రాజస్థాన్‌లోని బీకానేర్‌లో 1793లో వ్యాపార కుటుంబంలో జన్మించారు అమర్ చంద్. కొన్నాళ్లకు వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆయన కుటుంబం గ్వాలియర్‌కు వచ్చి స్థిరపడింది. గ్వాలియర్ మహారాజు వీరికి ఆశ్రయం ఇచ్చి వ్యాపారానికి సాయం చేశారు. ఆ సమయానికే ఈస్టిండియా కంపెనీ పాలనపై భారతీయుల్లో అసహనం పెరుగుతోంది. అమర్‌చంద్ స్నేహితులు కూడా ఆంగ్లేయులపై పోరాటంలోకి దిగారు. కొంతమంది సాయుధమార్గం ఎంచుకున్నారు. అమర్‌చంద్‌ను కూడా ఆహ్వానించారు. కానీ వారి ఆవేశానికి తాను లొంగలేదు. సమయం వచ్చినప్పుడు పోరాటం చేస్తాలే అంటూ వాయిదా వేశారాయన. ఈ లోపు వ్యాపారంలో అమర్‌చంద్ పనితీరు చూసిన గ్వాలియర్ మహారాజా జయాజీరావు సింధియా తన సంస్థానంలో కొలువిచ్చారు. కొద్దికాలానికే ఆయనకు నమ్మినబంటయ్యాడు అమర్‌చంద్. ఆయన నిబద్ధత, నిజాయతీ, మంచితనంపై మహారాజుకు గురి కుదిరి... ఏకంగా తన సంస్థాన కోశాధికారిగా నియమించారు. ఆ కాలంలో గ్వాలియర్ కోశాధికారి అంటే మాటలు కాదు. కారణం- గ్వాలియర్ కోటలో రహస్య అరల్లో చాలా సొమ్ము దాచి ఉంచేవారంటారు. ఆ గుప్త నిధుల సమాచారం మహారాజుతో పాటు అత్యంత విశ్వాసపాత్రులైన ఒకరిద్దరికే తెలిసేది.
అలా గ్వాలియర్ సంస్థానంలో కీలక పదవిలో కొనసాగుతున్న దశలో తన స్నేహితులకు చిన్నప్పుడు మాటిచ్చిన 'సమయం' అనుకోకుండా అమర్‌చంద్ ముందుకొచ్చింది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఆంగ్లేయులపై తిరుగుబాటు మొదలెట్టిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి.. బ్రిటిష్‌కు మద్దతిస్తున్న సంస్థానాలపై కూడా దాడి చేశారు. ఆ క్రమంలో ఆమె గ్వాలియర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భయపడ్డ మహారాజు జయాజీరావు కొద్దిరోజులు పారిపోయారు. గ్వాలియర్ కోట ఝాన్సీ సేనల వశమైంది. నిజానికి ఆ సమయానికి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యం పరిస్థితి ఏమీ బాగోలేదు. చాలారోజులుగా సైనికులకు వేతనాల్లేవు. సరుకులూ నిండుకున్నాయి. ఆంగ్లేయులు ఆమెను, ఆమె సైన్యాన్ని నిర్వీర్యం చేయటం కోసం తనకందుతున్న సాయాన్ని అన్నివైపుల నుంచీ నరుక్కుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్వాలియర్ కోశాధికారి అమర్‌చంద్ అనూహ్యంగా ముందుకొచ్చారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నీరుగారొద్దనే భావనతో... గ్వాలియర్ మహారాజు తన చేతుల్లో పెట్టిన ఒక గుప్త నిధి అరను రాణి లక్ష్మీబాయికి అప్పగించారు. అలా స్వాతంత్య్ర సమరంలో తనవంతు పాత్ర పోషించారు. ఆ నిధుల కారణంగా మరికొంతకాలం లక్ష్మీబాయి సైన్యం తన పోరాటాన్ని కొనసాగించగలిగింది. ఇది ఆంగ్లేయులకు అంతుబట్టలేదు. అయితే ఎలాగోలా ఆమెను మట్టుబెట్టిన వెంటనే బ్రిటిషర్లు గ్వాలియర్‌లో ఏం జరిగిందనే దానిపై అన్వేషించి... అమర్‌చంద్‌ను పట్టుకున్నారు. ఝాన్సీ రాణి చనిపోయిన నాలుగు రోజులకే... ఆయన్ను రాజద్రోహం కింద విచారించి మరణశిక్ష విధించారు. ఇకమీదట ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎవరైనా సమర యోధులకు సాయం చెయ్యాలంటే భయపడేలా గ్వాలియర్‌లోని నడివీధిలో అమర్‌చంద్‌ను చెట్టుకు ఉరితీసి... మూడురోజులపాటు వేలాడదీశారు. గ్వాలియర్‌లోని బులియన్ మార్కెట్‌లోని అదే చెట్టుకింద ఆయన స్మారక విగ్రహం ఉంది.