Gazulu Lakshminarasu Chetty: గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాసులో 1806లో ధనిక కుటుంబంలో జన్మించారు. తండ్రి సిద్ధులు శెట్టి వస్త్ర వ్యాపారి. వసతులు లేని కారణంగా ఉన్నత విద్యను చదవలేకపోయిన లక్ష్మీనరసు... చిన్నప్పటి నుంచే రాజకీయ చర్చల్లో చురుకుగా పాల్గొనేవారు. చదువు పూర్తవగానే వ్యాపారంలోకి అడుగుపెట్టి, తండ్రి తదనంతరం అంతా చూసుకున్నారు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో పత్తి అమ్మకాల ద్వారా బాగా సంపాదించారు. ఆ తర్వాత దేశసేవకు తన సమయాన్ని వెచ్చించారు.
మత మార్పిడులపై తీవ్ర వ్యతిరేకత:ఆంగ్లం చదువుకున్న వారికే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని అప్పట్లో మద్రాస్ గవర్నర్ ప్రకటించడంతో హిందువులు తమ పిల్లలను మిషనరీ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. ఆ విద్యార్థులను క్రైస్తవంలోకి మారుస్తుండటంతో లక్ష్మీనరసు గవర్నరుకు అర్జీలు ఇచ్చి, కోర్టులో కేసులు వేశారు. క్రైస్తవంలోకి మారిన పిల్లలకు హిందూ తల్లిదండ్రుల ఆస్తులపై సమాన హక్కులు ఉంటాయన్న ఇండియన్ లా కమిషన్(1845) ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ప్రజలను కూడదీసి ఒత్తిడి తేవడంతో గవర్నర్ దిగొచ్చారు. మద్రాసు యూనివర్సిటీ పాఠశాలలో బైబిల్‌ను పాఠ్యపుస్తకంగా ప్రవేశపెట్టడానికి 1846, 1853 సంవత్సరాల్లో గవర్నర్ చేసిన ప్రయత్నాలను లక్ష్మీనరసు విజయవంతంగా అడ్డుకున్నారు.
కంపెనీ దురాగతాలపై వేధింపుల కమిటీ:శిస్తులు చెల్లించలేని రైతులను కంపెనీ అధికారులు పెడుతున్న చిత్రహింసలను చూపడానికి లక్ష్మీనరసు అర్జీలు పెట్టి... ఆంగ్లేయ ఎంపీ డెన్సీ సేమర్‌ను భారత్‌కు రప్పించారు. ఆయన్ని గ్రామాల్లో తిప్పారు. రైతుల బాధలను చూసి చలించిన ఆ ఎంపీ... "మిట్ట మధ్యాహ్నం వంగోబెట్టి రైతుల వీపులపై బండలు పెట్టడం, చేతివేళ్ల గోళ్లలో సూదులు గుచ్చడం, మోకాలి మడతల్లో కంకరరాళ్లు పెట్ట్టి నొక్కడం, కొరడాలతో కొట్టడం, గాడిదల తోకలకు రైతుల జుట్టును ముడేసి బజార్లలో ఈడ్చడం వంటి అత్యంత అమానవీయ చర్యలు జరుగుతున్నాయి" అని 1854లో బ్రిటన్ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దురాగతాలపై వెంటనే విచారణ జరపాలని పార్లమెంటు 'వేధింపుల కమిటీ'ని వేసింది. లండన్ నుంచి మద్రాసుకు వచ్చిన కమిటీ సభ్యులు కంపెనీ దుశ్చర్యలను గుర్తించారు. ఆర్థిక, వ్యవసాయ, విద్య, మత సంబంధ విషయాల్లో భారతీయుల మీద జరుగుతున్న దాడిపై పోరాడటానికి లక్ష్మీనరసు 1844లో క్రిసెంట్ అనే పత్రికను స్థాపించారు.