Azadi Ka Amrit Mahotsav Vaikom Satyagraha: అప్పటి ట్రావెన్‌కోర్ సంస్థానంలో (ప్రస్తుత కేరళ రాష్ట్రం) తిరువనంతపురానికి 115 మైళ్ల దూరంలో ఉంటుంది వైకోమ్. ట్రావెన్‌కోర్ రాజకుటుంబ సారథ్యంలోని ఇక్కడి శివాలయంలోకి అంటరాని కులాలకు ప్రవేశం ఉండేది కాదు. ఆలయంలోకి అటుంచి.. దేవాలయానికి చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లోకి కూడా వారిని అడుగుపెట్టనిచ్చేవారు కాదు. అలాంటి చోట సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక విప్లవకారుడు నారాయణగురుకు జరిగిన అవమానం.. ఈ సత్యాగ్రహానికి పురికొల్పింది.
నిమ్నకులంగా పరిగణించే ఎజవా సమాజంలో జన్మించిన నారాయణగురు .. సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తులపై పట్టు సంపాదించి ఆధ్యాత్మిక గురువయ్యారు. సంఘసంస్కర్తగా విద్యాసంస్థలు తెరిచారు. కుల వివక్షపై పోరాడారు. ఈ క్రమంలో ఓసారి వైకోమ్‌లోని శివాలయానికి వెళుతుంటే.. దారిలోనే ఆయన్ను ఆపేశారు. ప్రవేశం లేదన్నారు. ఆయన శిష్యుల్లో ఒకరైన జాతీయ కాంగ్రెస్ నేత టి.కె.మాధవన్... ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. అన్ని కులాలకూ దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలంటూ 1918లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన మాత్రం పట్టువదలకుండా కాకినాడ కాంగ్రెస్ మహాసభలో ఒప్పించి.. ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గాంధీజీ సైతం తన మద్దతు ప్రకటించారు. 1924 మార్చి 30న వైకోమ్ సత్యాగ్రహం ఆరంభమైంది. అంటరాని కులాల వారితో పాటు అగ్రవర్ణంగా పేరొందిన నాయర్లు కూడా ఇందులో పాల్గొనటం విశేషం.
"వైకోమ్ సత్యాగ్రహుల పోరాటం.. స్వరాజ్య పోరాటానికి ఏమాత్రం తక్కువ కాదు"
- యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ
సత్యాగ్రహులు ముగ్గురుముగ్గురు చొప్పున దేవాలయం వైపు శాంతియుతంగా వెళ్లటం.. వారిని అరెస్టు చేయగానే.. మరికొంతమంది బయల్దేరటం! ఇదే తంతు రోజులపాటు సాగింది. క్రమంగా.. ట్రావెన్‌కోర్ జైళ్లు నిండిపోసాగాయి. నిరసనకారులు బారికేడ్ల వద్దే కూర్చొని గాంధీజీ చెప్పినట్లు.. చరఖా నడిపేవారు. భారీ వర్షాలు పడ్డా వారు వెనక్కి తగ్గలేదు. మొలలోతు నీళ్లలో అలాగే నిల్చొని శాంతియుతంగా పోరాటం కొనసాగించారు. నారాయణ గురు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. తన వేలూర్ మఠాన్ని సత్యాగ్రహుల కార్యాలయంగా మార్చారు. సహాయ నిరాకరణ ఉద్యమం వెనక్కి వెళ్లి.. కుల వివక్షపై వైకోమ్‌లో సాగుతున్న పోరాటం అందరినీ ఆకట్టుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావటం మొదలైంది. పంజాబ్ నుంచి అకాలీలూ వచ్చి మద్దతు పలికారు. సత్యాగ్రహులకు వారు వంటశాలలు తెరిచారు.
1924 అక్టోబరు 1న పద్మనాభన్ నాయర్ సారథ్యంలో వివిధ అగ్రవర్ణాల ప్రజలు కూడా ఉద్యమానికి మద్దతుగా నాలుగు వైపుల నుంచి గుడికి యాత్రగా వచ్చారు. 500 మందితో మొదలైన వారి యాత్ర.. చివరికి వచ్చేసరికి 5వేల మందికి చేరింది. వీరి యాత్ర పొడవునా.. నిమ్న కులాల వారు పెట్టిన ఆహారం తీసుకుంటూ నడిచారు. అన్ని కులాలకూ ఆలయ దారులు తెరవాలంటూ.. 25 వేలమంది సంతకాలతో ట్రావెన్‌కోర్ మహారాణి సేతులక్ష్మి బాయికి వినతి పత్రం సమర్పించారు. జైలు నుంచి విడుదలైన గాంధీజీ 1925 మార్చిలో వైకోమ్ రావటంతో సత్యాగ్రహులకు కొత్త బలం వచ్చింది. మహారాణితో పాటు ఆలయ ధర్మకర్తలతో కూడా గాంధీజీ గంటల పాటు వాదించారు. 9రోజుల గాంధీజీ వైకోమ్ పర్యటన అప్పటికప్పుడు ఫలితం ఇవ్వకున్నా.. 1925 నవంబరునాటికి రాజ కుటుంబం దిగివచ్చింది. నాలుగింట మూడు ఆలయదారుల్లో అన్ని కులాల వారికీ అనుమతిచ్చింది. 1936లో ట్రావెన్‌కోర్ సంస్థానంలోని అన్ని గుళ్లలోకీ కులాలకు అతీతంగా ప్రజలందరినీ అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:బ్రిటిష్ పన్నులపై పెదనందిపాడు పోరు.. గాంధీ కంటే ముందే అడుగేసి..