Azadi ka amrit mahotsav: బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో మరే దేశానికీ వెళ్లనంత మంది తెల్లవారు భారత్‌కు వచ్చారు. బ్రిటన్ ముఖ్యంగా ఐరోపా నుంచి ఇండియాకు వలసలను ప్రోత్సహించింది. భారత్‌లో 1857లో ప్రథమ స్వాతంత్య్ర పోరాటానికి దారితీసిన పరిస్థితులు కూడా ఇందుకు దోహదం చేశాయి. సిపాయిల తిరుగుబాటుతో కంగుతిన్న ఆంగ్లేయులు సైన్యంలో తమ వారి సంఖ్యను పెంచాలనుకున్నారు. ఏకంగా 50 వేల మంది తెల్లవారితో ఆంగ్లేయ సైన్యాన్ని బలోపేతం చేశారు. తద్వారా భారత సైన్యంలో శ్వేతజాతీయుల సంఖ్య భారతీయ సిపాయిల కంటే పెరిగింది. ఏకంగా 2.20 లక్షల మందికి చేరింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి పరిపాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న బిట్రిష్ సర్కారు... తమ వాణిజ్య అవసరాల కోసం భారత్‌లో రైల్వే, ఇతరత్రా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసింది. అదే సమయంలో బ్రిటన్, ఐర్లాండ్‌లాంటి చోట్ల దుర్భిక్ష పరిస్థితులతో నిరుద్యోగ సమస్య తలెత్తింది. దీంతో యూరప్ నుంచి నిపుణులతోపాటు అనేక మందిని భారత్‌కు తరలించారు. ఇలా వచ్చిన వారిలో నేరగాళ్లు, నిరుపేదలు, దేశదిమ్మరులు, వ్యభిచారులు వేల మంది ఉన్నారు. కొందరిని సైన్యంలో, ఇతరత్రా పనుల్లో, గుర్రపుశాలల్లో పనికి కుదిర్చారు.
ఈస్టిండియా సైనికులకు షాక్:పనిరాని, చేయని వారంతా కొద్దికాలంలోనే ఆంగ్లేయ సర్కారుకు భారమై భారత్‌లో రోడ్లపై పడ్డారు. ఇది చాలదన్నట్లు బ్రిటిష్ సర్కారుకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. 1857 దాకా కొనసాగిన ఈస్టిండియా సైన్యాన్ని తమ సొంత సైన్యంలో విలీనం చేసే క్రమంలో వేలమంది యూరోపియన్లను తొలగించారు. ఎలాంటి పింఛన్, మరే జీవనోపాధి లేక వారంతా రోడ్డున పడ్డారు. ఇలా వారంతా భారత్‌లో రోడ్లపై దేశదిమ్మరులుగా తిరుగుతూ, బిచ్చమెత్తుకోవడం ప్రారంభించారు.