ఝార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లా ఉలీహాతు గ్రామంలో 1875 నవంబరు 15న సుగుణా ముండా, కర్మిహాటు ఆదివాసీ దంపతులకు బిర్సా ముండా జన్మించారు. చిన్నతనంలో గొర్రెలు మేపుతూ కుటుంబానికి అండగా నిలిచిన బిర్సా.. తర్వాత సాల్గా గ్రామంలో మేనమామ వద్ద ఉంటూ ప్రాథమిక విద్య పూర్తిచేశారు. అనంతరం చాయిబసాలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇందుకోసం క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. బిర్సా ముండా పేరు 'బిర్సా డేవిడ్'గా మారింది. అందులో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వేసేవారు. చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. క్రైస్తవంలోకి మారితే పన్నులను మాఫీ చేస్తామని, భూములను తిరిగిచ్చి, హక్కులను కల్పిస్తామని మభ్యపెట్టేవారు. వారి ప్రలోభాలతో అప్పట్లో 6 లక్షల మంది గిరిజనులు క్రైస్తవం పుచ్చుకున్నారు. బ్రిటిషర్లకు ఎదురుతిరిగి, వారు పెట్టే బాధలు పడలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటల్లోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా.. తెల్లదొరలపై ఒత్తిడి చేశారు. దాంతో మిషనరీ పాఠశాల ఆయన్ను బహిష్కరించింది. దీన్ని సవాల్‌గా తీసుకున్న బిర్సా.. వారి ఎదుటే నుదుట నామం పెట్టి, జంధ్యం ధరించారు. ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తానని ప్రతినబూనారు.
ఆదివాసీలకు ప్రత్యేక మతం:తెల్లవారిని తరిమికొట్టాలనే లక్ష్యంతో.. డొంబరీ పర్వత ప్రాంతంలో 1894 అక్టోబరు 1న బిర్సా ప్రత్యేక సైన్యాన్ని తయారు చేశారు. ఆదివాసీల్లో చైతన్యం నింపేందుకు తరచూ సమావేశాలు నిర్వహించారు. దీంతో రగిలిపోయిన తెల్లదొరలు 1895 ఆగస్టులో ఆయన్ను అరెస్టు చేసి హజారీబాగ్ జైలులో బంధించారు. ఆయన శిష్యులు, ఆదివాసీలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించగా 1897 నవంబరులో విడుదల చేశారు. బ్రిటిషర్లతో ముండా, సంతాల్, ఒరియాన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశముందని భావించిన బిర్సా.. ప్రత్యేకంగా బిర్సాయిత్ మతాన్ని స్థాపించారు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేసేవారు. ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసీలను కాపాడారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను ‘ధర్తీ ఆబా’(దేవుడు)గా కొలిచేవారు.