AZADI KA AMRIT MAHOTSAV: 1895లో విదేశాల నుంచి ఆరంభమైన ప్లేగు మహమ్మారి... ఓడల ద్వారా బొంబాయిలోకి ప్రవేశించింది. చాలా తీర పట్టణాల్లో వ్యాపించింది. బొంబాయికి దగ్గరే ఉన్న పుణెను కూడా తాకింది. 1897 నాటికి లక్షన్నరకుపైగా జనాభాగల పుణెలో 300కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితిని కట్టడి చేయటానికి బొంబాయి గవర్నర్ సతారాలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్‌ను పుణె ప్లేగు నియంత్రణ కమిషనర్‌గా నియమించారు. వచ్చీ రాగానే క్వారంటైన్ కేంద్రాలు, హిందూ, ముస్లిం, పార్శీలు, యూరోపియన్లకు విడివిడిగా ఆసుపత్రులు ఏర్పాటు చేయించి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న దశలో... బ్రిటిష్ సైనికులను రాండ్ రంగంలోకి దించటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
Plague in British India
కొంతమంది ప్లేగు వ్యాధిగ్రస్తులు దాగి ఉన్నారనే అనుమానంతో... 1897 మార్చి 13 నుంచి దాదాపు 60 సైనిక దళాలు పుణెలోని ఇంటింటినీ గాలించటం ఆరంభించాయి. ఈ క్రమంలో... ఆంగ్లేయ సైనికులు విచ్చలవిడిగా లూటీలకు పాల్పడ్డారు. ఇళ్లలోంచి డబ్బు, వస్తువులు ఎత్తుకుపోయారు. అడిగింది ఇవ్వని వారిని ప్లేగు పేరుతో తీసుకెళ్లి క్వారంటైన్ కేంద్రాల్లో పడేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
plague disease during British 1897
'పుణెను రెండు మహమ్మారులు వేధిస్తున్నాయి. ఒకటి స్థానికులు చస్తుంటే... రెండోది కాపాడాల్సిన అధికారులు లూటీ చేస్తున్నారు' అని ఆ సమయంలో న్యూయార్క్ టైమ్స్‌లో కథనం ప్రచురితమైంది. సైనికులు ఒక్కో ఇంటిని 11 సార్లు గాలించినట్లు తర్వాత ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. మహమ్మారి కట్టడి పేరుతో విచక్షణారహిత అధికారాలతో రంగంలోకి దిగిన సైనికులు చాలా ఇళ్లలో అరాచకం సృష్టించారు. తలుపులు విరగ్గొట్టారు. గోడలు కూల్చేశారు. నివారణ మందు చల్లుతున్నామంటూ... ఇళ్లలోని గచ్చులన్నీ తవ్వేశారు. అడ్డుకున్నవారిని ప్లేగు వ్యాధిగ్రస్తులంటూ ఆసుపత్రులకు తరలించారు. వీటన్నింటికి పరాకాష్ఠగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటంతో పుణె కుతకుతలాడింది. ప్లేగు ఉందో లేదో చూస్తామంటూ... మహిళలను వివస్త్రలను చేసి బజారులో నడిపించారు. సిగ్గుతో, భయంతో ముడుచుకొని వారలా నడుస్తుంటే... చప్పట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు... అని అలనాటి ఓ బాధితుడు చందావార్కర్ వాపోయారు. ఈ అకృత్యాలపై ఫిర్యాదులు చేయగా... 'ప్లేగు మహమ్మారిని తక్షణమే కట్టడి చేయటానికి సైనికులు కాస్త ఉత్సాహంగా చర్యలు చేపట్టారు' అని ఆంగ్లేయ ప్రభుత్వం సమర్థించుకుంది. సైనికులను రంగంలోకి దింపిన ప్రత్యేక అధికారి రాండ్ సైతం ఒకరిద్దరిపై నామమాత్రపు చర్యలు తీసుకొని పట్టించుకోకుండా వదిలేశాడు. 'ఈ ఆంగ్లేయులకంటే ప్లేగు మహమ్మారిలోనే మానవత్వం ఎక్కువ ఉన్నట్లుంది' అని బాలగంగాధర్ తిలక్ తన పత్రికలో నిరసన ప్రకటించారు. రాండ్ చర్యలను తప్పు పట్టిన తిలక్‌పై రాజద్రోహ నేరం మోపింది.
'ప్లేగు కట్టడి పేరుతో పుణెలో చేసినట్లే మా దగ్గరా చేసుంటే రక్తం ఏరులై పారేది' అని ఆనాటి వాయవ్య రాష్ట్ర లెఫ్టినెంట్ జనరల్ ఆంటోనీ మెక్‌డొనాల్డ్ వ్యాఖ్యానించటం గమనార్హం. అదే సమయంలో బ్రిటన్‌లో పర్యటిస్తున్న గోపాలకృష్ణగోఖలే పుణెలో ఆంగ్లేయ సైనికుల అకృత్యాలను వెల్లడించటంతో ఇంగ్లాండ్‌లోనూ కలకలం చెలరేగింది. గోఖలే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఆంగ్లేయ ప్రభుత్వం సాక్ష్యాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భయంతో ఎవ్వరూ ఆంగ్లేయ సైనికులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి ముందుకు రాకపోవటంతో గోఖలే సాక్ష్యాలు ఇవ్వలేక క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అప్పటికే... రాండ్ సారథ్యంలో జరిగిన అకృత్యాలతో అట్టుడికిన పుణె ప్రజలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. అతణ్ని పుణె వాసులు క్షమించలేదు. 1897 జూన్ 22న విక్టోరియా మహారాణి వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రాండ్‌ను, మరో ఆంగ్లేయ అధికారిని చాపేకర్ సోదరులు (దామోదర్, బాలకృష్ణ, వాసుదేవ్) హత్య చేశారు. వారిని ఆంగ్లేయ ప్రభుత్వం ఉరి తీసింది.
ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: ఫిబ్రవరి 20.. తాంబూలాలిచ్చిన రోజు!