ఒకవంక ప్రపంచమంతా పారిశ్రామికీకరణతో దూసుకుపోతుంటే భారత్ మాత్రం బ్రిటన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, అభివృద్ధిలో నానాటికీ వెనక్కి వెళుతున్న దశ అది. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి.. ఇక్కడ ఈస్టిండియా కంపెనీ దమనకాండ తోడవటంతో.. భారత్‌లో నేత, వస్త్ర పరిశ్రమ కుప్పకూలింది. అలాంటి సమయంలో బ్రిటన్‌ను ఢీ కొంటూ.. వస్త్రపరిశ్రమలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు జంషెడ్‌జీ నుసెర్‌వాంజీ టాటా!
సూరత్ దగ్గర్లోని నవ్‌సారిలో పార్సీ కుటుంబంలో 1839 మార్చి3న జన్మించిన జంషెడ్‌జీ 20వ ఏటనే తండ్రితో కలసి వ్యాపారంలోకి దిగారు. సిపాయిల తిరుగుబాటు ముగిసి.. భారత్‌పై బ్రిటన్ తన ఉక్కుపిడికిలి బిగించిన తరుణమది. 1868లో 29వ ఏట.. సొంతంగా రూ. 21వేల పెట్టుబడితో కంపెనీ ఆరంభించారాయన. అదే టాటా సన్స్ కంపెనీకి ఆరంభం! ముంబయిలో మూతపడ్డ ఓ చమురు కంపెనీని తీసుకొని కాటన్‌మిల్లుగా మార్చి నడిపించారు. రెండేళ్లకు దాన్ని లాభాలకు అమ్మేశారు. ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వచ్చిన ఆయనకు పరిశ్రమల్లో బ్రిటన్ ఆధిపత్యాన్ని ఢీకొట్టే శక్తి భారత్‌కు ఉందని బలమైన నమ్మకం కుదిరింది. బ్రిటన్‌లోని లాంకషైర్ ఫ్యాక్టరీలను తట్టుకొని వస్త్రపరిశ్రమ పెట్టడమంటే మాటలు కాదప్పుడు! జంషెడ్‌జీ ఆ సవాలులోనే సఫలతను, భారత భవిష్యత్‌ను చూశారు.
వస్త్ర పరిశ్రమంటే.. ముంబయిలో ఆరంభించాల్సిందే. అది అప్పటి సంప్రదాయం. కానీ జంషెడ్‌జీ ఆ మూస ధోరణికి దూరంగా.. కొత్తగా ఆలోచించారు. పత్తిపండే ప్రాంతాలకు , రైల్వే జంక్షన్‌కు దగ్గరగా, నీరు, చమురుకు కొరతలేని ప్రాంతాన్ని చూశారు. ఇందుకు నాగ్‌పుర్ అన్నివిధాలుగా సరిపోవటంతో.. 1874లో రూ.1.5 లక్షల పెట్టుబడితో ఎంప్రెస్ మిల్లును ఆరంభించారు. భారత్‌లో విక్టోరియారాణి పాలన మొదలైన రోజే ఈ కంపెనీ ఆరంభం కావటం గమనార్హం. అలా 37వ ఏట జంషెడ్‌జీ కలల సాధనకు తెరలేచింది. దీనికి తోడుగా.. ముంబయిలో స్వదేశీ మిల్లును కూడా ఆరంభించారు. విదేశాల్లో తన పర్యటనలను కేవలం సరదాలకు కాకుండా.. అధ్యయనానికి వినియోగించి.. అక్కడి వ్యాపార కిటుకులను, ఆధునిక సాంకేతికతను భారత్‌కు తీసుకొచ్చేవారాయన. ఫలితంగా.. అచిరకాలంలోనే ప్రపంచమార్కెట్‌లో నాణ్యతలో లాంకషైర్‌కు పోటీగా నిలిచాయి టాటా ఉత్పత్తులు!