Azadi Ka Amrit Mahotsav: లండన్‌లో బారిస్టర్ చదివి వచ్చిన గాంధీజీ ముంబయి హైకోర్టులో ప్రాక్టీస్ మొదలెట్టారు. కానీ భారతీయ చట్టాల గురించి అంతగా తెలియని ఆయన ప్రాక్టీస్ అంతంతమాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే చెట్టుకింద ప్లీడరనొచ్చు! ఒకరోజు ఓ కేసు వచ్చింది. సరేనంటూ చేపట్టిన గాంధీకి మేజిస్ట్రేట్ ముందుకు వెళ్లగానే భయంతో నోరు పెగల్లేదు. దాంతో న్యాయమూర్తికి, తన క్లయింట్‌కు క్షమాపణ చెప్పి తప్పించుకున్నారు. ఈ వాదన తనతో కాదని గుర్తించి రాజ్‌కోట్ వెళ్లారు. అక్కడ తన సోదరుడికి ఓ లీగల్ కంపెనీతో బంధం ఉండేది. అక్కడే పిటిషన్లు రాస్తూ.. ఎంతో కొంత సంపాదించే పనిలో కుదిరారు. అది బాగానే కొనసాగింది. ఈ సమయంలో..
పోర్‌బందర్ రాజుకు గాంధీ పెద్దన్న లక్ష్మీదాస్ సలహాదారుగా ఉండేవారు. పేరుకే రాజు. అధికారాలన్నీ బ్రిటిష్‌వారి చేతుల్లోనే ఉండేవి. తమకున్న నగల విషయంలో రాజుకు, బ్రిటిష్‌వారికి మధ్య గొడవ సాగుతుండేది. వాటిని ప్రజాధనంగా స్వాధీనం చేసుకోవాలని ఆంగ్లేయులు, తమ వ్యక్తిగత ఆస్తి అని రాజు వాదించుకునేవారు. ఈ క్రమంలో రాజు.. ఆంగ్లేయులకు తెలియకుండా ప్యాలెస్ ఖజానా నుంచి నగల్ని తీసుకున్నారు. ఈ విషయంలో లక్ష్మీదాస్ ఆయనకు సహకరించారు. ఈ విషయం తెలిసిన ఒక ఆంగ్లేయ అధికారి సర్ చార్లెస్ ఒలివెంట్ వీరిద్దరిపై చర్యకు ఉపక్రమించాడు. ఈ అధికారి.. తాను లండన్‌లో చదివేప్పుడు గాంధీకి పరిచయం. ఆ సమయంలో గాంధీతో ఎంతో చనువుగా, స్నేహంగా ఉండేవాడు. ఈ విషయం తెలిసిన లక్ష్మీదాస్ ఆ అధికారి వద్దకు తమ్ముడు మోహన్‌దాస్ గాంధీని పంపించారు. "నాకు ఇష్టం లేకున్నా అన్నకోసం వెళ్లాల్సి వచ్చింది" అంటూ అక్కడేం జరిగిందో ఆయనే వివరించారు.
"లండన్‌లో ఎంతో చనువుగా పలకరించిన ఒలివెంట్.. ఇక్కడి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. అసలు నా మాట వినటానికి కూడా అంగీకరించలేదు. మా అన్నయ్య.. అంటూ చెప్పబోతుంటే.. మీ అన్నయ్య దొంగ. నువ్వేమీ చెప్పక్కర్లేదంటూ.. కూర్చీలోంచి విసురుగా లేచాడు. అంతేగాకుండా.. తక్షణమే గదిలోంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండనగానే.. ఆయనకు కోపం నషాళానికి అంటింది. తన ప్యూన్‌ను పిలిచి నన్ను బయటకు పంపించేయమన్నారు. అప్పటికీ నేనింకా.. అలాగే ఉండటంతో ప్యూన్ వచ్చి భుజాలపై చేయి వేసి గదిలోంచి బయటకు గెంటివేశారు. నన్ను కోపంగా చూస్తూ ఇద్దరూ వెళ్లిపోయారు."
ఒలివెంట్‌పై చట్టపరంగా చర్య తీసుకోవాలని యోచించారు గాంధీ! ఈ విషయం.. అప్పటి ప్రముఖ న్యాయవాది, రాజకీయనాయకుడు, బ్రిటిష్‌వారికి సన్నిహితుడైన సర్ ఫిరోజ్‌షా మెహతాకు గాంధీ స్నేహితుడొకరు చెప్పారు. "గాంధీకి చెప్పు.. చాలామంది బారిస్టర్‌లకు ఇలాంటి అనుభవాలు సాధారణమేనని. ఆయన ఇప్పుడిప్పుడే ఇంగ్లాండ్‌లో చదువుకొని వచ్చారు. ఉడుకురక్తం.. ఆయనకు బ్రిటిష్ అధికారుల గురించి పూర్తిగా తెలియదు. ఆంగ్లేయ అధికారిపై కోర్టుకు వెళ్లటం వల్ల ఆయనకు ఒరిగేదేమీలేదు. సరికదా.. పూర్తిగా దెబ్బతింటాడు" అంటూ హెచ్చరించారాయన. ఈ సంఘటన నా జీవితాన్ని మార్చివేసిందంటూ. తెల్లవారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు గాంధీ. అలాంటి నిస్పృహ వాతావరణంలో .. పోర్‌బందర్‌కు చెందిన దాదా అబ్దుల్లా కంపెనీ దక్షిణాఫ్రికాలో కోర్టు పనులు చూసే గుమాస్తా కావాలని కోరుతుంది. ఈ ఉద్యోగానికి సరిపోతానంటూ.. ఏడాదికి 105 పౌండ్ల జీతానికి దక్షిణాఫ్రికా ఓడెక్కారు గాంధీ! అక్కడా ఆంగ్లేయుల ఆగడాలకే గురవటం.. నాయకుడిగా ఎదగటం.. సత్యాగ్రహాన్ని ఆవిష్కరించటం.. తిరిగి వచ్చి భారత్ నుంచి బ్రిటిష్‌వారిని గెంటివేసే ఉద్యమానికి ఊతమవ్వటం.. గాంధీజీ సైతం ఊహించని పరిణామాలు!
ఇదీ చదవండి:దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. ఆ సేవలకు అంతరాయం