తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi ka amrit mahotsav: ఐక్య భారత్​ ఆగిందిలా! - ఆజాదీ కా అమృత్​

Azadi ka amrit mahotsav: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో కూడిన ఐక్య భారత్‌ ఏర్పడి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు ఊహించటం ఎలా ఉన్నా.. అది దాదాపు సాధ్యంలానే కన్పించింది. దేశానికి స్వాతంత్య్రం ఖరారయ్యాక... ఒక దశలో ఇదే దాదాపు ఖాయమైంది. కానీ తెరవెనక రాజకీయాలతో అది తేలిపోయింది.

azadi ka amrit mahotsav
ఐక్య భారత్​ ఆగిందిలా!

By

Published : Jan 6, 2022, 6:46 AM IST

Azadi ka amrit mahotsav: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత... భారత్‌ను ఇక వీడిపోవాలని నిర్ణయించుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా 1946 మార్చిలో ముగ్గురు బ్రిటిష్‌ కేబినెట్‌ మంత్రుల బృందాన్ని భారత్‌కు పంపించింది. దీన్నే కేబినెట్‌ మిషన్‌గా పిలుస్తుంటారు. భారత్‌ను ఐక్యంగానే ఉంచి స్వాతంత్య్రం ఇవ్వటమా... భారత్‌-పాకిస్థాన్‌లుగా విభజించటమా అనే అంశమే ఈ కమిటీ ప్రధాన ఎజెండా! విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్‌... భారత్‌లో భాగంగానే కొన్ని ప్రాంతాలకు అవసరమైతే సాంస్కృతిక, ఆర్థిక, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఇవ్వటానికి సిద్ధమంది. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం కేబినెట్‌ కమిటీ ఓ ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం దేశ విభజనను తిరస్కరించి, ఐక్య భారత్‌నే ప్రతిపాదించారు.

అటు కాంగ్రెస్‌, ఇటు ముస్లిం లీగ్‌లు ఈ ప్రణాళికకు అంగీకరించాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విభజన లేకుండానే స్వాతంత్య్రం వచ్చేస్తుందనుకున్నారు. అంతలో... పరిస్థితులు వేగంగా మారాయి. బ్రిటిష్‌ ఎత్తుగడలు, జిన్నా మాటలు కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేశాయి. పాకిస్థాన్‌ ఏర్పాటు తప్ప మరేదానికీ తగ్గేదేలే అంటూ వచ్చిన మహమ్మద్‌ అలీ జిన్నా ముస్లింలీగ్‌ సమావేశంలో మాట్లాడుతూ... ‘‘ఆలస్యమైనా పాకిస్థాన్‌ ఏర్పాటు ఖాయం. మనం ఆ దిశగానే నడుస్తున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు... స్వాతంత్య్రానంతరం కూడా బలహీనమైన కేంద్ర ప్రభుత్వం సాయంతో... భారత్‌పై పట్టు కొనసాగించాలని బ్రిటన్‌ భావిస్తోందనే వాదన మొదలైంది. వీటన్నింటికంటే కూడా ‘రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చినట్లు... ముఖ్యంగా మత ప్రాతిపదికన గ్రూపులుగా ఏర్పాటు కావొచ్చు’ అంటూ పెట్టిన మెలికను జిన్నా తనకు అనుకూలంగా మలచుకొని... ఇబ్బందులు సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని కాంగ్రెస్‌ భావించింది. ఒకవైపు కేవలం మూడు రంగాలకే పరిమితమైన బలహీన కేంద్ర ప్రభుత్వం; మరోవైపు పక్కలో బల్లెంలా రాష్ట్రాలు గ్రూపులు కట్టే వెసులుబాటుతో... స్వాతంత్య్రానంతరం రోజూ తలనొప్పి ఖాయమనే నిర్ణయానికి వచ్చింది. అందుకే... అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలనుకుంది. అసలైన రాజ్యాంగానికి ముందే తయారయ్యే ఇలాంటి నిబంధనల ఆధారంగా పనిచేయటం ఏ దేశానికీ సాధ్యంకాదని జవహర్‌లాల్‌ నెహ్రూ తేల్చిచెప్పారు. కేబినెట్‌ మిషన్‌ ప్రణాళికలలో కొన్ని మార్పులు అవసరమవుతాయంటూ ప్రకటించారు. దీంతో అసహనం వ్యక్తంజేసిన ముస్లింలీగ్‌ నేత జిన్నా... మిషన్‌ ప్రణాళికకు తమ ఆమోదాన్ని వాపస్‌ తీసుకున్నారు. పాకిస్థాన్‌ ఏర్పాటే కావాలంటూ డిమాండ్‌ చేశారు. అలా... కేబినెట్‌ మిషన్‌ విఫలమైంది. ఐక్య భారత్‌ తప్పిపోయింది. ఇక డైరెక్ట్‌ యాక్షన్‌ అంటూ జిన్నా పిలుపునివ్వడంతో మతకలహాలు చెలరేగాయి. ముఖ్యంగా బెంగాల్‌లో వేలమంది మరణించారు. 1947 జనవరి 6న కాంగ్రెస్‌ కమిటీ దేశ విభజనను అంగీకరిస్తూ తీర్మానం చేసింది.

రాష్ట్రాలు గ్రూపులుగా..

కేబినెట్‌ మిషన్‌లో భాగంగా మూడంచెల భారత్‌ను ఆవిష్కరించారు.

1. కేంద్రం 2. రాష్ట్రాలు 3. రాష్ట్రాల సమూహాలు!

  • కేంద్ర ప్రభుత్వం కేవలం రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్‌ రంగాలను మాత్రమే చూసుకుంటుంది. మిగిలిన అన్ని అంశాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి.
  • కేంద్ర ప్రభుత్వం చేతిలోని అంశాలు తప్ప మిగిలిన అన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఉంటుంది.
  • కావాలనుకుంటే కొన్ని రాష్ట్రాలు కలిపి... ఒక సమూహంగా (గ్రూపు) ఏర్పడవచ్చు. పదేళ్ల తర్వాత ఏ రాష్ట్రమైనా, లేక సమూహమైనా రాజ్యాంగంలో మార్పులను డిమాండ్‌ చేయవచ్చు.
  • రాష్ట్రాలను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించారు ఎ-లో హిందువులు అధికంగా ఉన్న రాష్ట్రాలు. బి-లో ముస్లింలు మెజార్టీగా గల పంజాబ్‌, సింధ్‌, వాయువ్య ప్రాంతాలు, బలూచిస్థాన్‌. ఇక సి-లో ముస్లిం మెజార్టీ బెంగాల్‌, హిందూ మెజార్టీ అస్సాంను చేర్చారు.

ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: రతన్‌జీకి ప్రవేశం లేదంటే.. 'తాజ్‌' పుట్టింది!

ABOUT THE AUTHOR

...view details