తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వాతంత్య్ర సమరంలోనూ మారుమోగిన 'బజాజ్'​ పేరు - స్వాతంత్ర్య అమృత మహోత్సవం

Azadi ka amrit mahotsav: హమారా బజాజ్‌ అంటూ ఆటోమొబైల్‌ మార్కెట్‌ను ఏలిన, సగటు భారతీయుడి మనసును దోచిన ‘బజాజ్‌’ పేరు స్వాతంత్య్ర సమరంలోనూ మారుమోగింది. కారణం... జమ్నాలాల్‌ బజాజ్‌. ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టిన జమ్నాలాల్‌... సామాన్యుడిలా జీవించారు. ఆంగ్లేయులిచ్చిన బిరుదులను వదిలేసి, దళితులకు తమ ఇంటి గుడి తలుపులను తెరిచారు. గాంధీజీకి సేవాగ్రామ్‌ను ఇచ్చి... ఆయనకు అయిదో కొడుకుగా, తిరుగులేని శిష్యుడిగా భారత చరిత్రలో నిలిచారు.

azadi-ka-amrit-mahotsav
స్వాతంత్ర్య సమరంలోనూ మారుమోగిన 'బజాజ్'​ పేరు

By

Published : Apr 27, 2022, 6:59 AM IST

Jamnalal Bajaj in independence movement: అప్పటి జైపుర్‌ సంస్థానంలోని కాశీ-కా-బాస్‌ అనే గ్రామంలో 1889 నవంబరు 4న జన్మించిన జమ్నాలాల్‌ బజాజ్‌ నాలుగేళ్ల వయసులోనే వార్దాకు వచ్చేశారు. అత్యంత సంపన్నులైన సేఠ్‌ బచ్‌రాజ్‌ కుటుంబం ఆయన్ని దత్తత తీసుకుంది. అపారమైన సంపద ఉన్నా... ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడే జమ్నాలాల్‌ను చూసి కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేవారు. చిన్నతనంలోనే ఒకసారి కుటుంబ విందుకు ఖరీదైన ఆభరణాలు లేకుండా వెళ్లినందుకు తాత బచ్‌రాజ్‌ కోప్పడ్డారు. తక్షణమే జమ్నాలాల్‌ కట్టుబట్టలతో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. తర్వాత తాత అర్థం చేసుకొని మళ్లీ బుజ్జగించి రప్పించారు. వయసు పెరుగుతున్న కొద్దీ జమ్నాలాల్‌ ఆలోచనలు బలపడ్డాయే తప్ప తగ్గలేదు.

గాంధీజీకి దత్తపుత్రుడు:12వ ఏటే వివాహమై, 17 ఏళ్లకే కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపార బాధ్యతలు చేపట్టిన జమ్నాలాల్‌... వ్యక్తిగత జీవితంలో మంచి గురువు కోసం అన్వేషించారు. ఎందరో మతపెద్దలను, సాధువులను కలిసినా కదలని ఆయన మది... గాంధీజీ వద్ద కరిగిపోయింది. 1915లో భారత్‌ వచ్చిన గాంధీజీని అహ్మదాబాద్‌లో అనేకసార్లు కలిశారు. ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక, మానసిక బంధం ముడిపడింది. గాంధీజీ ఆయన్ని దత్తత తీసుకొని తన అయిదో కుమారుడిగా ప్రకటించారు.

