తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటు జైలు.. ఇటు శ్మశానం.. మధ్యలో సబర్మతి ఆశ్రమం - సబర్మతి ఆశ్రమం

Azadi Ka Amrit Mahotsav: కావల్సినంత స్థలం అందుబాటులో ఉంటే ఎవరైనా పోయిపోయి శ్మశానం పక్కన స్థలాన్ని ఎంచుకుంటారా? ఎవరి సంగతి ఏమోగాని గాంధీజీ ఆ పనే చేశారు. ఒకవైపు జైలు.. మరోవైపు శ్మశానం.. మధ్యలో ఆశ్రమాన్ని నిర్మించారు. సమరయోధులు చివరకు ఆ రెండింటిలో ఏదో ఒకదానికి వెళ్లాల్సిందేగదా.. అంటూ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఎంపికను సమర్థించుకున్నారాయన! చివరకు ఆ ఆశ్రమమే భారత స్వాతంత్య్ర సమరంలోని అనేక వ్యూహాలకు, నిర్ణయాలకు, ఘట్టాలకు వేదికైంది.

Sabarmati Ashram
Sabarmati Ashram

By

Published : Mar 7, 2022, 8:06 AM IST

Azadi Ka Amrit Mahotsav: 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన గాంధీజీ అక్కడి తరహాలోనే ఇక్కడా ఒక ఆశ్రమాన్ని నిర్మించాలనుకున్నారు. తన స్నేహితులు చాలామంది ఆర్థికంగా సాయం చేయటానికి ముందుకు రావటంతో ఇందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను ఆయన ఎంచుకున్నారు. హ్యాండ్‌లూమ్‌ నేతకు అహ్మదాబాద్‌ కేంద్రం. అక్కడ మళ్లీ చేనేతను కుటీర పరిశ్రమగా పునరుద్ధరించాలనుకున్నారాయన. వెంటనే ఆయన స్నేహితుడు జీవన్‌లాల్‌ దేశాయ్‌ తన కొచార్బ్‌ బంగ్లాను ఆశ్రమానికి అద్దెకు ఇచ్చారు. దీనికి సత్యాగ్రహ ఆశ్రమం అని పేరు పెట్టారు. దక్షిణాఫ్రికా నుంచి తనతో వచ్చిన కొంతమందికి కూడా పక్కనున్న బంగళాల్లో వసతి కల్పించారు. స్థానికులు కూడా ఆశ్రమంలో ఉండటానికి ఆసక్తి చూపించారు. అయితే ఆశ్రమంలో ఉండటానికి... బ్రహ్మచర్యం, సత్య సాధన, అహింస, విదేశీ వస్త్రాలు ధరించకపోవటం, అంటరానితనాన్ని పాటించకపోవటంలాంటి కఠిన నిబంధనలు పెట్టారు గాంధీజీ. అన్నీ బాగానే ఉన్నా... అంటరాని కుటుంబాలను కూడా ఇక్కడికి అనుమతిస్తామనటం ఆశ్రమానికి ఆర్థిక సాయం చేసే కొంతమంది వ్యాపారవేత్తలకు నచ్చలేదు. వారు తమ సాయాన్ని నిలిపేశారు. అయినా గాంధీజీ వెనక్కి తగ్గలేదు. ఆశ్రమానికి ఏడాదికి రూ.6వేలు ఖర్చయ్యేది. ఇతర దాతల నుంచి సాయం అందటంతో గాంధీజీ తన ప్రయోగాలతో ముందుకు వెళ్లారు.

