భారత్‌లో ఈస్టిండియా (British east India company) హయాం ముగిసి.. బ్రిటిష్ ప్రభుత్వ పాలన (British rule in India) మొదలైన సంవత్సరం 1858లో... ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న మైమెన్‌సింహ్ అనే ఊర్లో నవంబరు 30న జన్మించారు బోస్. ఆయన తండ్రి భగవాన్‌దాస్ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ స్థాయి ఉన్నతాధికారి. అయినా జాతీయోద్యమమన్నా(Azadi ka amrit mahotsav), తోటి భారతీయులన్నా సానుకూలంగా ఉండేవారు. స్థోమత ఉండి కూడా.. తన కుమారుడిని ఆంగ్లమాధ్యమ పాఠశాలలో కాకుండా బెంగాలీ బడిలో చేర్పించారు. తన కుమారుడు ఇంగ్లిష్‌కంటే ముందు మాతృభాష, భారతీయ సంస్కృతి నేర్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం.
తర్వాత ఉన్నత చదువులకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన బోస్‌కు అక్కడ అధ్యాపకుడి లాఫంట్ ప్రోత్సాహంతో సైన్స్ పట్ల ఆసక్తి పెరిగింది. 1879లో కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఏ పాసైన ఆయన ఉన్నతచదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్నారు. తండ్రి ఆర్థిక పరిస్థితి దెబ్బతినటంతో పునరాలోచనలో పడ్డా.. తల్లి తన నగలమ్మి ఆయన్ను ఓడ ఎక్కించారు. డాక్టర్‌గా తిరిగి రావాలని చెప్పి పంపించారు.
ఇంగ్లాండ్ వెళ్లాక తనకు వైద్యవృత్తి పడదని.. బోస్ సైన్స్‌నే ఎంచుకొని కేంబ్రిడ్జ్‌లో చేరారు. 1884లో కేంబ్రిడ్జ్ పట్టా పుచ్చుకొని భారత్‌కు వచ్చిన బోస్ కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు. ఆ కళాశాలలో ప్రొఫెసర్ పదవి చేపట్టిన తొలి భారతీయుడు ఆయనే. అయితే దీనికి వెనక పెద్ద కథే నడిచింది.
లండన్‌లో బోస్ ప్రతిభ గుర్తించిన బ్రిటన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రొఫెసర్ ఫాసెట్ భారత్‌లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్‌రిప్పన్‌కు లేఖ రాశారు. దాంతో ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంపీరియల్ ఎడ్యుకేషన్ సర్వీస్ కింద బోస్‌ను నియమిస్తామని రిప్పన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ బెంగాల్ విద్యాశాఖ డైరెక్టర్ అల్‌ఫ్రెడ్ క్రాఫ్ట్, కళాశాల ప్రిన్సిపల్ టానే ఇందుకు వ్యతిరేకించారు. కారణం - యూరోపియన్లను తప్ప భారతీయులను నేరుగా ఇంపీరియల్ సర్వీస్‌లోకి తీసుకునేవారు కాదు. ఎంత ప్రతిభావంతులైనా భారతీయులది(Azadi ka amrit mahotsav) యూరోపియన్ల స్థాయి కాదని వారిని రాష్ట్ర సర్వీసులోనే తీసుకునేవారు. అంతకుముందు ఇంగ్లాండ్ నుంచి పీహెచ్‌డీ డిగ్రీతో వచ్చిన పీసీ రాయ్‌ను కూడా అలాగే అవమానించారు. బోస్‌కూ అదే పదవిని ఇస్తామన్నారు. కానీ ఆయన ఈ వివక్షను వ్యతిరేకించారు. చేరేందుకు నిరాకరించారు. చివరకు రిప్పన్ ఒత్తిడితో బోస్‌ను ఇంపీరియల్ సర్వీసులో తీసుకోక తప్పింది కాదు. అప్పటికీ ప్రిన్సిపల్ వేతనం విషయంలో కొర్రీ పెట్టారు. సగం జీతానికి తాత్కాలిక ప్రాతిపదికన అంటూ మెలిక పెట్టారు. యూరోపియన్లతో పాటు తనకూ సమాన వేతనం ఇవ్వాలని బోస్ డిమాండ్ చేశారు. కానీ కళాశాల అంగీకరించలేదు. దీనికి నిరసనగా వేతనం తీసుకోకుండానే బోస్ పని చేశారు. ఆగ్రహంతో ఆయనేమైనా చేస్తే దాని ఆధారంగా.. పంపించి వేయాలని చూసిన కళాశాల యాజమాన్యానికి ఇది మింగుడు పడలేదు. ఒకటి కాదు రెండు కాదు.. మూడేళ్ల పాటు బోస్ అహింసా మార్గంలో తన నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆయన బోధన నాణ్యత, నిబద్ధత గుర్తించిన డైరెక్టర్, ప్రిన్సిపల్ దిగి వచ్చారు. ఆయన నియామకాన్ని శాశ్వతం చేశారు. మూడేళ్ల బకాయిల్ని పూర్తిగా చెల్లించారు. అలా బ్రిటిష్‌వారి వివక్షను తన సత్యాగ్రహంతో (Satyagraha andolan) తిప్పికొట్టారు జగదీశ్ చంద్రబోస్.
అనంతరం లండన్ వెళ్లిన ఆయన వైర్‌లెస్ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించినా.. ప్రజలకు అందుబాటులో ఉండాలని పేటెంట్ తీసుకోలేదు. అనంతరం.. మొక్కలూ మనలాగే ప్రాణులనీ.. వాటికీ ప్రేమ, ఆప్యాయత, బాధ, సంతోషం.. ఇవన్నీ అనుభవించే స్పందనలున్నాయని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచిపోయారు బోస్.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: ఝాన్సీ లక్ష్మీబాయి బాలుడేమయ్యాడు..?