తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ను వదులుకోవడం ఇష్టం లేక.. గాంధీపైనే నిందలు మోపి.. - వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో

భారత్‌ నుంచి వైదొలగుతామని బ్రిటిష్‌ ప్రధాని అట్లీ ప్రకటించినా.. దాన్ని అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్నీ జరిగాయి. ముఖ్యంగా.. బ్రిటన్‌ కన్జర్వేటివ్‌పార్టీ నేత, మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ తుదిదాకా భారత స్వాతంత్య్రానికి అడ్డుపుల్లలు వేస్తూనే వచ్చారు. వాటన్నింటినీ దాటుకొని పార్లమెంటులో ఆమోదం పొందిన భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటిష్‌ రాజు 1947 జులై 18న ఆమోదముద్ర వేశారు.

విన్‌స్టన్‌ చర్చిల్‌
winston churchil

By

Published : Jul 31, 2022, 7:01 AM IST

రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పటికే భారత్‌ పట్ల సానుకూలంగా ఉన్న లేబర్‌నేత క్లెమెంట్‌ అట్లీ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే భారత స్వాతంత్య్ర ప్రక్రియను వేగవంతం చేశారు. మౌంట్‌బాటన్‌ను వైస్రాయ్‌గా పంపించటం.. చకచకా అధికార బదిలీ ప్రణాళిక తెప్పించుకోవటం.. దానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేయటం అంతా నాలుగైదు నెలల్లో జరిగిన పరిణామాలు. 1947 జులై 4న భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

దీనిని విపక్షనేతగా విన్‌స్టన్‌ చర్చిల్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి బంగారు బాతులాంటి భారతావనిని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో భాగంగానే ఉంచాలనేది చర్చిల్‌ భావన. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు భారత్‌కు స్వాతంత్య్రం అటుంచి.. స్వయంప్రతిపత్తి ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు. "బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని బలహీన పర్చటానికి కాదు నన్ను ఎన్నుకున్నది" అంటూ వలస సామ్రాజ్యవాదానికి వత్తాసు పలికాడు. గాంధీనైతే అనరాని మాటలన్నాడు. ఆయన ఎప్పుడు చస్తాడు?.. ఇంకా చావలేదా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. గాంధీని కేసుల్లో ఇరికించటానికి కుట్రలు చేశారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇవ్వగానే ఆయన్ను అరెస్టు చేయించారు చర్చిల్‌. అక్కడితో ఆగకుండా తమ శత్రుదేశం జపాన్‌తో కలసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాంధీపై ఆధారాలు సమర్పించాలంటూ భారత వైస్రాయ్‌ని ఆదేశించారు. కానీ అలాంటిదేమీ లేదని వైస్రాయ్‌ కార్యాలయం స్పష్టం చేసింది. గాంధీ ఉపవాసాలు, నిరాహార దీక్షలపైనా చర్చిల్‌కు అనుమానాలుండేవి. ఆయన దొంగతనంగా గ్లూకోజ్‌ తీసుకుంటున్నారని అనుమానించేవారు. ఈ మేరకు వైస్రాయ్‌కి లేఖలపై లేఖలు రాశారు. గాంధీ దొంగతనాన్ని ఎలాగైనా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. చివరకు విసుగెత్తిన వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో "అలాంటి మోసం ఏదైనా గాంధీ చేసినట్లైతే మీకు ఫోన్‌ చేసి చెబుతా. కానీ ఆ అవకాశం రాదు" అని ఘాటుగా బదులిచ్చారు. గాంధీని రోజూ పర్యవేక్షించే యూరోపియన్‌ డాక్టర్‌ చెప్పినా చర్చిల్‌ నమ్మలేదు. గాంధీ చనిపోయాక కూడా.. ఆయనపై అపనమ్మకాన్ని చర్చిల్‌ వ్యక్తంజేశారు. దొంగచాటున గ్లూకోజ్‌ తీసుకునేవారని.. లేదంటే నిరాహారదీక్షలు చేసి అలా బతకటం కష్టమని నిందలు మోపారు.

గాంధీనీ, భారత్‌ను తీవ్రంగా అసహ్యించుకున్న చర్చిల్‌.. బ్రిటన్‌ పార్లమెంటులో భారత స్వాతంత్య్ర బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే.. ప్రధాని అట్లీకి లేఖ రాశారు. బిల్లులో 'భారత్‌కు స్వాతంత్య్రం' అనే పదానికి అభ్యంతరం వ్యక్తంజేస్తూ.. తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 'భారత్‌, పాకిస్థాన్‌లకు కేవలం స్వయం ప్రతిపత్తి మాత్రమే ఇస్తున్నప్పుడు భారత స్వాతంత్య్ర బిల్లు అని ఎలా అంటారు? స్వయంప్రతిపత్తి అంటే.. ఇంకా భారత్‌, పాకిస్థాన్‌లపై ఇంగ్లాండ్‌ చక్రవర్తి ప్రభావమే ఉంటుంది కదా' అని చర్చిల్‌ గుర్తుచేశారు. కానీ అట్లీ ఈ వాదనను తిప్పికొట్టారు. "ఆస్ట్రేలియా, కెనడాలకు మనం స్వయం ప్రతిపత్తే ఇచ్చినా.. అవి స్వతంత్ర దేశాలుగానే తమనుతాము అభివర్ణించుకుంటున్నాయి. అలాగే వ్యవహరిస్తున్నాయి. కామన్వెల్త్‌దేశంగా ఉంటూనే స్వతంత్రంగా ఉంటే తప్పేంటి? స్వయంప్రతిపత్తికున్న అర్థం కూడా అదే" అంటూ అట్లీ బదులిచ్చారు. అయినా.. చర్చిల్‌ అడ్డుపుల్లలు వేయడం ఆపలేదు. బిల్లుపైనా, భారతీయులపైనా పార్లమెంటు వేదికగా విషం కక్కారు. దారుణమైన తమ పాలనకు కితాబిచ్చుకున్నారు. "హిందూ-ముస్లింల మధ్య వేల సంవత్సరాలుగా ఉన్న విభేదాలకు 14నెలల్లో ఎలా స్వస్తి పలుకుతారు? ఒకవేళ 14 నెలల తర్వాత ప్రపంచ జనాభాలో ఐదోవంతు మందిని గందరగోళంలో పడేస్తే.. మన దేశానికున్న మంచిపేరు మట్టిలో కలవదా? అలా చేయటం ప్రపంచ నేరం కాదా? అది మన మంచితనంపై ఎన్నటికీ మాయని మచ్చలా మిగిలిపోతుంది" అని చర్చిల్‌ వాదించారు. కానీ.. పార్లమెంటు వీటన్నింటినీ పట్టించుకోలేదు. 337 మంది బిల్లుకు అనుకూలంగా.. 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు. బిల్లు చట్టమైంది. మరుసటి రోజే.. జులై 18న రాజముద్ర కూడా పడిపోయింది. భారత్‌-పాకిస్థాన్‌ల స్వాతంత్య్రానికి రాజమార్గం సుగమమైంది!

ఇవీ చదవండి:హిందూ- ముస్లిం ఐక్యత కోరిన వ్యక్తి.. కరడుగట్టిన ముస్లింవాదిగా..

భగత్​సింగ్​ను తప్పించాలని.. బాంబు తయారుచేస్తూ 26 ఏళ్లకే..

ABOUT THE AUTHOR

...view details