Azadi Ka Amrit Mahotsav: జాతీయోద్యమంలో నాయకులు కాకుండా సామాన్యులు సారథ్యం వహించిన ఘట్టం క్విట్ ఇండియా! విజయమో వీరమరణమో తేల్చుకుందామంటూ గాంధీజీ పిలుపు ఇవ్వగానే... ఆయనతో పాటు జిల్లా స్థాయిల దాకా కాంగ్రెస్ నాయకులందరినీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అరెస్టు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. తద్వారా ఉద్యమం విస్తరించకుండా చూడాలనుకుంది. కానీ నాయకులు లేకుండానే ప్రజలే ముందుండి నడిపించారు. ఆ క్రమంలో ఏర్పడ్డవే సమాంతర సర్కార్లు. వాటిలో సతారా (మహారాష్ట్ర), బలియా (ఉత్తర్‌ప్రదేశ్), తల్చార్ (ఒడిశా), తామ్లుక్ (బెంగాల్)లు ఆంగ్లేయులకు చుక్కలు చూపించాయి.
సతారా... తుపాన్ సేన
మహారాష్ట్రలోని సతారాలో దాదాపు 300 గ్రామాల ప్రజలతో ముఖ్యంగా రైతుల మద్దతుతో సమాంతర ప్రభుత్వం ఏర్పడింది. దీన్నే ప్రతి సర్కార్ అనేవారు. నానాపటేల్ సారథ్యంలో వెలసిన ఈ సమాంతర ప్రభుత్వంలో వైబి చవాన్, అచ్యుత్ పట్వర్ధన్‌లు కూడా భాగస్వాములు. ప్రభుత్వ కార్యాలయాలపై గెరిల్లా తరహా దాడులు చేస్తూ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నారు. దేశమంతటా పోలీసులను తప్పించుకోవటానికి నాయకులు అజ్ఞాతంలోకి వెళితే... ఇక్కడేమో ఉద్యమకారులను తప్పించుకొని పోలీసులు దాక్కున్నారు. కొంతమందేమో సమాంతర సర్కారుతో కలసిపోయి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం మానేశారు. రైల్వే, టెలిగ్రాఫ్ లైన్లను దెబ్బతీసి.. మిగిలిన పట్టణాలతో సంబంధాలను తెంచేశారు. అదే సమయంలో... రైతులకు లాభం చేకూర్చే మార్కెట్, పంపిణీ వ్యవస్థను, శాంతి భద్రతలను కాపాడటానికి తూపాన్ సేనను, వివాదాల పరిష్కారానికి న్యాయదాన్ మండళ్లను ఏర్పాటు చేశారు. తనఖా పెట్టిన భూములను రైతులకు ఇప్పించారు. 1942 నుంచి 1945 దాకా ఈ సమాంతర సర్కారు విజయవంతంగా కొనసాగింది.
బలియాలో జాతీయ సర్కార్
తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చిట్టూపాండే సారథ్యంలో ఏర్పడింది జాతీయ సర్కార్. ఇక్కడా కిసాన్ సభదే కీలకపాత్ర. వారి దాటికి తట్టుకోలేక కలెక్టర్ అధికారాలన్నింటినీ అప్పగించి... అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ స్ఫూర్తి పక్కనున్న బిహార్‌లోని భాగల్‌పుర్ ప్రాంతాలకు కూడా పాకింది. ప్రజలు స్వతంత్ర మండల్‌గా ఏర్పడి వివిధ విభాగాలను జిల్లా, తాలూకా వారీగా విభజించుకున్నారు.
ఒడిశా కిసాన్-మజ్దూర్ రాజ్
ఒడిశాలోని తల్చార్ సంస్థానంలో రైతులు, కార్మికులు కలసి సొంత ప్రభుత్వాన్ని ప్రకటించుకున్నారు. సతారా మాదిరిగానే మిగిలిన ప్రాంతాలతో సంబంధాలను తెంచేసి సమాంతర సర్కారును ఏర్పాటుచేశారు. వీరిపై నమ్మకంతో గ్రామాలు, తాలూకాల్లోని అన్ని విభాగాల అధికారులు కూడా సహకరించారు. పోలీసులు సైతం కలసిపోయారు. అందరికీ ఓటు హక్కు ఇస్తూ... గ్రామ, తాలూకా, డివిజన్ స్థాయిల్లో గ్రామస్వరాజ్యానికి తెరలేపారు. ఒక్క తల్చార్ పట్టణం తప్పిస్తే అన్ని గ్రామాలూ ఈ సర్కారు కిందికే వచ్చాయి. తల్చార్ సంస్థానాధీశుడు బ్రిటిష్ సైన్యం, రాయల్ వాయుసేన సాయంతో రాజప్రాసాదంలో ఉండిపోయాడు. లొంగిపోయి, ప్రజల పక్షాన నిలవాలని సంప్రదింపులు జరిపినా వినకుండా... బ్రిటిష్ సైన్యంతో విమానాల ద్వారా బాంబులు వేయించాడు సంస్థానాధీశుడు.