రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బ్రిటన్ గెలిచింది. అయినా అక్కడి ఎన్నికల్లో యుద్ధ వీరుడు చర్చిల్ ఓడిపోయాడు. అట్లీ సారథ్యంలోని లేబర్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదట్నుంచీ... భారత్ పట్ల సానుకూల వైఖరితో ఉన్న లేబర్‌పార్టీ, అట్లీ తమ ఆలోచనను ఆచరణలో పెట్టడం ఆరంభించారు. యుద్ధం కారణంగా బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దిగజారటం; భారత్‌లో రాజకీయ, సైనిక నియంత్రణ కూడా ఇబ్బందికరంగా తయారవటంతో భారత్‌పై పట్టు కొనసాగించటం కష్టమని ఆంగ్లేయులు గుర్తించారు. పరిస్థితి దిగజారి అవమానకరంగా వైదొలగాల్సి రాకముందే... గౌరవప్రదంగా నిష్క్రమించటం మేలని నిర్ణయించుకున్నారు. రాజ్యాంగ రచన, దేశవిభజనపై భారత్‌లో కాంగ్రెస్, ముస్లింలీగ్‌ల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాకున్నప్పటికీ.... భారత్‌ను ఎలాగోలా వదిలించుకోవటానికే ఆంగ్లేయులు నిశ్చయించుకున్నారు. దేశవిభజనపై నిర్ణయం తీసుకోకుండానే నిష్క్రమణపై ప్రకటన వెలువరించటం విశేషం.
ఈ ప్రకటనలో 200 ఏళ్ల బ్రిటిష్ అధికారం అంతం కాబోతోందనే సంగతితో పాటు... భారత్ ముక్కలు ముక్కలు (భారత్, పాకిస్థాన్‌లుగానే కాకుండా... సంస్థానాలకు స్వేచ్ఛ రూపంలో) అయ్యే అవకాశాలున్నాయనే సంకేతాలు కూడా ఉన్నాయి. వీడుకోలు తాంబూలాలిస్తున్నాం... తన్నుకు చస్తారో, కలిసే ఉంటారో మీరూమీరూ తేల్చుకోండని చేతులు దులిపేసుకుంది ఆంగ్లేయ సర్కారు.
విభజన జరిగినా.. జరగకున్నా..
1947 ఫిబ్రవరి 20న లండన్‌లోని ప్రతినిధుల సభలో బ్రిటన్ ప్రధాని అట్లీ కీలక ప్రకటన.
"ఒకటి లేదా రెండు దేశాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న ప్రతిపాదనకు కొద్దిరోజుల కిందటే వైస్రాయ్‌తో భేటీలో భారత్‌లోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పందన లభించింది. తదనుగుణంగా 1948 జూన్ 30 నాటికి బాధ్యతగల ప్రభుత్వం చేతిలోకి బ్రిటిష్ ఇండియా అధికారాన్ని అప్పగించబోతున్నాం.
భారత ప్రజల ఆకాంక్షల మేరకు అధికారాన్ని బదిలీ చేయాలన్నదే చాలాకాలంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆలోచన. అయితే భారత రాజకీయ పార్టీల మధ్య సరైన సమన్వయం, ఒప్పందం కుదిరి ఉంటే ఇది సాఫీగా సాగేది. కానీ అలాంటి పరిస్థితి లేని కారణంగా... బ్రిటిష్ ప్రభుత్వమే అధికార బదిలీకి ఓ ప్రణాళికను రూపొందించింది. అలాగని భారత్‌కు కొత్త రాజ్యాంగాన్ని రచించే ఉద్దేశం బ్రిటన్‌కు ఏమాత్రం లేదని... ఆ బాధ్యత భారత ప్రజలదేనని స్పష్టం చేస్తున్నాం. అంతేగాకుండా భారత్‌ను తప్పనిసరిగా కలిపి ఉంచేలా చర్చలు జరిపే కార్యక్రమం కూడా మా ప్రణాళికలో లేదు. భారత్‌లో రాజ్యాంగ సభ ఇప్పటికే పని ఆరంభించింది. ముస్లింలీగ్ మాత్రం ఇంకా సభలో పాల్గొనటం లేదు. ఏ ప్రాంత ప్రతినిధులైతే ఆమోదించరో... ఆయా ప్రాంతాల్లో కొత్త రాజ్యాంగం అమలుకాదనేది స్పష్టం. అయితే ప్రాదేశిక ప్రత్యేకతల దృష్ట్యా బెంగాల్, పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, అస్సాం, వాయువ్య రాష్ట్రాలు ఇప్పుడున్న రాజ్యాంగ సభనే కోరుకుంటాయో? లేక కొత్త సభను ఏర్పాటు చేయాలంటాయో, ఒకవేళ దేశ విభజన జరిగితే భారత్‌లో ఉంటాయో లేదో తేల్చుకోవాల్సి ఉంది.
1948 జూన్‌కల్లా భారత్ నుంచి బ్రిటన్ వైదొలగుతుంది. ఒకవేళ ఆ సమయానికి భారత రాజకీయ పార్టీల మధ్య రాజీ కుదరకున్నా... ఏమీ తేలకున్నా కూడా బ్రిటిష్ సర్కారు ఒకటి లేదా రెండు ప్రభుత్వాలకు అధికారాన్ని బదిలీ చేసి వెళ్లిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి... లేదా కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు (రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం లేని ముస్లిం మెజార్టీ ప్రాంతాలు) అధికారాన్ని బదిలీ చేస్తాం. సంస్థానాలపై అధికారాన్ని కొత్త ప్రభుత్వాలకు ఇవ్వలేం. లార్డ్ వావెల్ స్థానంలో ఇకపై లార్డ్ మౌంట్‌బాటెన్ భారత వైస్రాయ్‌గా బాధ్యతలు తీసుకొని... అధికార బదిలీని పర్యవేక్షిస్తారు."
ఇదీ చదవండి: