గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రులో 1898 నవంబరు 15న జన్మించిన కల్లూరి చంద్రమౌళి ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. ఎబర్డీన్ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయశాస్త్రంలో పట్టా పొందారు. బ్రిటన్‌లో ఆంగ్లేయులు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను, విద్య, ఆహార సౌకర్యాలను చూసిన ప్రతిసారీ ఆయన మదిలో భారత్‌లో పరతంత్రులైన, డొక్కలు ఎండిన ప్రజలే మెదిలేవారు. స్వీయపాలనలోనే భారత్ బాగుపడుతుందనే ఉద్దేశంతో... స్వదేశం వెళ్లి జాతీయోద్యమంలో దూకాలని నిర్ణయించుకున్నారు చంద్రమౌళి. 1924లో భారత్‌కు పయనమయ్యారు. ఇంగ్లాండ్‌లో చదువుకుని వస్తున్న ఆయనకు స్వాగతం పలికేందుకు స్నేహితులంతా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. సూటు, బూటు వేసుకుని దర్జాగా మొదటి తరగతి బోగీ నుంచి దిగుతాడనుకుంటే... తానేమో లాల్చీ, పైజామాలో సాధారణ బోగీ నుంచి దిగారు. తెల్లదొరల దర్పానికి సూచికలైన దుస్తులను ఓడలో ఉండగానే చంద్రమౌళి సముద్రంలోకి విసిరేశారని వారికప్పుడు తెలియదు.
రాటుదేల్చిన గాంధీజీ శిష్యరికం:విదేశాల్లో చదువుకున్న యువకులను భారత స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉంచేందుకు ఆంగ్లేయులు ఉద్యోగాలు, భూములను ఎరవేసేవారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టాతో చంద్రమౌళి లండన్ నుంచి తిరిగి రాగానే అస్సాంలోని టీ తోటల్లో ఆకర్షణీయమైన జీతంతో మేనేజర్ ఉద్యోగం ఇస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తరం పంపించింది. కోరుకున్న చోట వందెకరాల భూమినీ ఇస్తామంది. చంద్రమౌళి ఆలోచనలేమో జాతీయోద్యమం చుట్టూ తిరుగుతున్నాయి. సర్కారు కొలువు వదులుకోవద్దంటూ... బంధువులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ సంఘర్షణ తట్టుకోలేక చంద్రమౌళి... ఉత్తర భారత యాత్రకు వెళ్లి అక్కడి నుంచి గాంధీజీ ఆశ్రమానికి చేరుకున్నారు. 3 నెలలు గాంధీజీ వద్ద శిష్యరికం చేశారు. తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇంటికి వచ్చి... ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా వందల గ్రామాల్లో పర్యటించారు. చేబ్రోలులో 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించి, లాఠీ దెబ్బలు తిన్నారు. 1929 మార్చిలో తెనాలిలో విదేశీ వస్త్రాలను దహనం చేయించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రదేశ పర్యటనకు వచ్చిన గాంధీజీని మోపర్రుకు తీసుకొచ్చారు. గుంటూరులో 1930, 32లో రెండుసార్లు జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకెళ్లారు. మద్రాసు శాసనసభకు 1937లో జరిగిన ఎన్నికల్లో తెనాలి నుంచి చంద్రమౌళి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.