది ఓ చిత్రమైన స్థితి. అహింసా మార్గంతో పాటు... సాయుధ విప్లవ పథం కూడా సమాంతరంగా సాగుతున్న దశ. కానీ అందరి లక్ష్యం... భారత స్వాతంత్య్ర సాధనే.
Indian Independence movement
1930 సమయంలో... కొమిల్లాలోని ఫైజున్నీసా బాలికల హైస్కూల్‌లో చదివేవారు శాంతిఘోష్, సునీతి చౌధరిలు. ఆంగ్లేయుల అకృత్యాలను, వేధింపులను, స్త్రీల పట్ల అనుచిత అసభ్యకర ప్రవర్తన, నానారకాల హింస ఇవన్నీ బాల్యంలోనే చూసిన వీరు బ్రిటిష్‌వారిపై గుండెలనిండా కసి పెంచుకున్నారు. విప్లవసంస్థ జుగాన్తర్ పార్టీ బాలికల విభాగం ఛాత్రి సంఘ్‌లో చేరారు.
Subhas Chandra Bose comilla speech
ఓసారి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. సునీతి బాలికల దళంతో పరేడ్ నిర్వహించారు. 'ఉద్యమంలో అమ్మాయిలు ముందు వరుసలో ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది' అన్నారాయన. దీంతో... సునీతి, శాంతిలు... తమకు కూడా పురుషులతో సమానంగా ఆంగ్లేయులపై పోరాడే బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి పట్టుదల చూసిన పార్టీ... మయాన్‌మాతి గుట్టల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్చడం నేర్పించింది.
ఆ సమయంలో తిప్పేర జిల్లా మెజిస్ట్రేటుగా వ్యవహరించిన చార్లెస్ జెఫ్రీ బక్‌లాండ్ స్టీవెన్స్ తన అధికారాలతో నాటి స్వాతంత్ర్యోద్యమాన్ని అత్యంత కిరాతకంగా అణచివేసేవాడు. ఉద్యమంలో భాగంగా ప్రసంగించినా, నినాదాలు చేసినా పోలీసు ఠాణాలలో హింసించి జైలుపాలు చేసేవాడు. ఆయనపై ప్రతీకారం తీర్చుకునే బాధ్యతను చేపట్టారు సునీతి, శాంతిలు.
1931 డిసెంబరు 14 ఉదయం పది గంటలకు బాలికలిద్దరూ... స్కూల్ దుస్తుల్లో కలెక్టరు బంగ్లాకు చేరుకున్నారు. స్విమ్మింగ్ క్లబ్ కోసం... ఆంగ్లంలో రాసిన వినతి పత్రాన్ని పంపారు. చార్లెస్ బయటకు వచ్చి ఆ వినతి పత్రంలో రాసిన శైలిని చూసి మెచ్చుకుంటూ... దానిపై సిఫార్సు సంతకం చేశాడు. తమకు అత్యంత దగ్గరగా వచ్చిన చార్లెస్‌ను చూసి ఏమాత్రం బెదరని సునీతి, శాంతి... వెంటనే సిల్క్ గుడ్డలో చుట్టుకొని వెళ్లిన పిస్తోల్‌ను తీసి ఆయన గుండెలకు ఎక్కుపెట్టి కాల్పులు జరిపారు. అక్కడే కుప్పకూలాడు చార్లెస్. చుట్టూ ఉన్న అధికారులు స్థాణువులై చూస్తున్నా... పారిపోకుండా... ఎటువంటి ప్రతిఘటనా చేయకుండా బాలికలిద్దరూ లొంగిపోయారు.