తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: టీకా కోసం కన్నబిడ్డను పణంగా పెట్టి.. - భారత్​లో బ్రిటిష్​ పాలన

లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ప్లేగు వ్యాధికి టీకా తయారైనా.. తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాని దశలో ధైర్యంగా ముందుకొచ్చారు స్వతంత్ర సమరయోధుడు అబ్బాస్‌ త్యాబ్జి. తన కూతురు షరీఫాపై టీకాను పరీక్షించి చూడాలంటూ తీసుకొచ్చారు. తద్వారా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి, వారిలో స్ఫూర్తినింపటానికి యత్నించారు.

Azadi Ka Amrit Mahotsav
అబ్బాస్‌ త్యాబ్జి

By

Published : Sep 24, 2021, 8:24 AM IST

ఇప్పుడు కొవిడ్‌ మహమ్మారిలా 1896లో ప్లేగు వ్యాధి ముంబయిని అతలాకుతలం చేసింది. చుట్టుపక్కల ప్రాంతాలకూ పాకింది. లక్షల సంఖ్యలో ప్రజలు మరణించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసింది. ఉక్రేనియన్‌ బ్యాక్టీరియాలజిస్టు డాక్టర్‌ వాల్డెమర్‌ హఫ్‌కిన్‌ సారథ్యంలో ప్లేగు పరిశోధన కమిటీ కష్టపడి టీకా తయారు చేసింది. బలహీనమైన బ్యాక్టీరియాను వ్యాధిబారిన పడని వారి శరీరంలోకి ఎక్కించటం ద్వారా యాంటీబాడీలు తయారై రోగనిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించారు. టీకా అయితే తయారైంది కాని పరీక్షించి చూద్దామనుకుంటే వేసుకునేవారు లేకపోయారు. ముంబయిలో ఎవ్వరూ టీకా తీసుకోవటానికి ముందుకు రాలేదు. విదేశీ మందును నమ్మకపోవటం ఒకటైతే... బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మరో కారణం. బ్రిటిష్‌ వారు ప్రజల ప్రాణాలు తీయటానికి ఈ టీకా రూపంలో ప్రయత్నిస్తున్నారనే వదంతులూ వ్యాపించాయి. దీంతో అంతా టీకా పరీక్షలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్‌ ముందుకొచ్చి... తమ రాష్ట్రంలో పరీక్షించాల్సిందిగా ఆహ్వానించారు. అయితే అక్కడా ప్రజల నుంచి సానుకూలత ఏమీ లభించలేదు. టీకా వేసుకుంటే ఏమౌతుందోననే భయం అందరిలోనూ వ్యక్తమైంది.

ఈ దశలో ధైర్యంగా ముందుకొచ్చారు అబ్బాస్‌ త్యాబ్జి! ఆ సమయంలో బరోడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు షరీఫాపై టీకాలను పరీక్షించి చూడాలంటూ తీసుకొచ్చారు. తద్వారా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి, వారిలో స్ఫూర్తినింపటానికి యత్నించారు. టీకా తీసుకున్న షరీఫా (ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తల్లి) ఆరోగ్యకరంగానే ఉండటంతో... ప్రజల్లోనూ నమ్మకం కలిగింది. బరోడాలోని పల్లెటూర్లకు కూడా వెళ్లి టీకాలిచ్చి పరీక్షించింది హఫ్‌కిన్‌ బృందం. వారి పరీక్షలు ఫలించి... టీకా వల్ల మరణాలు 97శాతం తగ్గాయి.

కుమార్తె షరీఫాతో అబ్బాస్‌ త్యాబ్జి

బ్రిటన్‌కు మద్దతుదారు నుంచి...

అంతా భయపడుతున్న వేళ, ఏమౌతుందో తెలియని సందిగ్ధ సమయంలో తన కూతురును పణంగా పెట్టిన త్యాబ్జి వెనక ఆసక్తికరమైన కథే ఉంది. గుజరాత్‌లోని సంపన్న బోహ్రా ముస్లిం కుటుంబంలో జన్మించిన త్యాబ్జి ఇంగ్లండ్‌లో చదువుకొని వచ్చి బరోడా రాష్ట్రంలో న్యాయమూర్తిగా చేరి, ప్రధాన న్యాయమూర్తిగా రిటైరయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. తన పిల్లల్ని కూడా విదేశాల్లో చదివించారు. కానీ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ ఆయన్ను పూర్తిగా మార్చేసింది. అప్పటిదాకా బ్రిటిష్‌పద్ధతులను, దుస్తులను ధరించిన ఆయన పూర్తి స్వదేశీగా మారిపోయారు. తమ ఇంట్లోని అత్యంత ఖరీదైన విదేశీ వస్తువులన్నింటినీ తగలబెట్టారు. ఖాదీలోకి మారిపోయారు. బంగళాలు విడిచి గాంధీ వెంట ఆశ్రమాలు, ధర్మశాలల్లో నివసించటం మొదలెట్టారు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో గాంధీజీ వెంట నడిచారు. తనను అరెస్టు చేస్తే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను త్యాబ్జికే అప్పగించారు గాంధీజీ. అప్పటికి త్యాబ్జి వయసు 76 సంవత్సరాలు! అయినా అలుపెరగని యోధుడిలా గాంధీజీ వెంట నిలిచిన త్యాబ్జీ అనుకున్నట్లే మహాత్ముడి అరెస్టు తర్వాత ఉప్పుసత్యాగ్రహానికి సారథ్యం వహించారు. 1936లో మసోరీలో మరణించారు.

'75ఏళ్ల వయసు పైబడ్డా ఇంత ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్న త్యాబ్జి దరిద్రనారాయణులలో దేవుడిని చూసిన గొప్ప మానవతావాది.'

- గాంధీజీ

ABOUT THE AUTHOR

...view details