Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. సబర్మతి నుంచి సుమారు 78 మందితో ఆరంభమైన యాత్రలో దండికి చేరేసరికి లక్షల మంది చేరారు. ఊరూరా వందల మంది యాత్రలో జమయ్యారు. ఆ జన ప్రవాహాన్ని చూసి భారతీయులంతా ఉత్తేజితులై ఉరకలెత్తుతుంటే... ఒక వర్గం మాత్రం అసంతృప్తితో రగిలిపోయింది. వారే... భారతీయ మహిళలు! కారణం- ఉప్పు సత్యాగ్రహంలో మహిళలకు గాంధీజీ చోటు కల్పించకపోవటం. సబర్మతి నుంచి దండికి బయల్దేరిన గాంధీజీ అనుయాయుల జాబితాలో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. ఇది జాతీయోద్యమానికి ఆకర్షితులైన అనేకమంది అతివలకు ఆగ్రహం కలిగించింది. బొంబాయిలో కమలాదేవి ఛటోపాధ్యాయ, సరోజినీ నాయుడు, పెరిన్ కెప్టెన్ (దాదాబాయి నౌరోజి మనవరాలు)లు గాంధీకి తమ అసంతృప్తిని వ్యక్తంజేస్తూ లేఖ రాశారు. ఆయన్ను కలవాలనుకున్నారు.
గాంధీజీ తన వాదన వినిపించారు. "మహిళల శక్తిపై నాకెలాంటి అనుమానం లేదు. కానీ ఆడవారిని అడ్డంపెట్టుకొని పిరికిపందల్లా ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారని ఆంగ్లేయులు అనే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా దండి యాత్ర జాబితాలో వారిని చేర్చలేదు. శాసనోల్లంఘనలో మహిళలు పాలు పంచుకోవటం మంచిదే. అయితే వారు మద్యనిషేధం, మద్యం షాపుల ముందు పికెటింగ్, ఖాదీ తయారీ తదితర రంగాల్లో చురుగ్గా పాల్గొనాలి. మగవారి మనసు మార్చే శక్తి మహిళలకే ఉంది. మద్యం ఆగిపోతే సమాజం బాగుపడుతుంది" అంటూ గాంధీజీ తన ఉద్దేశాన్ని వివరించారు. దండి దాకా సాగిన యాత్రలో ప్రతి ఊర్లోనూ ఆయన స్థానిక మహిళలను ఇంట్లోనే ఉప్పు తయారు చేయాలని ప్రోత్సహించారు. కానీ సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయలాంటివారు తాము కేవలం పికెటింగ్‌లకే పరిమితం కాబోమని... ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొంటామని తేల్చిచెప్పారు. భారతీయ మహిళలకు నిత్యజీవితంలో ఉప్పుతో విడదీయరాని అనుబంధముంది. అలాంటి ఉప్పు సత్యాగ్రహంలో మేం పాల్గొనకుండా ఉండలేం... అంటూ స్పష్టం చేశారు. వద్దన్నా వినకుండా సరోజినీ నాయుడు, మితుబెన్‌లు కారులో దండికి చేరుకున్నారు.
కాలినా.. కదలకుండా..