Azadi ka amrit mahotsav: ఈస్టిండియా కంపెనీ నుంచి పాలనాధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1858లో తీసుకుంది. అప్పటి నుంచి 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పడి... అది కాస్త పుంజుకునే వరకు... అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలం నిశ్శబ్దంగా గడిచిపోయినట్లు కనిపిస్తుంది. పైకి అలా అనిపించినా భారత్‌పై తమ పట్టు నిలబెట్టుకునేందుకు ఆంగ్లేయులు ఎన్ని చేయాలో అన్నీ చేసిన కాలమది. ముఖ్యంగా 1858 తర్వాత తొలి పదేళ్లు దేశంలో వినిపించని, కనిపించని మరణ మృదంగం మోగింది. సిపాయిల తిరుగుబాటును అణచివేసిన ఆంగ్లేయులు ఆ తర్వాత దీనిపై మరింత లోతుగా దృష్టిసారించి కఠిన చర్యలు తీసుకున్నారు. తిరుగుబాటుకు సహకరించిన, అందులో పాల్గొన్న దాదాపు వేల మంది సిపాయిలను దారుణంగా హతమార్చారు. అక్కడితో ఆగకుండా వారికి సహకరించిన గ్రామాలు, పట్టణాలు, ప్రజలపైనా పడ్డారు. ముఖ్యంగా ఉత్తర భారతంలోని అనేక గ్రామాలపై ఆంగ్లేయ సైనికులు విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను నేలమట్టం చేశారు. వేల మంది ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మేరఠ్‌కు సమీపంలోని జుమాల్‌పుర్‌పై ఆంగ్లేయులు దాడి చేసి ఇళ్లను, వాటిలోని వస్తువులను సర్వ నాశనం చేశారు. ఊరంతటినీ స్వాధీనం చేసుకున్నారు. భూపురా అనే ఊరునైతే మొత్తం కాల్చేశారు. ఆ ఊరిని వల్లకాడు చేసి... తమకు సహకరించిన జమీందారుకు ఇనాంగా రాసిచ్చేశారు. తమకు అడ్డువచ్చిన వారిని, అడ్డువస్తారని అనుమానం ఉన్నవారందరినీ ‘మాయం’ చేయటమే లక్ష్యంగా సాగిందీ మౌన మరణమృదంగం.
జామా మసీదు బంద్: ఇక సిపాయిల తిరుగుబాటులో తమను దెబ్బతీసిన దిల్లీలోనైతే ఆంగ్లేయుల అరాచకాలు మామూలుగా సాగలేదు. దిల్లీని పునర్ స్వాధీనం చేసుకున్న తర్వాత స్థానికులను తెల్లవారు గజగజలాడించారు. యావత్ దిల్లీలోని ఆస్తులను బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్ని పట్టణంలో నుంచి వెళ్లగొట్టారు. ముఖ్యంగా ముస్లింలపై పగబట్టారు. సిపాయిల తిరుగుబాటు పేరిట మళ్లీ దేశంలో మొఘల్ సామ్రాజ్యం ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారనే అనుమానమే ఇందుకు కారణం. జామా మసీదు వద్ద వేయి మందిని నిలబెట్టి కాల్చేశారు. అక్బర్‌బాదీ మసీదును నేలమట్టం చేశారు. దరియాగంజ్‌లోని జీనత్ ఉల్ మసీదును బేకరీగా మార్చారు. ఎర్రకోటకు ఎదురుగా ఉండే ఫతేపురి మసీదును అమ్మేశారు. జామా మసీదును 1862 దాకా మూసేశారు. మొత్తానికి 1857 తర్వాత భారత్‌లో ఏం జరిగిందనేది అంతగా చరిత్రకెక్కని విషాదం.