తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చదువుకున్న కుర్రాడని గాలం వేస్తే.. చుక్కలు చూపించాడు! - alipur bomb blast

Pandurang Mahadev Bapat: బాగా చదువుతున్న కుర్రవాడని గాలం వేశారు. తమకు మద్దతిచ్చే భారతీయ 'బాబు'గా తీర్చిదిద్దుదామనుకున్నారు. డబ్బులిచ్చి ఉన్నత చదువు కోసం బ్రిటన్‌కు పంపించారు. తీరా అతగాడు బాంబుల తయారీ నేర్చుకొని వచ్చాడు. స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ఆంగ్లేయుల కంట్లో నలుసైన అరుదైన సమర యోధుడు.. విప్లవగాంధేయవాది సేనాపతి పాండురంగ మహాదేవ్‌ బాపట్‌!

AZADI KA AMRIT
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

By

Published : Jun 10, 2022, 8:45 AM IST

Pandurang Mahadev Bapat: భారతీయ యువతరం స్వాతంత్య్ర ఉద్యమం వైపు వెళ్లకుండా, విప్లవమార్గం పట్టకుండా ఉండటానికి.. ఆంగ్లేయ సర్కారు అనేక తాయిలాలిచ్చేది. ఉపకారవేతనాలు, ఉద్యోగాలు, విదేశాల్లో చదువుకు సాయం రూపంలో ప్రలోభపెట్టేది. ఆ క్రమంలో మహారాష్ట్రకు చెందిన బాపట్‌ ఆంగ్లేయులకే గాలం వేశాడు.

1880లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పార్నర్‌లో దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పాండురంగ మహాదేవ్‌ బాపట్‌ బాలమేధావి. పుణెలోని దక్కన్‌ కళాశాలలో సీటు రావడం బాపట్‌ జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. అక్కడే విప్లవసంస్థ చాపేకర్‌ క్లబ్‌ సభ్యుడైన దామోదర్‌ బల్వంత్‌ భిడేతో పరిచయమైంది. వలస పాలకుల అరాచకాలు యువ బాపట్‌ను ఆలోచనలో పడేశాయి. సంస్కృతం, తత్వశాస్త్రంలో పట్టాతో 1904లో కళాశాల నుంచి బయటికొచ్చిన ఆయన ప్రతిభను గుర్తించిన ఆంగ్లేయ సర్కారు.. ఉపకారవేతనంతో ఉన్నత చదువులకు బ్రిటన్‌కు పంపిస్తామంది. సాంకేతిక విద్యపై మక్కువున్న బాపట్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఎంచుకొని బ్రిటన్‌ చేరుకున్నారు. అక్కడ ఇండియన్‌ హౌస్‌ కేంద్రంగా భారత స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న కృష్ణశ్యాంజీ, వీర దామోదర్‌ సావర్కర్‌ తదితరులతో స్నేహం కుదిరింది. భారత స్వాతంత్య్రానికి విప్లవమే మార్గమని నమ్మాడు బాపట్‌. 1906 జనవరిలో.. ఎడింబరోలో ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ సమావేశం జరిగింది. అందులో బాపట్‌... భారత్‌లో బ్రిటిష్‌ పాలనపై ప్రసంగించారు. తాను వారి ఆర్థిక సాయంతో వారి దేశానికి వచ్చి చదువుతున్నాననే సంగతి స్పృహలో ఉండి కూడా ఏమాత్రం భయపడలేదు. ఆంగ్లేయుల అరాచకాలను అందరికీ అర్థమయ్యేలా ధైర్యంగా ఏకరువు పెట్టారు. ఫలితం.. వెంటనే ఆయనకిచ్చిన ఆర్థిక సహకారాన్ని ఆంగ్లేయ సర్కారు వెనక్కి తీసుకుంది. వేధించటం మొదలెట్టింది. 1907లో పారిస్‌ వెళ్లి.. అక్కడి నుంచి పనిచేస్తున్న విప్లవకారులతో కలిశారు. బాంబులు తయారుచేయడం, వాటిని ఉపయోగించడం నేర్చుకున్నారు. బ్రిటన్‌ పార్లమెంటుపైనే బాంబులు వేద్దామని ప్రణాళిక రచించారు. కానీ వృథా ప్రయత్నాలు చేయొద్దంటూ సావర్కర్‌ వారించటంతో వెనక్కి తగ్గారు.

1908లో భారత్‌కు తిరిగివచ్చి.. బెంగాల్‌ అనుశీలన్‌ సమితి విప్లవకారులతో కలిసి బాంబు ప్రయోగాలు చేశారు. తాను నేర్చుకొని వచ్చిన బాంబు తయారీ విద్యను కలకత్తా యువకులకు నేర్పారు. అప్పట్లో సంచలనం సృష్టించిన అలీపుర్‌ బాంబు దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. రహస్యంగా దేశవ్యాప్తంగా పర్యటించారు. ఈ పర్యటన బాపట్‌ భావజాలాన్ని మార్చింది.

దేశమంతా జైలేనంటూ..: దేశంలోని చాలామందికి తామింకా విదేశీ పాలనలో ఉన్నామనే సంగతే తెలియదని గుర్తించిన ఆయన.. ఆంగ్లేయులపై పోరాటంలో తొలుత ప్రజలను తట్టిలేపాలని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ.. 1912లో అరెస్టై 1915లో విడుదలయ్యారు. కొద్దిరోజులు తిలక్‌ను అనుసరించి.. ఆయన మరణానంతరం.. గాంధీజీ అహింసా విధానానికి ఆకర్షితులయ్యారు. అయితే.. అవసరమైనప్పుడు ఆయుధం చేపట్టాల్సిందేననేవారు. 1921లో పుణె జిల్లాలోని ముల్షి ఆనకట్ట నిర్మాణానికి వ్యతిరేకంగా.. సత్యాగ్రహం చేపట్టారు. ప్రజల్ని నిర్వాసితుల్ని చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేశారు. భారత్‌లో ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన తొలి ఆందోళన ఇదేనంటారు. ధైర్యంగా నిలిచి.. సామాన్యులకు సారథిగా పోరాటం చేస్తున్నందుకుగాను బాపట్‌ను ప్రజలు సేనాపతి అంటూ పిలవసాగారు. జలసమాధి అవుతానంటూ బెదిరించటంతో.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నందుకు బాపట్‌ను ఆంగ్లేయ సర్కారు అరెస్టు చేసింది. బయటకు వచ్చాక కూడా.. దేశమంతా జైలులానే ఉందంటూ.. ఖైదీ దుస్తుల్లోనే ఉండేవారాయన. మొత్తం 17 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన బాపట్‌... స్వాతంత్య్రానంతరం గోవా విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. చివర్లో దేశంలో అవినీతిని చూసి కలత చెందిన ఆయన.. 1967 నవంబరు 28న కన్నుమూశారు. పుణె, ముంబయిల్లో అనేక చోట్ల సేనాపతి బాపట్‌ పేరిట స్మారకాలు నేటికీ కనిపిస్తాయి.

ఇవీ చదవండి:మర్యాదస్తుల ఆటలోనూ వివక్షే.. ఎదురించిన నెల్లూరువాసి!

వైకోమ్ సత్యాగ్రహం.. అరుదైన ఉద్యమం.. దిగొచ్చిన రాజకుటుంబం

ABOUT THE AUTHOR

...view details