ప్రాధాన్యాలు గుర్తెరిగిన దేశభక్తుడు:వ్యాపారపరంగా అధికారంలో ఉన్న ఆంగ్లేయులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే... స్వాతంత్య్ర సమరంలో గాంధేయ బాటలో విజయవంతంగా ముందుకుసాగడం జమ్నాలాల్‌ చతురతకు నిదర్శనం. ఇబ్బంది వచ్చినప్పుడు... ఆంగ్లేయుల ప్రాపకం కంటే స్వాతంత్య్ర కాంక్షకే ఆయన పెద్దపీట వేశారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తెల్లవారిచ్చిన రాయ్‌ బహదూర్‌ బిరుదును వెనక్కి ఇచ్చేశారు. గౌరవ మేజిస్ట్రేట్‌ పదవినీ వదులుకున్నారు. వ్యాపారంలో లాభాలకు ట్రస్టీషిప్‌ భావనను ఆరంభించిన జమ్నాలాల్‌ జాతీయోద్యమ కీలక సమయంలో కాంగ్రెస్‌కు ఆర్థికంగా అండదండలు అందించారు.

నాసిక్‌ జైలులో రెండేళ్లు:కాంగ్రెస్‌లో 1920లో చేరిన ఆయన... నాగ్‌పుర్‌ సదస్సు నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. సహాయ నిరాకరణ ఉద్యమంతో ప్రారంభించి, 1942లో కన్నుమూసే దాకా ప్రతి పోరాటంలో గాంధీజీతోపాటు కలిసి నడిచారు. దండి యాత్ర సమయంలో రెండేళ్లపాటు నాసిక్‌ జైలులో ఉన్నారు. దేశంలో ఖాదీకి ప్రాచుర్యం కల్పించేందుకు 1921లో ఏర్పాటు చేసిన తిలక్‌ స్మారక నిధికి కోటి రూపాయలను సేకరించడంలో కీలకపాత్ర పోషించారు. 1923లో జెండా సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ని 18 నెలలు జైలులో పెట్టింది.

గాంధీజీని రాజకీయంగా అభిమానించడమేగాదు ఆయన ఆలోచనలను ఆచరణలో చూపడంలోనూ ముందున్నారు జమ్నాలాల్‌. దేశ సామాజిక నిర్మాణానికి, మహాత్ముడి ఆశయాలను నిజం చేయడానికి అనేక కార్యక్రమాలను ఆరంభించారు. ఖాదీకి ప్రాచుర్యం, విద్యారంగంలో నయీ తాలీమ్‌ (సాధారణ విద్యతోపాటు వృత్తి విద్యనూ కలిపి బోధించే విధానం) కోసం కృషి చేశారు. అంటరానితనం నిర్మూలనను తన ఇంటి నుంచే ఆరంభించారు. బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. తోసి రాజని.. తమ కుటుంబ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోకి దళితులను ఆహ్వానించారు. సేవాశ్రమం నిర్మించడానికి నాగ్‌పుర్‌కు సమీపంలోని వార్దాలో 20 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గాంధీజీని ఆహ్వానించారు. సబర్మతిని వీడాక గాంధీజీ ఇక్కడి నుంచే జాతీయోద్యమాన్ని నడిపించారు. భూదానోద్యమ నేత వినోబా భావేను కూడా వార్దాకు జమ్నాలాలే రప్పించారు. గాంధీజీ కలలను నిజం చేసేందుకు అనుక్షణం కృషిచేసిన జమ్నాలాల్‌ బజాజ్‌ 53వ ఏట 1942 ఫిబ్రవరి 11న వార్దాలోనే కన్నుమూశారు. ‘నేను చేసిన ప్రతి పనిలో మనసా వాచా కర్మణా... ధన రూపేణా జమ్నాలాల్‌ సాయం ఉంది’ అన్నారు గాంధీజీ. వార్దాలో ఆయన స్మారక స్తూపాన్ని భారీగా నిర్మించాలని గాంధీ ఆరాటపడ్డారు. ఆయన కోరికకు అనుగుణంగానే... వార్దాలో ఆయన స్మారకంగా గీతామందిర్‌ను నిర్మించారు. ఇందులో ఎలాంటి దేవుడు, విగ్రహాలుండవు. గ్రానైట్‌ బండలపై భగవద్గీత 18 అధ్యాయాలను చెక్కారు.

ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: లఖ్‌నవూ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన జిన్నా..

ABOUT THE AUTHOR

...view details