Vedaranyam Salt Satyagraha: దండియాత్ర స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉప్పు చట్టం ఉల్లంఘన ఉవ్వెత్తున కొనసాగింది. గాంధీజీకి సన్నిహితుడైన సి.రాజగోపాలాచారి (రాజాజీ) తమిళనాడులో ఈ యాత్రను చేపట్టారు. దండిలో గాంధీజీ యాత్ర ముగిశాక 1930 ఏప్రిల్ 13న రాజాజీ ఈ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తంజావూరు జిల్లాలోని వేదారణ్యం అనే సముద్ర తీరప్రాంత గ్రామం దాకా 240 కిలోమీటర్ల పొడవున దీన్ని చేపట్టాలని ప్రణాళిక రచించారు. ఖాదీ ప్రాధాన్యం వివరిస్తూ, కులవివక్షకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ యాత్ర సాగింది. ఎంపిక చేసిన 150 మంది యువకులతో రాజాజీ ముందునడిచారు. పాద యాత్రికులెవ్వరూ కాఫీ తాగరాదని, పొగాకు, సిగరెట్లు ముట్టుకోవద్దని నిబంధన పెట్టారు.
మరోవైపు మద్రాసులోని ఆంగ్లేయ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సత్యాగ్రహాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుంది. వేదారణ్యం యాత్రకు సహకరించినవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అందులో నడుస్తున్న వారికి ఆహారం ఇచ్చినా, వారికి వసతి కల్పించినా శిక్ష తప్పదని ప్రజలను కలెక్టర్లు హెచ్చరించారు. పిల్లలు పాల్గొనకుండా కట్టడి చేయాలని తల్లిదండ్రులకు స్పష్టంచేశారు. స్థానిక భాషలో కరపత్రాలు ముద్రించి మరీ పంపిణీ చేశారు. ఈ యాత్ర వార్తలు ప్రచురించకుండా పత్రికలపైనా ఆంక్షలు విధించారు.
తిండి పెడితే ఆరు నెలల జైలు:తంజావూరు చేరగానే.. ఆ జిల్లా కలెక్టర్ జె.ఎ.థోర్న్ యాత్రను ఎలాగైనా భగ్నం చేయాలనే పట్టుదల ప్రదర్శించారు. రాజాజీ అనుచరులకు తిండి పెట్టిన వారికి, వసతి కల్పించిన వారికి ఆరు నెలల కఠిన కారాగార శిక్షతోపాటు జరిమానా విధిస్తామని ఊరూరా హెచ్చరించారు. కానీ... కుంభకోణంలో పంతులు అయ్యర్ అనే దేశభక్తుడు కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘించి వసతి కల్పించారు. వెంటనే ఆయన్ని అరెస్టు చేసి, జైలుకు పంపించారు. ఆయన బాటలోనే పయనించిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులనూ కొలువుల నుంచి తొలగించారు. ఏప్రిల్ 25న యాత్ర తిరుత్తురాయ్‌పూండికి చేరగానే పోలీసుల ఆంక్షలు పెరిగాయి. దీనికితోడు అక్కడ వసతి కల్పించిన ప్రముఖ నాయకుడు రామచంద్ర నాయుడును కూడా అరెస్టు చేయడం వల్ల స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో రామచంద్రం పిళ్లై అనే గాంధేయవాది బుర్రలో ఓ సరికొత్త ఆలోచన మెదిలింది.