పైకాలంటే సైనిక రైతులు! కళింగ రాజ్య కాలం నుంచీ ఇక్కడ పైకాల సంప్రదాయం వేళ్లూనుకుంది. యుద్ధ సమయంలో పైకాలు రాజు తరఫున రంగంలోకి దిగేవారు. సాధారణ సమయాల్లో తమకు కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేసేవారు, చేయించేవారు. పైకాల్లో వారువీరని కాకుండా అన్ని కులాల వారుండేవారు. అన్ని ఊర్లలో వీరే శాంతిభద్రతలను కాపాడే బాధ్యత కూడా తీసుకునేవారు. పూరీకి సమీపంలోని ఖుర్దా రాజ్యంలోనూ వీరి సంఖ్య భారీగా ఉండేది. ప్రతిష్ఠాత్మక పూరి జగన్నాథ దేవాలయ నిర్వహణ బాధ్యత ఈ ఖుర్దా రాజుదే. అందుకే ఒడిశాలో ఖుర్దాకు ఎంతో ప్రత్యేకత ఉండేది. మరాఠాలను ఓడించి ఒడిశాను విడతలు విడతలుగా (1803-04 నాటికి) స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తొలుత తమ రాకపోకలకు వీలుగా ఖుర్దా రాజు రాజా ముకుందదేవ-2తో నోటిమాట ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వెనకాలున్న ఆక్రమణ కుట్రను పసిగట్టిన ప్రధాని రాజగురు తమ రాజును అప్రమత్తం చేశారు. కానీ అప్పటికే 1804 డిసెంబరులో ఆంగ్లేయ సైన్యం ఖుర్దాపై దాడి చేసింది. రాజు తరఫున పైకాలు రంగంలోకి దిగినా లాభం లేకపోయింది. రాజు ముకుందదేవ సమీప అడవుల్లోకి వెళ్లి తలదాచుకోగా, ప్రధాని రాజగురును అదుపులోకి తీసుకున్న ఆంగ్లేయులు అత్యంత దారుణంగా హతమార్చారు. మర్రిచెట్టుకు తలకిందులుగా వేలాడదీసి.. శరీరాన్ని రెండుగా చీల్చి చంపారు. తర్వాత రాజు ముకుందదేవను పట్టుకొని కేవలం పూరీకే పరిమితం చేసి డమ్మీగా ఉంచారు.
మరోవైపు.. పైకాలపై కంపెనీ అధికారులకు సదభిప్రాయం లేదు. ఏనాటికైనా వారు జన్మభూమికే విశ్వాసంగా ఉంటారని భావించి.. వారి నుంచి భూమిని లాక్కొని బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన భూస్వాములకు అప్పగించారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీగా శిస్తు పెంచారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు కూడా వేరే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ పైకాలను పీల్చిపిప్పి చేశాయి. అప్పటిదాకా రాజ్య సంరక్షకులుగా భూమిపై హక్కులనుభవిస్తున్న వారు కాస్తా.. ఉన్నట్టుండి బికారులయ్యారు. తలవంచుకొని బతకటమో.. తిరుగుబాటు చేయటమో.. తేల్చుకోవాల్సిన తరుణంలో పైకాలు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు.