తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఆఖరి పోటు.. నావికుల తిరుగుబాటు

భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలనగానే... ప్రథమ సంగ్రామం నుంచి క్విట్‌ ఇండియా ఉద్యమం దాకా చాలా గుర్తుకొస్తాయి. ఇవన్నీ భారతావని బానిస శృంఖలాలను తెంచటానికి పడ్డ సమ్మెట పోటులే. ఈ దెబ్బలన్నింటిని వృథా కానీకుండా.. తెల్లవాడు తెల్లబోయేలా... భారత్‌ను వీడి వెళ్లటం అనివార్యం చేసేలా... పడ్డ ఆఖరి సమ్మెట పోటు... భారత నావికుల తిరుగుబాటు.

Azadi Ka Amrit Mahotsav
ఆఖరి పోటు.. నావికుల తిరుగుబాటు

By

Published : Feb 18, 2022, 6:53 AM IST

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న క్లెమెంట్‌ అట్లీ... 1956లో భారత్‌ వచ్చారు. క్విట్‌ ఇండియాలాంటి బలమైన ఉద్యమం లేకున్నా... 1947లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఎందుకని భారత్‌ను వీడి వెళ్లాలనుకుందని ఆయన్ను అడిగితే... 'రెండు ప్రధాన కారణాలు- 1. నావికుల తిరుగుబాటు. 2. బోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రభావం' అని చెప్పారు అట్లీ! అలా భారత్‌ నుంచి ఆంగ్లేయుల నిష్క్రమణ వేగవంతం కావటానికి దోహదపడింది నావికుల తిరుగుబాటు. నౌకాదళం (రాయల్‌ ఇండియన్‌ నేవీ-ఆర్‌ఐఎన్‌)లో పనిచేస్తున్న 20 మంది యువ రేటింగ్స్‌ (దిగువ స్థాయి నావికులు) ఈ తిరుగుబాటుకు సూత్రధారులు, పాత్రధారులు. 17-24 ఏళ్ల మధ్య వయసున్న కుర్రాళ్ల సారథ్యంలోని తిరుగుబాటు వారంరోజులే నడిచినా.. 200 ఏళ్లపాటు పాలించిన ఆంగ్లేయుల గుండెల్లో గుబులు రేపింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా కుదేలైన బ్రిటన్‌.. నౌకాదళంలోని చాలా మంది భారతీయులకు ఉద్వాసన పలకడం మొదలు పెట్టింది. అప్పటికే భారతీయ రేటింగ్స్‌కు ఆంగ్లేయులతో పోలిస్తే తక్కువ వేతనాలిచ్చేవారు. వసతులు దారుణం. వివక్ష ఇక సరేసరి. తినటానికి కాలీకాలని రొట్టెలు పెట్టేవారు. పప్పుతో నిండిన ఒక చెక్క పాత్ర చుట్టూ కూర్చొని వీరు భుజించాల్సి వచ్చేది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉన్న నేపథ్యంలో 1946 ఫిబ్రవరి 17న మంచి భోజనం పెట్టాలంటూ... హెచ్‌ఎంఐఎస్‌ తల్వార్‌ యుద్ధనౌకలో నావికులు డిమాండ్‌ చేశారు. 'బిచ్చగాళ్లు పెట్టింది తినాలే తప్ప కోరుకోకూడదు' అంటూ ఆంగ్లేయ అధికారులు హేళన చేశారు. దీంతో పరిస్థితి దిగజారింది.

18న ఉదయం... చంద్రదత్‌, ఎం.ఎస్‌.ఖాన్‌, మదన్‌ సింగ్‌ల నాయకత్వంలో 1500 మంది నావికులు ఎదురు తిరిగారు. వైర్‌లెస్‌ వ్యవస్థ ద్వారా పరిస్థితిని ఇతర యుద్ధనౌకలకు చేరవేశారు. తిరుగుబాటు కార్చిచ్చులా భారత సరిహద్దుల్లోని బ్రిటిష్‌ రాయల్‌ నేవీకి చెందిన 20 స్థావరాలు, 74 యుద్ధ నౌకలకు పాకింది. 20వేల మంది భారతీయ నావికులు ఉద్యమంలోకి దిగారు. యుద్ధనౌకలపై ఉన్న బ్రిటన్‌ జెండాను దించేసి కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌, కమ్యూనిస్టు పార్టీ పతాకాలను ఎగురవేశారు. భారత రాజకీయ ఖైదీలను, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఖైదీలను విడుదల చేయాలని, ఆంగ్లేయులు భారత్‌ను వీడి వెళ్లాలని నావికులు డిమాండ్‌ చేశారు. 48 గంటల్లో బ్రిటిష్‌ సర్కారు తన నౌకాదళంపై పట్టు కోల్పోయింది.

ఒకవైపు స్వాతంత్య్రం ఇవ్వటానికి బ్రిటన్‌ సంకేతాలు పంపిస్తున్న వేళ ... అనుకోకుండా తలెత్తిన ఈ ఉద్యమం పరిస్థితిని దిగజారుస్తుందేమోనని కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లు భావించాయి. అందుకే ఈ తిరుగుబాటుకు మద్దతివ్వలేదు. ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నావికుల వెనకాల నిలిచింది. జాతీయ కాంగ్రెస్‌ నేతల సూచనలు, రాయబారంతో ఎట్టకేలకు ఫిబ్రవరి 23న భారతీయ నావికులు సమ్మె విరమించి, లొంగిపోయారు. వారం రోజులే సాగి... డిమాండ్ల సాధనలో విఫలమైనా... భారత్‌లో ఇక తమ ఆటలు సాగవని... గతంలో మాదిరిగా భారతీయ సైనికులు ఇకపై మాట వినరని... మూటాముల్లె సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని ఆంగ్లేయులకు 'జ్ఞానోదయం' కలిగించటంలో ఈ తిరుగుబాటు విజయవంతమైంది.

ప్రజలు ఈదుతూ వచ్చి..

ఫిబ్రవరి 21న బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయ సైనికులనే తిరుగుబాటు చేసిన నావికులపై దాడికి దించింది. కానీ తుపాకులు ఎక్కుపెట్టడానికి వారు నిరాకరించారు. దీంతో యుద్ధనౌకల్లోని భారతీయ నావికులకు ఆహారం అందకుండా బ్రిటిష్‌ సర్కారు ప్రయత్నించింది. ధారావిలోని మురికివాడల్లో ఉన్న మత్స్యకారులు, ఇతరులు.. ప్లాస్టిక్‌ సంచుల్లో ఆహారాన్ని మూటగట్టుకొని ధైర్యంగా సముద్రంలో ఈదుకుంటూ.. వెళ్లి ఆందోళనకారులకు అందించారు. నావికుల ఉద్యమంలోకి సాధారణ పౌరులూ దిగారు. బాంబే, కలకత్తా, మద్రాస్‌లో తదితర నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన ప్రభుత్వం ఆంగ్లేయ సైనికులను దించి... నావికులపై కాల్పులు జరిపించింది. పోలీసు, సైనిక కాల్పుల్లో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 1500 మంది గాయపడ్డారు.

ఇదీ చూడండి:

హిజాబ్​పై కర్ణాటక సర్కార్​ మరో కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details