Azadi ka amrit mahotsav: తొలుత రాజకీయాలకు దూరంగా ఉన్నా... గాంధీజీ ప్రభావంతో మనసు మార్చుకున్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రస్థానం అహ్మదాబాద్ మున్సిపాలిటీతో ఆరంభమైంది. 1845లో మున్సిపాలిటీలు మొదలయ్యాయి. లార్డ్ రిప్పన్ సంస్కరణలతో 1870 తర్వాత భారతీయులు స్వయం పాలన రుచిచూడటం మొదలెట్టారు. ప్రజల ద్వారా ఎన్నికైన భారతీయులే ఈ స్థానిక సంస్థలను నడిపించేవారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు/ఛైర్మనే సర్వం సహాధికారిగా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నీటిసరఫరా వంటి పట్టణ సదుపాయాలన్నీ చూసుకునేవారు. బ్రిటిష్ ప్రభుత్వం మెల్లగా వీటిలోనూ తలదూర్చింది. మున్సిపల్ చట్టాన్ని మార్చింది. ఐసీఎస్ అధికారులను వీటికి కమిషనర్లుగా నియమించింది. ఆ క్రమంలో అహ్మదాబాద్ మున్సిపాలిటీకి 1915లో వచ్చాడు ఐసీఎస్ అధికారి జె.ఎ.షిలిడి. ప్రజాప్రతినిధుల నిర్ణయాల్లో అడ్డుపుల్లలు; అవినీతితో పాటు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం మొదలెట్టాడు.
అలాంటి సమయంలో 1917లో... కార్పొరేటర్‌గా ఎన్నికైన పటేల్... పారిశుద్ధ్య కమిటీకి ఛైర్మన్ అయ్యారు. అప్పటికే ఆయన అహ్మదాబాద్‌లో పేరున్న, బాగా సంపాదిస్తున్న న్యాయవాది. అయినా పదవి వచ్చిందని పెత్తనం చేయలేదు. పొద్దున్నే పారిశుద్ధ్య కార్మికుల కంటే ముందే... రోడ్లపై చీపురు పట్టుకొని ఊడవటానికి సిద్ధంగా ఉండేవారు. వారితో కలసి పనిచేసేవారు. అంటరానితనం అధికంగా ఉన్న ఆ రోజుల్లో దళిత బస్తీలకు వెళ్లి శుభ్రం చేసి వచ్చేవారు. 1917లో అహ్మదాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో... అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంగ్లేయ అధికారులైతే కనిపించటమే మానేశారు. ఈ దశలో... పటేల్ బయటికొచ్చి... వాడల్లో తిరుగుతూ... బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యం నూరిపోశారు. మిత్రులు ఆయన్ని వారించారు. ‘‘పారిశుద్ధ్య కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని ఇంట్లో కూర్చుంటే ఫలితమేంటి?’’ అంటూ రేయింబవళ్లు వీధుల్లోనే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రోజుకో వాడ చొప్పున తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకునేవారు. ఆయన్ను చూసి... అనేక మంది యువకులు రంగంలోకి దిగారు. అలా ప్రజల్లో సేవాభావాన్ని రగిలించారు పటేల్! 'వీధుల్లోకి విసిరేయకుండా మున్సిపాలిటీ ఇచ్చే బుట్టల్లో చెత్త వేస్తే... మన పరిసరాలు శుభ్రంగా ఉండటమేగాదు... ఎక్కువకాలం బతకగలం' అంటూ అహ్మదాబాద్ వాసుల్లో ఆ కాలంలోనే స్వచ్ఛస్ఫూర్తిని నింపారు.