gulab kaur freedom fighter: పంజాబ్ సంగ్రూర్ జిల్లా బక్షివాలా గ్రామంలో 1890లో జన్మించిన గులాబ్ కౌర్‌ది రైతు కుటుంబం. చిన్నతనంలోనే మాన్‌సింగ్‌తో పెళ్లయింది. పంజాబ్‌లో అప్పటి ఆంగ్లేయ సర్కారు విధానాల కారణంగా అనేక మంది రైతు కుటుంబాల బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయి. ఫలితంగా.. చాలామంది పొట్ట చేతపట్టుకొని విదేశాలకు వలస వెళ్లటం మొదలైంది. ఆ క్రమంలోనే.. మాన్‌సింగ్-గులాబ్ కౌర్‌లు కూడా భారత్‌లో కష్టాల నుంచి బయటపడి, మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లాలనే లక్ష్యంతో తొలుత ఫిలిప్పీన్స్‌కు బయల్దేరారు. అప్పటికి భారత్‌లో బ్రిటిష్ సర్కారును కూల్చేసే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన గదర్‌పార్టీ విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, సింగపూర్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్‌లలోని భారతీయులపై విప్లవ కార్యకలాపాల ప్రభావం ఉండేది. అక్కడి గురుద్వారాల్లో మత ప్రార్థనల తర్వాత స్వాతంత్య్ర లక్ష్యాల గురించి ప్రసంగాలు నడిచేవి. వాటి స్ఫూర్తితో 1913లో గదర్‌పార్టీలో చేరారు మాన్-గులాబ్ దంపతులు! గదర్ కరపత్రాలు పంచటమేగాకుండా.. కార్యకర్తలకు ఆయుధాల సరఫరాలో కూడా చురుగ్గా వ్యవహరించే గులాబ్ తన గాత్రంతో అందరిలో స్ఫూర్తినింపేది. అలా ఉద్యమంలో కీలకమైన ఆ దంపతులిద్దరూ ఇకపై అమెరికా వెళ్లకుండా మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చి స్వాతంత్య్రం కోసం పోరాడాలనుకున్నారు. తీరా.. ఓడెక్కే రోజు భర్త మాన్ వెనక్కి తగ్గాడు. మనీలా నుంచి అమెరికా వెళ్లి .. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికే ప్రాధాన్యమిచ్చాడు.
భారత్‌కు వెళ్లేలా భర్తను ఒప్పించటానికి గులాబ్ ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. కట్టుకున్న భర్తతో అమెరికా వెళ్లి హాయిగా జీవించటమో.. కన్నభూమి భారత్ బానిస సంకెళ్లను తెంచటానికి పోరాటమో తేల్చుకోవాల్సిన పరిస్థితి! అత్యంత క్లిష్టమైన ఈ దశలో.. బీబీ గులాబ్ కౌర్.. పతిభక్తి కంటే దేశభక్తికే ప్రాధాన్యమిచ్చింది. భర్తను వదిలేసింది. తన ఒక చేతి గాజులను మాన్‌పై విసిరేసి.. గదర్ నేతలతో కలసి భారత్‌కు ఓడెక్కింది. వివిధ దేశాల నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న గదర్ విప్లవకారులంతా 1914లో హాంకాంగ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయుధాల సరఫరాతో పాటు.. దేశభక్తి గేయాలతో, ప్రసంగంతో గులాబ్ హోరెత్తించింది. కార్యకర్తల్లో ఇంకా కొంతమంది పోరాడాలా వద్దా అని ఊగిసలాడుతున్నట్లు కనిపించటంతో.. "కన్నభూమి కోసం పోరాటంలో ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే.. వెనక్కి తగ్గాలనుకుంటే ఇదిగో ఈ గాజులు తొడుక్కొని పక్కన కూర్చోండి. వారి స్థానంలో మేం మహిళలం పోరాడతాం" అంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది.