Jallianwala Bagh Movement: అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో 1919 ఏప్రిల్ 13న స్వాతంత్య్ర ఉద్యమకారులను అత్యంత దారుణంగా ఊచకోత కోశాక కూడా పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ డయ్యర్ మనసు చల్లబడలేదు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సమరాన్ని అణచి వేసినట్లుగానే.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు ఆలోచించడానికి కూడా భయపడేలా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అప్పుడప్పుడే విప్లవవాద భావనలు మొగతొడుగుతున్న పంజాబ్‌పై తన అధికారాన్ని, శ్వేతజాత్యహంకార మదాన్ని ప్రయోగించాడు.
జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు ముందు జరిగిన సంఘటనలు ఆంగ్లేయుల కుటిల నీతిని అద్దం పడతాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌కు స్వయం ప్రతిపత్తి ఇస్తామన్న ఇంగ్లాండు మాట తప్పింది. అంతకుముందు ఆంగ్లేయులిచ్చిన హామీని నమ్మి సైన్యంలో భారీస్థాయిలో చేరి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనేక మంది పంజాబీలకు ఇది అశనిపాతంలా తాకింది. పైగా.. ఎలాంటి విచారణ లేకుండానే జైల్లో నెట్టేసే అత్యంత క్రూరమైన రౌలత్ చట్టాన్ని తేవడం భారతీయుల్లో ముఖ్యంగా పంజాబ్‌లో పరిస్థితిని వేడెక్కించింది. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ప్రతిరోజూ నిరసనలు, ర్యాలీలతో రోడ్లపైకి వచ్చారు. భారతీయుల్లోని ఈ ఐక్యత పంజాబ్ సర్కారును ఆందోళనలోకి నెట్టింది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు పరిస్థితి తలెత్తుతుందేమోనని భయపడింది. ఫలితమే జలియన్‌వాలాబాగ్ ఊచకోత. ఆ తర్వాత కూడా పంజాబ్‌లో నిరసనలను అణచి వేసేందుకు.. 'మార్షల్ లా' ప్రకటించారు. ప్రజలపై, పత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు.
పంజాబ్ ప్రజలను నేలమీద పాకమని ఆదేశిస్తున్న అధికారులు జలియన్‌వాలాబాగ్ దుర్ఘటనకు మూడు రోజుల ముందు.. ఏప్రిల్ 10న అమృత్‌సర్‌లోని ఒక వీధిలో నుంచి ఓ క్రైస్తవ మతప్రచారకురాలు సైకిల్‌పై వెళుతుంటే కొందరు ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆమెపై దాడికి ప్రయత్నించగా స్థానికులు రక్షించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జనరల్ డయ్యర్ ఆగ్రహంతో ఊగిపోతూ.. అమృత్‌సర్‌లోని ఆ వీధిలో భారతీయులు ఎవ్వరూ నడవకూడదని, కేవలం పాకుతూ వెళ్లాలని, లేదంటే కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశాలిచ్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సైనికులను నియమించాడు. వీధిలో పాక్కుంటూ వెళ్లని, వెళ్లలేని వారిని దగ్గర్లోని కొరియన్ ఖూ (కొరియన్ అంటే కొరడా, ఖూ అంటే బావి) వద్దకు తీసుకువెళ్లి కొరడాలతో కొట్టేవారు. ఈ ఆదేశాల సంగతి తెలియని స్థానికులు అనేకమంది వీధిలో ప్రవేశించి దెబ్బలకు రక్తసిక్తమయ్యారు. చాలామంది పాకలేక కొరడాలకు బలయ్యారు. డయ్యర్ పైశాచికత్వం అక్కడితో ఆగలేదు. చాలామంది అమాయకులను ముఖ్యంగా గుడ్డివారు, దివ్యాంగులు, గర్భిణులను తీసుకొచ్చి.. ఈ వీధిలో బలవంతంగా పాకించి, పాకలేని వారిని కొరడాలతో కొట్టించి ఆనందించాడు.
కనిపిస్తే సెల్యూట్ చేయాల్సిందే..పాకడం సహా అమృత్‌సర్‌లో ఆంగ్లేయులు (సైనికులు, సామాన్య యూరోపియన్లు) ఎక్కడ కనిపించినా సరే వారికి భారతీయులు నిలబడి సెల్యూట్ చేయాలని డయ్యర్ ఆదేశించారు. జలియన్‌వాలా బాగ్ ఊచకోత తర్వాత అమృత్‌సర్‌లో అప్రకటిత బంద్ జరిగింది. దుకాణాలన్నీ మూసేశారు. వాటిని బలవంతంగా తెరిపించడానికి డయ్యర్ ప్రయత్నించాడు. వినకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. "నేనెలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. మీకు శాంతి కావాలో? యుద్ధం కావాలో తేల్చుకోండి. యుద్ధమే కావాలంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాంతి కోరుకుంటే మా ఆదేశాలను పాటించి దుకాణాలు తెరవండి. లేదంటే కాల్చిపారేస్తా. నాకు యుద్ధరంగమైనా, అమృత్‌సర్ అయినా ఒకటే. జర్మనీ, బెంగాల్‌ల ప్రభావంతో బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బద్మాష్‌ల గురించి మాకు తెలుసు. వారిని కాల్చివేస్తా. భారతీయ సిపాయిలు, సిక్కులు ఎలాంటివారో నాకు తెలుసు. మాట విని దుకాణాలు తెరవకుంటే తుపాకులతో తెరిపిస్తా. ఆంగ్లేయులపై దాడి చేసినందుకు మీరే కాదు మీ పిల్లలపైనా ప్రతీకారం తీర్చుకుంటాం" అంటూ బహిరంగ ప్రకటన జారీ చేసి పంజాబ్‌ను భయపెట్టిన క్రూరుడు జనరల్ డయ్యర్.
ఇదీ చదవండి:మేడి తిప్పి... ఆంగ్లేయుల మెడలు వంచిన కోస్తాంధ్ర రైతులు