కొచార్బ్‌లో సత్యాగ్రహ ఆశ్రమం ఏర్పాటైన నాలుగు నెలలకు అస్పృశ్యులుగా సమాజం భావించే కుటుంబం ఒకటి బొంబాయి నుంచి వచ్చింది. దుదాబాయ్‌ అనే ఉపాధ్యాయుడు తన భార్య దాని బెన్‌, కుమార్తె లక్ష్మిలతో కలసి ఆశ్రమంలో ఉండాలనుకున్నారు. ఆశ్రమవాసులు దీనికి అభ్యంతరం తెలిపారు. చాలామంది వారితో కలసి భోజనం చేయటానికి నిరాకరించారు. గాంధీజీ సహధర్మచారిణి కస్తూర్బా సైతం వారితో గళం కలిపి... ఆశ్రమాన్ని వీడి వెళతామంటూ బెదిరించారు. కానీ గాంధీజీ వాటన్నింటికి బెదరలేదు. "ఆశ్రమంలో అంటరానితనానికి చోటే లేదు. కావాలంటే నువ్వే వెళ్లిపో" అంటూ కస్తూర్బాకు తేల్చిచెప్పారు గాంధీజీ. ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం సాగింది. కుమారులు రామ్‌దాస్‌, దేవదాస్‌లు సర్దిచెప్పగా కస్తూర్బా కాస్త తగ్గారు. కొద్దిరోజుల తర్వాత ఏ కుటుంబాన్నైతే వద్దన్నారో వారితోనే ఆమెకు అన్యోన్య బంధం ఏర్పడింది. ఈ ఆత్మీయ బంధం ఎంతగా బలపడిందంటే... తమకు అమ్మాయి లేదు కాబట్టి... గాంధీ అనుమతితో... లక్ష్మిని దత్తత తీసుకున్నారు కస్తూర్బా!

అలా... అంటరానితనం విషయంలో విజయవంతమైన గాంధీజీ... తన ఆశ్రమంలో పాడిపంట, ఖాదీ, విద్య, ఆత్మనిర్భరతలాంటివాటిపై చాలా ప్రయోగాలు చేయాలనుకున్నారు. అందుకే ఈ బంగ్లాకంటే విశాలమైన ప్రదేశం కోసం అహ్మదాబాద్‌ చుట్టూరా వెదికారు. చివరకు సబర్మతి నది ఒడ్డున 36 ఎకరాల స్థలం కొనుగోలు చేసి 1917 జూన్‌ 17న అక్కడికి మారారు. అహ్మదాబాద్‌లోని తన స్నేహితులైన వ్యాపారులిచ్చిన డబ్బులతో గాంధీజీ దీన్ని నిర్మించారు. సబర్మతి సెంట్రల్‌ జైలు ఒకవైపున శ్మశానం మరోవైపున... మధ్యలో ఈ ఆశ్రమం. స్థలపురాణాల్లోనూ దీన్ని ధర్మయుద్ధం కోసం దధీచి రుషి తన ఎముకల్ని దానమిచ్చిన ప్రాంతంగా పేర్కొంటారు. "సత్యాన్వేషణకు నిర్భయంగా కార్యక్రమాలు చేపట్టడానికి ఇది సరైన స్థలం" అంటూ తన ప్రయోగాలకు ఆశ్రమాన్ని వేదిక చేసుకున్నారు గాంధీజీ. అనేక మంది భారత స్వాతంత్య్ర సమరయోధులూ ఇక్కడి నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టారు. భారత జాతీయోద్యమం ఇక్కడి నుంచే కొత్త రూపురేఖలు దిద్దుకుంది. 1931లో ఉప్పుసత్యాగ్రహం దండి యాత్రకు బయల్దేరే దాకా గాంధీజీ ఇక్కడి నుంచే తన వ్యూహాలకు పదును పెట్టారు. స్వాతంత్య్రం సాధించాకే తిరిగి వస్తానంటూ 1931 మార్చి 12న ఆశ్రమాన్ని వీడిన ఆయన మళ్లీ ఇక రాలేదు. ఉప్పుసత్యాగ్రహం తర్వాత ఆంగ్లేయులు ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1933లో ఆయన సబర్మతి ఆశ్రమాన్ని వదిలేసుకుంటున్నట్లు ప్రకటించినా స్థానికులు దాన్ని రక్షించుకున్నారు. మహాత్ముడి స్మారకంగా ఇప్పటికీ ఈ ఆశ్రమం కొనసాగుతోంది.

ఇదీ చూడండి:భారత్​లో వేడికి ఆంగ్లేయులు విలవిల.. అమెరికా నుంచి ఐస్​..!

ABOUT THE AUTHOR

...view details