తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2021, 6:54 AM IST

ETV Bharat / bharat

భారతీయతను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు

ఆయన సత్యాగ్రహాలు చేయలేదు.. జైళ్లకు వెళ్లలేదు ఆచార్యుడిగా పరోక్ష సమరం చేశారు. భారతీయాత్మను ప్రపంచానికి తెలుపుతూ భారతీయులపై, హిందూయిజంపై అపోహలను తొలగిస్తూ తూర్పు పశ్చిమాలకు వారధి నిర్మించారు! అందుకే ఆయనకు ఆక్స్‌ఫర్డ్‌ ఆచార్య పీఠం వేసింది! బ్రిటన్‌ సర్‌ బిరుదిచ్చింది.. కఠిన స్టాలిన్‌ కూడా కరిగిపోయాడు. ఆయనే మన సర్వేపల్లి రాధాకృష్ణన్​.

azadi ka amrit mahotsav
సర్వేపల్లి రాధాకృష్ణన్​ బయోగ్రఫీ

స్వాతంత్య్రానికి ముందే కాదు... అనంతరం కూడా భారతీయ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిచెప్పిన తత్వవేత్త, అసాధారణ ప్రజ్ఞాశాలి... మన తెలుగుతేజం సర్వేపల్లి రాధాకృష్ణన్‌! 1888 సెప్టెంబరు 5న చిత్తూరు జిల్లాలోని తిరుత్తణిలో తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. తిరుపతి, వెల్లూరు, మద్రాసు మిషనరీ స్కూళ్లు, కాలేజీల్లో చదవటంతో పాశ్చాత్య తత్వశాస్త్రం పరిచయమైంది. అదే ఆయన ప్రధాన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు.

అపోహలను తొలగిస్తూ..

1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తత్వశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. పాశ్చాత్య తత్వాన్ని ఆకళింపు చేసుకున్న ఆయనకు భారతీయ తత్వశాస్త్రంపై పాశ్చాత్యులకున్న చిన్నచూపు అర్థమైంది. దీంతో... ఉపనిషత్తులు, వేదాంతం, భగవద్గీతలను శోధించి, మధించిన రాధాకృష్ణ- వారి కళ్లు తెరిపించటం ఆరంభించారు. పాశ్చాత్యుల అపోహలను తొలగిస్తూ అంతర్జాతీయ జర్నల్స్‌లో సార్వజనీన, బహుళత్వ, వసుధైక కుటుంబ హిందూ, భారతీయ భావనలను వివరించారు. ఫలితంగా 1936లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆయనకు ఆచార్య పదవినిస్తూ ఆహ్వానించింది. "తూర్పు ఆధ్యాత్మికతకు.. పాశ్చాత్య హేతువాదానికి మధ్య అరుదైన సాంస్కృతిక వారధిని నిర్మించిన మహనీయుడు రాధాకృష్ణన్‌" అంటూ న్యూయార్క్‌టైమ్స్‌ ప్రశంసించిందంటే ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని భారతీయుల ఆత్మపోరాటంగా రాధాకృష్ణన్‌ ప్రపంచానికి అర్థం చేయించారు. బ్రిటిష్‌ వారు వచ్చేదాకా నాగరికత లేదనుకున్న భారతీయత లోతెంతో అందరికీ తెలిసేలాచేశారు. తన పంచెకట్టు, కోటు, తలపాగాతోపాటు తత్వజ్ఞానంతో దేశాధినేతలందరినీ ఆకర్షించేవారు.

కదిలిపోయిన స్టాలిన్‌

రాధాకృష్ణన్‌లోని తాత్వికతతో పాటు దౌత్యనీతిని గుర్తించిన నెహ్రూ ఆ దిశగా వినియోగించారు. స్వాతంత్య్రానంతరం సోవియట్‌ యూనియన్‌లో దౌత్యవేత్తగా నియమితులైన రాధాకృష్ణన్‌ అక్కడా తనదైన ముద్రవేశారు. విదేశీ రాయబారులెవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సోవియట్‌ నియంత స్టాలిన్‌ ఈయనతో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. తిరిగి వచ్చేటప్పుడు స్టాలిన్‌ను కలిసి ఆయన భుజం తట్టి... ఆయుష్మాన్‌ భవ అంటూ దీవించారు. కదిలిపోయిన స్టాలిన్‌ "జీవితంలో నన్ను నరరూప రాక్షసుడిగా కాకుండా మనిషిగా చూసింది మీరొక్కరే. మీరు వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది" అంటూ రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు.

1931 నుంచి 36 దాకా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వ్యవహరించిన రాధాకృష్ణన్‌ స్నాతకోత్సవంలో "మన తెలుగు వాళ్లందరికీ దయాగుణం, సామాజిక సర్దుబాటు ఎక్కువ. మాతృభాష తెలుగు మనందరినీ కలిపి ఉంచుతుంది" అంటూ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవులు చేపట్టిన ఈ నిగర్వి 1975లో కన్నుమూశారు. అంతకుముందు సెప్టెంబరు 5న విద్యార్థులు వచ్చి తన జన్మదిన వేడుకలు జరుపుతామంటే.. "నా కోసం కాదు. గురువుల కోసం ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని" కోరుకున్న గుగ్గురువు రాధాకృష్ణన్‌!

తరగతి గది ఓ ప్రసూతిగది
జ్ఞానానికి జన్మనిచ్చేందుకు!
తరగతి గది ఓ స్మశాన వాటిక
అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు!
తరగతి గది ఓ కర్మాగారం
జాతి భవితను నిర్మించేందుకు!
తరగతి గది ఓ న్యాయస్థానం
సరైన నిర్ణయాలు తీసుకునేందుకు!

- సర్వేపల్లి రాధాకృష్ణన్‌

ఇదీ చదవండి:జలియన్​ వాలాబాగ్​.. స్వాతంత్ర్యోద్యమంలో కీలక మలుపు

Dadabhai Naoroji: స్వరాజ్య కాంక్ష విత్తనం నాటిన తొలి నాయకుడు

ABOUT THE AUTHOR

...view details