Azadi Ka Amrit Mahotsav: కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో ఎదిగిన పింగళి వెంకయ్య వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడు. గనులు, వజ్రాలు, ఆధునిక వ్యవసాయంపైనా పరిశోధనలు చేసేవారు. లాహోర్ వెళ్లి ఆంగ్లో వేదిక్ విద్యాలయంలో సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషల్లోనూ పింగళి వెంకయ్య పట్టు సంపాదించారు. అందుకే... ఆయా నైపుణ్యాల పేరిట ఆయన్ను పత్తి వెంకయ్య, డైమండ్ వెంకయ్య, జపనీస్ వెంకయ్య అని పిలిచేవారు. ప్రస్తుత తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం జమీందారు రాజా నాయని వెంకట రంగారావు కోరిక మేరకు 1909లో నడిగూడెంకు వచ్చి వ్యవసాయ శాఖ అధిపతిగా పనిచేశారు వెంకయ్య. సుగంధ ద్రవ్యాలు, వాణిజ్య పంటల సాగుతో పాటు ఈ ప్రాంతంలో పత్తి పంటను తొలిసారి పరిచయం చేశారు. ఏలూరు, చల్లపల్లి ప్రాంతాల్లోనూ అమెరికా నుంచి తెప్పించిన కాంబోడియన్ పత్తి రకాలకు స్థానిక రకాలను జోడించి కొత్తరకం నాణ్యమైన పత్తిని పండించారు. లండన్ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ ఈ ప్రయత్నాన్ని గుర్తించి... వెంకయ్యకు తమ గౌరవ సభ్యత్వం కూడా ఇచ్చి సత్కరించింది.
National Flag Designer: అలా శాస్త్ర పరిశోధనలతో సాగిన పింగళి వెంకయ్య ... క్రమంగా తన సృజనాత్మక ఆలోచనలను స్వాతంత్య్ర ఉద్యమానికీ జోడించారు. జాతీయ కాంగ్రెస్ సమావేశాల తొలినాళ్లలో బ్రిటిష్ జెండా యూనియన్ జాక్‌నే ఎగరేసేవారు. దాన్ని చూసి కలవర పడ్డ వెంకయ్య... మనదైన జెండా ఉండాలని భావించారు. జాతీయ జెండా నమూనా తయారీ మొదలెట్టారు. 1916నాటికి ఓ పుస్తకం తయారు చేశారు. అందులో భారతావని కోసం 30 రకాల పతాక నమూనాలను పొందుపరిచారు. ఈ పుస్తకం పట్టుకొని ప్రతిసారీ కాంగ్రెస్ సమావేశాలకు వెళ్లటం, వాటిని చూపించటం, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించటానికి... కాళ్లు అరిగేలా తిరగటం ఆయనకు పరిపాటిగా మారింది.
Pingali Venkiah Natioanl Flag: చివరకు... 1921 మార్చి 31న బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి స్వయంగా గాంధీజీని కలిసి తన జెండా నమూనాను సమర్పించారు. కాంగ్రెస్ సదస్సులో ఆమోదించాల్సిందిగా కోరారు. హిందూ, ముస్లింల సమైక్యతకు చిహ్నంగా... ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను పింగళి ప్రతిపాదించారు. జలంధర్‌కు చెందిన విద్యావేత్త లాలా హన్స్‌రాజ్ ఇందులో రాట్నం కూడా ఉండాలని సూచించారు. సరేనన్న వెంకయ్య వెంటనే రంగంలోకి దిగి... మూడు గంటల్లోనే కొత్త నమూనాతో ముందుకొచ్చారు. పింగళి వెంకయ్య ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోవటం గాంధీజీ వంతైంది. అయితే... సమయాభావం కారణంగా సదస్సులో జెండా తీర్మానాన్ని ఆ రోజు ప్రవేశపెట్టలేకపోయారు. తర్వాత శాంతి, అహింసలకు ప్రతీకగా తెలుపును కూడా గాంధీజీ ఈ జెండాలో జోడించారు. తన యంగ్ ఇండియా పత్రికలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి కొన్ని నమూనాలను సూచిస్తూ ఓ పుస్తకం ప్రచురించారు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని అందరికీ చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. జెండా రూపకల్పన, ఆమోదం కోసం వెంకయ్య తపన అభినందనీయం’’ అని గాంధీజీ రాశారు. అలా పత్తి వెంకయ్య కాస్తా... జెండా వెంకయ్యగా కూడా మారారు.
Indian Flag Design: తొలుత తెలుపు, మధ్యలో ఆకుపచ్చ, చివర్లో ఎరుపు రంగులతో కూడిన జెండాను ఆమోదించిన జాతీయ కాంగ్రెస్ 1931లో సవరణలు చేసింది. ఎరుపు రంగును కాషాయంగా చేసి.. రంగుల వరుసను కూడా కాషాయం, తెలుపు, ఆకుపచ్చగా మార్చారు. స్వాతంత్య్రానంతరం జెండా మధ్యలో కాంగ్రెస్ పార్టీ చిహ్నం చరఖా స్థానంలో ఆశోక చక్రాన్ని పెట్టారు. జెండా రూపంలో ఓ జాతీయ భావనను అందించిన పింగళి వెంకయ్యను మాత్రం అంతా మరచిపోయారు. స్వాతంత్య్రానంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకయ్య... నెల్లూరులో స్థిరపడి మళ్లీ విద్యారంగంవైపు మళ్లారు. జెమాలజీ (వజ్రాలు, రత్నాలు, రంగురాళ్ల అధ్యయనం)పై దృష్టిసారించి... దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి వనరులున్నాయో పరిశోధించారు. 1963 జులై 4న పేదరికంలో కన్నుమూశారు.
ఇదీ చదవండి:1824లోనే ఆంగ్లేయులపై భారతీయుల తిరుగుబాటు