తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దోపిడీ కోసమే 'రైత్వారీ'.. రైతులను దారుణంగా హింసించి...

AZADI KA AMRIT: మీరు సాగు చేస్తున్న భూమి మీదే అన్నారు. మీ వారసులకు ఇచ్చుకోవచ్చని ఆశ చూపారు. కొత్తగా కావాలన్నా తీసుకోండని ప్రోత్సహించారు. మీ ఇష్టం వచ్చిన పంటను వేసుకోండన్నారు. ఈ క్రమంలో సొంతరాజులకు భిన్నంగా పొలాలపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు అన్నదాతలు ఎగిరిగంతేశారు. సంబరాలు చేసుకున్నారు. తమ జీవితాలను మార్చాడంటూ తెల్లదొర మన్రోను 'ముని'ని చేశారు. అయితే... ఆయన ఆదాయమే పరమావధిగా పనిచేసే ఆంగ్లేయుడనే విషయాన్ని మరిచారు. కాలక్రమంలో దారుణ హింసలకు గురయ్యారు.

AZADI KA AMRIT
AZADI KA AMRIT

By

Published : Apr 10, 2022, 7:28 AM IST

Ryotwari system farmers protest: నిజాం నవాబు 1800 సంవత్సరంలో రాయలసీమ జిల్లాలను బ్రిటిష్‌ వారికి ధారాదత్తం చేశారు. అందుకే వాటికి దత్త మండలాలు అనే పేరు స్థిరపడింది. అప్పటి వరకు రాయలసీమలో పన్నుల వసూలు, తీర్పులు చెప్పే అధికారాన్ని పాలెగాళ్లు కలిగి ఉండేవారు. వీరిలో ప్రతి ఒక్కరికీ కొన్ని గ్రామాలు, చిన్నపాటి కోట, కొంతమేరకు సైన్యం కూడా ఉండేది. ఈ సైన్యం వెన్నుదన్నుతోనే వీరంతా రైతులు, ప్రజల నుంచి పన్నులను వసూలు చేసుకునేవారు. అందులో నుంచే నవాబుకు కప్పం కట్టేవారు. అలాంటి సమయంలో దత్త మండలాలన్నీ బ్రిటిషర్ల పరమయ్యాక పాలెగాళ్లను తొలగించారు. తొలిసారిగా థామస్‌ మన్రో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మునుపెన్నడూ ఊహించనట్లుగా భూములపై హక్కులను కల్పించడంతో రైతులు అమితానంద పడ్డారు. కొత్తగా భూమిని సాగులోకి తేవడానికి, ఇష్టమైన విత్తనాలు వేయడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వారు మన్రోను వేనోళ్ల పొగిడారు. ఆయనను 'మాండవ ముని'గా పిలుచుకున్నారు. ఈ విధానం మొదట్లో బాగానే పనిచేసినా... ఆదాయమే పరమావధిగా పనిచేసే బ్రిటిషర్లు రైతుల ఆనందాన్ని ఎక్కువ కాలం నిలవనీయలేదు. 'దిట్టం' అనే విధానాన్ని ప్రవేశపెట్టి మరిన్ని బాధల్లోకి నెట్టారు.

.

స్థిరాదాయమే లక్ష్యం
రెవెన్యూ ఉద్యోగులు ప్రతి సంవత్సరం పంటల సాగుకు ముందే గ్రామాలకు వచ్చి... రైతుల ఆధీనంలోని భూమి, సాగవుతున్న పంటలు, చెల్లించాల్సిన పన్ను, పొలాలను వదిలేసిన వారి పేర్లు, నిరుపయోగ భూముల వివరాలను రాసుకునేవారు. ఒక గ్రామం నుంచి రావాల్సిన వార్షికాదాయం ఏ ఏడాదీ తగ్గకుండా చూసేవారు. అందుకే ఎవరైనా సాగును వదిలేస్తే... ఆ పొలాలను వాటి హద్దుల్లో ఉన్న రైతులకు బలవంతంగా అప్పగించేవారు. దీన్నే 'కట్టుదిట్టం/దిట్టం' అనే వారు. అదనంగా వచ్చిన భూమిలో పంట సాగు చేసినా, చేయకున్నా... పంటల దిగుబడి వచ్చినా రాకున్నా... రైతులు మాత్రం శిస్తు కట్టాల్సిందే. అదికూడా నగదు రూపంలో చెల్లించాలనే నిబంధన విధించారు. లేదంటే దారుణ దండనలు ఉండేవి. రైతులెవరైనా అదనపు భూమి వద్దంటే జైళ్లలో పెట్టేవారు. వ్యవసాయ పరికరాలను జప్తు చేసేవారు. పశువులను లాక్కెళ్లేవారు. కొరడా దెబ్బలు సైతం తప్పేవి కావు. ఈ బాధలు భరించలేక రైతు కుటుంబాలు రాత్రికిరాత్రే ఊళ్లను వదిలేసి పట్టణాలకు వలస వెళ్లేవి. అడవుల్లో తలదాచుకునేవి. అందుకే మొదట్లో మన్రోను 'మాండవ ముని'గా కొలిచిన రైతులే తమను చక్రబంధంలో ఇరికించిన కర్కోటకుడిగా భావించారు. కొందరు ఏకమై తిరుగుబాటు చేశారు. పన్నుల చెల్లింపునకు మొండిగా నిరాకరించారు. ఫలితంగా ఆంగ్లేయులు రైత్వారీ విధానాన్ని అయిదేళ్లకే వెనక్కి తీసుకోక తప్పిందికాదు.

ABOUT THE AUTHOR

...view details